Idream media
Idream media
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో వ్యవస్థలన్ని సక్రమంగా నడవడానికి కారణం చట్టసభలు. ప్రభుత్వాలు తీసుకొనే ఏ నిర్ణయం అయినా ముందు చట్ట సభల ఆమోదం పొందాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి మరే ఇతర అంశాలపైన ఖర్చు చేయాలన్న నిర్ణయం తీసుకోవాలన్న, చట్ట సభల్లో చర్చ జరగాల్సిందే. బిల్లు ఆమోదం పొందాల్సిందే. అధికార పార్టీల ఒంటెద్దు పోకడలకు మూకుతాడు వేసేందుకు రాజ్యాంగం మనకు చట్టసభలను ఆయుధంగా అందించింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోని చట్టసభలకు పంపిస్తున్నారు. సభ జరిగే సందర్బంలో తమ సమస్యలపై చర్చించి పరిష్కారం దొరుకుతుందని కోట్లమంది భారతీయులు చట్టసభల వైపు చూస్తున్నారు.
ప్రభుత్వాలు ఏకపక్షంగా లేదా తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకించడమే కాకుండా ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే చట్టసభల్లో మెజార్టీ ఉన్న ప్రభుత్వాలు ప్రజామోదం లేని బిల్లులను సైతం ఆమోదింప చేసుకుంటున్నారు. ఒకప్పుడు చట్టసభల్లో ప్రజా సమస్యలపై ప్రతి అంశంపైనా అర్థవంతమైన చర్చ జరిగేది. ప్రభుత్వ, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా అది గౌరవప్రదమైన స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు చట్టసభల సభ్యులు వ్యవహరిస్తున్న తీరు చట్టసభల గౌరవాన్ని రోజు రోజుకు దిగజార్చుతుంది. సభలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఎవరి ఎజెండాను వారు నెగ్గించుకునేందుకు సభలను స్తంభింపచేయడం,నిరసనలు ప్రదర్శించడం, వెల్ లోనికి దూసుకెళ్లడం,మైకులు విరగగొట్టి, పేపర్లు చింపి స్పీకర్ మీదికి విసరడం నినాదాలతో సభ నడవకుండా చేస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. చట్ట సభలకు ఎన్నికైన సభ్యులు హుందాగా వ్యవహరిస్తూ చట్టసభల సంప్రదాయాలను గౌరవించాలి. కానీ కొన్ని సందర్భాలలో సభ్యుల తీరు, మాట్లాడే విధానం అభ్యంతరకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో సభ్యులను సస్పెండ్ చేసిన తీరు మార్చుకోవడం లేదు. వీరిని చివరకు మార్షల్ తో బయటకు పంపే పరిస్థితికి తీసుకువస్తున్నారు.
వైఫల్యం ఎవరిది…
సభలను సజావుగా నడిచేలా చూడలిసిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలదే. సభలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు, తాము తీసుకువచ్చిన బిల్లుల మీద ప్రతిపక్షాల సూచనలను స్వీకరించి ప్రజల శ్రేయస్సుకోసం పని చేయాలి. కానీ తాము తీసుకువచ్చిన బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం చెప్పిన పట్టించుకునే పరిస్థితి లేదు. మెజారిటీ ఉంటే ప్రతిపక్షాల సూచనలు స్వీకరించే స్థితిలో ప్రభుత్వాలు లేవు.
Also Read : దిశ చట్టం అమలు దిశగా కేంద్రం ముందడుగు
ప్రతిపక్షాలు కూడా ఒక్కోసారి మొండిగా వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలపై కాకుండా పార్టీల ఎజెండాను నెగ్గించుకునేందుకు సభను స్తంభింపజేస్తున్నాయి. ప్రజాసమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలు విమర్శలకు దిగుతున్నారు. చివరికి సభలలో పైచేయి సాధించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయి.
చట్ట సభలకు విద్యావంతులు, మేధావులు, ప్రజాసమస్యలపై అవగాహన ఉన్న నాయకులు ఎన్నిక కాబడితే చట్ట సభలు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మన దేశంలో రాజకీయాలలో నేర చరిత్ర, డబ్బులు, వ్యాపారాలు ఉన్నవాళ్లే ఎక్కువగా ఉండడంతో చట్ట సభల్లో ప్రజాసమస్యలు అసలు చర్చకే రావడం లేదు.
వృధా అవుతున్న ప్రజాధనం..
చట్ట సభల నిర్వహణకు యేటా వేల కోట్ల ప్రజాధనం ఖర్చు అవుతుంది. అయితే ఈ సభ నిర్వహణ సమయంలో ప్రజా సమస్యలపై గాని అభివృద్ధిపై గాని చర్చ జరగకుండా ప్రభుత్వ, విపక్షాల విమర్శలు, దాడులతో అర్ధాంతరంగా వాయిదా పడడం లేకపోతే నిరవధిక వాయిదా వేయడం జరుగుతోంది. తమ సమస్యలను చర్చించేందుకు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి పార్టీల ఎజెండాలకు అనుగుణంగా చట్టసభల్లో వ్యవహరించడం దురదృష్టకరం. దేశ అత్యున్నత చట్టసభ లైన లోక్సభ రాజ్యసభ నిర్వహణకు నిమిషానికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక పార్లమెంట్ సెషన్ నిర్వహించడానికి వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఎంత ధనం ఖర్చు చేస్తున్నా రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై చర్చించకుండా పరస్పర విమర్శలతో గందరగోళానికి దారి తీసి సభలు వాయిదా పడేలా చేస్తున్నాయి. పార్లమెంట్ మాన్ సూన్ సెషన్స్ లో పెగాసిస్ ఇష్యుతో దాదాపు 133 కోట్లు నష్టపోయింది. దింతో ఒక్కో సెషన్స్ కు కోట్ల రూపాయల ప్రజా ధనం సద్వినియోగం కాకుండా దుర్వినియోగం అవుతోంది. ప్రజా సమస్యలు, అభివృద్ధి, బిల్లులపై చర్చించేందుకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందించాల్సిన అవసరం ఉంది. విపక్షాలు కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి చట్టసభల్లో అర్థవంతమైన చర్చ జరిగేలా సహకరించాలి.
రాజకీయాలను డబ్బులు శాసించడంతో ఇప్పుడు అందరు లాభాపేక్షతోనే రాజకీయాల ద్వారా చట్టసభల్లోకి వస్తున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తున్నా చట్టసభల్లో ఆ ప్రమాణాలు మరచి వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజలకోసం పనిచేసేవారికి కాకుండా పలుకుబడి ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నాయి. లాగే కోనసాగితే చట్టసభల మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది.
Also Read : లోక్ సభలో రఘురామరాజు ప్రశ్నలు అడిగే అవకాశం ఎలా వస్తుంది?