Idream media
Idream media
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లో ఎంత మార్పు.. నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఈ ప్రశ్న తలెత్తడం సహజమే. చట్టాలను వ్యతిరేకిస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం అనూహ్యమే. ఎందుకంటే.. ఈ ఏడాది జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ ద్వారా తలెత్తిన వివాదం, ఉద్రిక్తతలతో ఉద్యమ తీవ్రతను దేశ వ్యాప్తమైంది. అయినప్పటికీ మోదీ వెనక్కి తగ్గేది లేదన్నారు. అవసరమైతే మరోమారు చర్చలు జరిపి మార్పులను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఉద్యమం ప్రారంభమై దాదాపు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. పైగా ఇబ్బందులకు గురి చేసినందుకు రైతులకు క్షమాపణలు చెప్పి ఆకట్టుకున్నారు. కొంత కాలంగా మోదీలో మార్పు కనిపిస్తోంది. దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలా..?
ఈ ఏడాదిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంలో ఈ చట్టాలపై వ్యతిరేకత కూడా ఓ కారణమే అని సర్వత్రా అభిప్రాయాలు వెలువడ్డాయి. ఇప్పుడు వచ్చే ఏడాది మరో ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన వెలువడుతున్న సర్వేలలో కేంద్రానికి అనుకూలంగా అటు, ఇటు కూడా ఉంటున్నాయి. ప్రధానంగా పంజాబ్ లో అనూహ్యంగా ఆప్ కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు అన్ని సర్వేలూ వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మోదీలో మార్పు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పెట్రో ధరలపై కూడా కేంద్రంలో కదలిక వస్తోంది. ఇప్పుడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన చర్చనీయాంశంగా మారింది. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ల్యాండ్ ఎక్విజషన్ ఆర్డినెన్స్ తప్పా దేన్నీ వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు దాని సరసన నూతన వ్యవసాయ చట్టాలు చేరాయి.
Also Read : Rakesh Tikait – రాకేష్ తికాయత్.. మోదీ మెడలు వంచిన ఒకే ఒక్కడు
రైతు సంఘాల హెచ్చరికలా?
కేంద్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోతే.. 2024 వరకు కూడా రైతుల ఆందోళనలు కొనసాగుతాయని గత నెలలో రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు మూడింటిని ( 1. నిత్యావసర సరకుల (సవరణ) చట్టం, 2. ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం, 3. ‘రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020 ) రద్దు చేయాలని ఇప్పటికే సుమారు ఏడాదిగా రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ఈ నెల 29న పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. రైతు ఐక్యత సంఘాల కమిటీ యునైటెడ్ కిసాన్ మోర్చా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. .. ఈ నెల 26లోగా వివాదాస్పద రైతు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఆ తేదీ లోపే మోదీ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ క్రమంలో రైతుల హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
లఖింపూర్ ఖేరి ఘటన పెద్ద మచ్చ
అలాగే ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరిలో జరిగిన ఘటన కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపింది. విపక్షాలన్నీ మోదీ సర్కారుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ఆ వివాదాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన పైకి కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లడంలో ఆ మంత్రి కుమారుడి పాత్ర ఉందనే దానిపై ఆధారాలు బయటపడుతున్నాయి. అక్టోబర్ 3న జరిగిన ఈ హింసలో నలుగురి రైతుల తో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా తో పాటు సహ నిందితుడిగా ఉన్న అంకిత్ దాస్ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆశిశ్, అంకిత్ లకు చెందిన లైసెన్స్ డ్ తుపాకీల నుంచి ఆ రోజు కాల్పులు జరిగినట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. వారి ఆయుధాలతో కాల్పులు జరిపారని రైతులు మొదటి నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. అది వాస్తవమని తాజాగా నిర్ధారణ అయింది.
ఈ నెల 29 తర్వాత రైతులు ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా కేంద్రానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. కరోనాకు ముందు ఈ ఉద్యమ సెగ కేంద్రానికి గట్టిగానే తాకింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ, మోదీ వ్యతిరేక కార్టూన్ లు, వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మళ్లీ ఉద్యమం ఊపందుకుంటే తలనొప్పులు తప్పవని భావించి చట్టాల విషయంలో మోదీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
Also Read : PM Modi, New Farm Laws Dismissed – ఫలించిన రైతుల పోరాటం.. సాగు చట్టాలు రద్దు..