Idream media
Idream media
మనం ఎవరి మీద యుద్ధం ప్రారంభిస్తామో, చివరికి వాళ్లతో చేతులు కలుపుతాం
-జార్జ్ ఆర్వెల్
తెలుగుదేశం పార్టీ ప్రారంభమై 38 ఏళ్లు. అపుడు నా వయసు 19 ఏళ్లు. రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి. ఈనాడులో కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడే వార్తలొచ్చేవి. కమెండో, ఎన్‌కౌంటర్ పత్రికలు నాయకుల అవినీతి గురించి రాసేవి. కాంగ్రెస్‌కి ఒక దిశ, దశ వుండేవి కావు. అంతా ఢిల్లీ పాలన. నిత్య అసమ్మతి . ప్రజల గురించి పట్టించుకునే వాళ్లు లేరు.
ఆ సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు. మార్చి 29 నాటికి ఆయన మీద ఎవరికీ నమ్మకం లేదు. అంతకు మునుపు రెడ్డి కాంగ్రెస్ , జనతా పార్టీలు కాంగ్రెస్‌తో యుద్ధం చేయలేక పోయాయి. ఆ పార్టీ తరపున గెలిచిన వాళ్లు కూడా కాంగ్రెస్ (ఐ)లో చేరిపోయారు. ఇందిరమ్మకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పేరు అలాంటిది. పార్టీ చీలికలు పేలికలతో ఉన్నా, ఆమె బొమ్మని చూస్తే జనం ఓటు వేసే రోజులు.
సినిమా నటుడిగా తప్ప, రాజకీయాల్లో ఎన్టీఆర్ శక్తి ఏంటో ఎవరికీ తెలియదు. ఆ భారాన్ని ఈనాడు భుజాన వేసుకుంది. ఎన్టీఆర్ వూరూరు తిరిగాడు. కాంగ్రెస్‌పైన ఉన్న రోత కొద్దీ, ఆ పార్టీ వీరాభిమానులు కూడా ఎన్టీఆర్ వైపు తిరిగారు. ఇందిరమ్మ అంటే ప్రాణం పెట్టే అనంతపురంలో , ఆమె సభకి అడ్డంకులు కలిగాయి. ఆమెని ప్రసంగించకుండా అడ్డు తగిలారు.
కాంగ్రెస్ కంచుకోట అనంతపురంలో 12 సీట్లు టీడీపీ గెలిచింది. గెలిచిన వాళ్లంతా మొదటిసారి గెలిచారు. ఆ రోజుల్లో అనంతపురం నుంచి హైదరాబాద్‌కి ఒకేఒక ఆర్టీసీ బస్సు ఉండేది. గెలిచిన ఎమ్మెల్యేలు బస్సులో రాజధానికి వెళ్లారు. సొంత కార్లు ఎమ్మెల్యేలకు కూడా లేని కాలం.
తెలుగుదేశం మీద జనం చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్టీఆర్‌కి ఆశయానికి, ఆచరణకి మధ్య తేడా తెలియదు. ఇష్టమొచ్చిన ఉత్తర్వులు ఇచ్చేవాడు. వాస్తవానికి అవి చాలా మంచివి. అమలు మాత్రం ఘోరంగా ఉండేది.
రిటైర్‌మెంట్ వయసు హఠాత్తుగా తగ్గిస్తే పరిపాలనలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లు ట్యూషన్లు చెప్పకూడదన్నారు. ట్యూషన్లకి అలవాటు పడిన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రయివేటు ప్రాక్టీస్ రద్దు అంటే చాలా మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆస్పత్తులు ఖాళీ అయ్యాయి. హోటళ్లలో జనతా సెక్షన్ పెడితే , ఇడ్లీలకు బదులు తెల్లటి గుండ్రాళ్లు వడ్డించి కస్టమర్లు పారిపోయేలా చేశారు.
తెలుగు సమాచారం పత్రికని పావలాకి అమ్మారు. పాఠకులకి బదులు పాతపేపర్ల వాళ్లు కొన్నారు. మంత్రులందరినీ రద్దు చేశారు. ఎన్టీఆర్ హయాంలో కరవు మంత్రి కూడా ఉండేవాడు. మళ్లీ కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చింది. ఐదేళ్లు మళ్లీ ఇష్టారాజ్యం. ఎన్టీఆర్ మళ్లీ అధికారంలోకి, ఇక్కడి వరకూ ఒక అంకం.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు అధికారం లాక్కున్నాడు. అప్పటి వరకూ ఎంతో కొంత పార్టీ లక్షణాలుండేవి. దాన్ని బాబు ఒక కార్పొరేట్ కంపెనీగా మార్చాడు. ప్రాఫిట్ అండ్ లాస్ ముఖ్యం. వ్యవస్థలను మేనేజ్ చేయడమే లక్ష్యం. గెలవాలంటే డబ్బు మద్యం పంచాలి. పార్టీలో నిజాయితీగా పని చేసే వాళ్లు పక్కకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలకు కార్లు లేని కాలం పోయింది. అనామకులుగా ఉన్న వాళ్లు కోట్లకు పడగలెత్తారు. పాలనలో మానవీయ కోణం పోయి కంప్యూటర్ కోణం వచ్చేసింది.
ఫలితంగా మళ్లీ కాంగ్రెస్. ఆ తర్వాత వైఎస్ మృతి. జగన్ పార్టీ ఆవిర్భావం. 2014లో జగన్ అతి విశ్వాసం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఐదేళ్లు అమరావతి పేరుతో చంద్రబాబు కాలం గడిపేశాడు. లోకేష్‌ని తెచ్చి పార్టీని అధ్వాన్న స్థితికి నెట్టేశారు. కోటీశ్వరుల పార్టీగా మార్చేశాడు. సామాన్య కార్యకర్తలే పార్టీకి బలం అని మరిచిపోయాడు. ఎమ్మెల్యేలను లాగేస్తే జగన్ పార్టీ బలహీనపడుతుందని తప్పుడు అంచనా వేశాడు. ఎమ్మెల్యేలతో పార్టీలు బతకవు. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన 70 శాతం మంది కొత్తవాళ్లు. ప్రజలకి విసుగొస్తే వాళ్లే కొత్త నాయకుల్ని తయారు చేసుకుంటారు.
38 ఏళ్ల పార్టీ ఈ రోజు అంపశయ్యపై వుంది. ఇది చంద్రబాబు స్వయంకృతాపరాధం. పార్టీలో ఎవర్నీ ఎదగకుండా చేశాడు. చెట్టు ఎండిపోతే పక్షులుండవు, ఎగిరిపోతాయి. ఇపుడు పార్టీ పరిస్థితి అదే. కోమాలో ఉన్న తెలుగుదేశం బతకాలంటే అది జగన్ చేతిలోనే ఉంది. ఆయన తప్పులు చేస్తే దానికి ప్రాణం లేస్తుంది. చరిత్రలో పాలకులే తమ ప్రత్యర్థులని సిద్ధం చేసుకుంటారు. తెలుగుదేశం పార్టీ చావుబతుకులు జగన్ పాలనా విజ్ఞత మీద ఆధారపడి ఉన్నాయి.