iDreamPost
android-app
ios-app

బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జ‌న‌సేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కార‌ణాలున్నాయా?

బద్వేల్ ఉప ఎన్నిక టీడీపీ, జ‌న‌సేన ఔట్ : నిజంగా సానుభూతేనా? లేక ఈ కార‌ణాలున్నాయా?

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు తెలియ‌జేశాయి. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్‌ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని టీడీపీయేనని నెల‌కొలిపింద‌ని, ఆ సంప్ర‌దాయాన్ని పాటిస్తూ పోటీ నుంచి త‌ప్పుకున్న‌ట్లు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో పేర్కొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నిక వచ్చిందని, చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని పవన్ ప్రకటించారు. ఇత‌ర పార్టీలు త‌ప్పుకోవాల‌ని కూడా ప్ర‌తిపాదించారు. నిర్ణ‌యాలు బాగానే ఉన్నాయి కానీ.. వాటి వెనుక ఉన్న చిత్త‌శుద్ధిపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

జ‌న‌సేన ప్ర‌క‌ట‌న అనంత‌రం.. ఇప్పుడు సంప్ర‌దాయం పేరుతో.. పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన టీడీపీ.. మ‌రి అభ్య‌ర్థిని ఎందుకు ప్ర‌క‌టించిన‌ట్లు అన్న ప్ర‌శ్న స‌హ‌జంగానే ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దానికి స‌మాధానం చెప్పాల్సి ఉంది. ఇత‌ర పార్టీలో బ‌రిలో లేకుండా.. టీడీపీ, వైసీపీ మ‌ధ్యే పోటీ ఉండి ఘోర ప‌రాజ‌యం పొందితే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించిందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నిక ఏదైనా టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌డం లేదు. గెలుపోట‌ములు స‌హ‌జ‌మే కానీ.. మ‌రీ ఘోరంగా ఆ పార్టీ విఫ‌ల‌మ‌వుతోంది. అలాంటి ప‌రిస్థితుల్లో బ‌ద్వేల్ లో పోటీ చేస్తే ఫ‌లితం ఎలా ఉంటుందో అన్న అనుమానం నేత‌ల‌ను మొద‌టి నుంచీ వెంటాడుతూనే ఉంది. అలాగ‌ని పోటీ చేయ‌క‌పోతే.. పార్టీలో ఉన్నా లేక‌పోయిన‌ట్లే అని ప్ర‌జ‌లు భావించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పోటీకి సిద్ధ‌మై అభ్య‌ర్థిని ప్ర‌కటించింది. మ‌రి ఇప్పుడు హ‌ఠాత్తుగా సంప్ర‌దాయం అంశం తెర‌పైకి తేవ‌డం వెనుక కార‌ణ‌మేంటి?

Also Read : బద్వేలు ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ అధికారిక ప్రకటన

బ‌ద్వేల్ లో ఆ పార్టీలు పోటీ చేసినా, చేయ‌క‌పోయినా గెలుపు వైసీపీదే అన్న స్ప‌ష్టంగా చెప్పొచ్చు. ఇత‌ర పార్టీలు పోటీ ఉంటే.. ఎటొచ్చి మెజార్టీ ద్వారా బ‌లాబ‌లాలు గ‌తం కంటే ఎలా ఉన్నాయోన‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేది. లోక్ స‌భ ఉప ఎన్నిక జ‌రిగిన తిరుప‌తి కూడా వైసీపీ సిట్టింగ్ స్థాన‌మే. కాక‌పోతే.. దివంగ‌త ఎంపీ కుటుంబ‌స‌భ్యుడికి ఎమ్మెల్సీ ఇచ్చి.. వేరొక‌రిని పార్టీ బ‌రిలోకి దింపింది. ఆ విష‌యం ప‌క్క‌న బెడితే అక్క‌డ కూడా పోటీ చేయ‌కుండా వైసీపీని ఏక‌గ్రీవం చేయ‌వ‌చ్చు. అలా చేయ‌కుండా.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగింద‌న్న అపోహ‌తో ఉన్న ప్ర‌తిప‌క్షాలు బ‌రిలోకి దిగి.. ఆ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించాయి. తీరా ఫ‌లితాలు చూస్తే.. ప్ర‌తిప‌క్షాల‌కు చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా మారింది. గ‌తం కంటే వెనుకంజ‌లోకి వెళ్లిపోయాయి. దానికి తోడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌య విహారంతో వైసీపీపై పోటీ చేయాలంటేనే ఆలోచించాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

ఇక బ‌ద్వేల్ విష‌యానికి వ‌స్తే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో.. ఇక్క‌డ డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య వైసీపీ త‌ర‌పున పోటీ చేసి సుమారు యాభై వేల ఓట్ల మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ రెండోస్థానంలో నిలిచారు. జ‌న‌సేన పొత్తులో భాగంగా బీఎస్పీకి టికెట్ కేటాయించింది. బీఎస్పీ అభ్య‌ర్థి ఎన్‌. ప్ర‌సాద్‌కు కేవ‌లం 1321 ఓట్లు వ‌చ్చాయి. అలాగే బీజేపీ సొంతంగా పోటీ చేసి 735 ఓట్లు మాత్ర‌మే ద‌క్కించుకుంది. బీజేపీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే జ‌య‌రాములు పోటీ చేశారు. ఇక్క‌డ ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన బీఎస్పీ , సొంతంగా పోటీ చేసిన బీజేపీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు (2004) ప‌డ్డాయి. బ‌ద్వేల్ లో ఇత‌ర పార్టీల ప‌రిస్థితి ఏంటో ఈ గ‌ణాంకాలే చెబుతున్నాయి.

Also Read : బద్వేల్ పోటీ నుంచి టీడీపీ తప్పుకుంటుందా?

అలాగే వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి సీఎం జ‌గ‌న్ కోట్లాది రూపాయ‌ల నిధులు కేటాయించారు. సుమారు నాలుగు వంద‌ల కోట్ల తో వివిధ ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. బద్వేల్‌ మున్సిపాలిటీకి రూ. 120 కోట్లు కేటాయించి అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నారు. వీటికి తోడు.. ఇళ్ల స్థ‌లాల పంపిణీ, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఇక్క‌డ గ‌తం కంటే వైసీపీకి బ‌ల‌మైన పునాదులు ఏర్ప‌డ్డాయి. పైగా.. దివంగత వెంకటసుబ్బయ్య భార్య దాసరి సుధ కు టికెట్ కేటాయించారు. ఆ కుటుంబంపై స‌హ‌జ‌నంగానే ఉండే సానుభూతి ఓట్ల‌ను తెచ్చిపెడుతుంది. పైగా జ‌గ‌న్ మాట్లాడుతూ.. గ‌తంలో వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని, ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని శ్రేణుల‌కు పిలుపు ఇచ్చారు. ఈ సంద‌ర్భంలో వైసీపీ మెజార్టీ కోసం గ‌ట్టిగానే దృష్టి సారించింది.

వీట‌న్నింటినీ ప‌రిశీలించాకే టీడీపీ, జ‌న‌సేన ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకున్నాయా లేక నిజంగా సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నారా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. అద‌లా ఉంటే.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు తాము వ్య‌తిరేక‌మంటున్న బీజేపీ మ‌రి బ‌ద్వేల్ లో పోటీ చేస్తుందా, బీజేపీ బ‌రిలో ఉంటే.. జ‌న‌సేన ప్ర‌చారం చేస్తుందా? అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : జ‌గ‌న్ మౌనం.. విప‌క్షాలకు అంతుప‌ట్ట‌ని వైనం