iDreamPost
android-app
ios-app

Lakhimpur incident – వ్యవసాయ చట్టాల రద్దు సరే.. వారి సంగతేంటి?

  • Published Nov 20, 2021 | 12:35 PM Updated Updated Mar 11, 2022 | 10:34 PM
Lakhimpur incident – వ్యవసాయ చట్టాల రద్దు సరే.. వారి సంగతేంటి?

రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకుందామనుకున్న బీజేపీకి ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏడాదికి పైగా సాగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 700 మంది రైతులు,లఖీంపూర్‌ ఖేరి ఘటనలో అశువులు బాసిన రైతుల సంగతేంటి అని ప్రశ్నిస్తున్నాయి. వాటికి ఎవరు బాధ్యత వహిస్తారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ ఇవే డిమాండ్లతో ప్రధాని మోదీకి లేఖ రాయడం బీజేపీకి మింగుడుపడటం లేదు.

వరుణ్ 4 డిమాండ్లు

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని చేసిన నిర్ణయాన్ని బీజేపీ ఫిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ స్వాగతించారు. ఈ మేరకు ఒక సుదీర్ఘ లేఖను మోదీకి ఆన్లైన్ లో పంపారు. చట్టాల రద్దును స్వాగతిస్తూనే.. నాలుగు కీలక అంశాలను ప్రస్తావించారు. సుదీర్ఘ కాలం సాగిన ఉద్యమంలో పాల్గొని వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేక సుమారు 700 మంది రైతులు మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నిర్ణయం ముందే తీసుకొని ఉంటే వారు బతికి ఉండేవారని అభిప్రాయపడిన ఆయన.. ఇప్పుడు వారి మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇక లఖీంపూర్‌ ఖేరిలో ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారుతో దూసుకెళ్లి, కాల్పులు జరిపి నలుగురు రైతుల మరణానికి కారణం అయ్యాడని.. కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యమం సందర్బంగా రైతులపై బనాయించిన తప్పుడు కేసులన్నింటినీ రద్దు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల విధానాన్ని కొనసాగించడంతో పాటు.. దాన్ని మరింత విస్తరించాలని సూచించారు. ఈ డిమాండ్లను ఆమోదిస్తేనే రైతులు శాంతిస్తారని లేఖలో వరుణ్ గాంధీ స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలు, రైతు ఉద్యమం విషయంలో వరుణ్ తొలినుంచీ రైతులకు మద్దతుగా మాట్లాడుతూ మోదీ సర్కారును ఇరకాటంలోకి నెడుతూనే ఉన్నారు.లఖీంపూర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కలకలం సృష్టించారు. ఈ కారణంగానే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి వరుణ్‌ గాంధీతోపాటు ఆయన తల్లి, కేంద్ర మాజీమంత్రి మేనకగాంధీని పార్టీ నాయకత్వం తప్పించింది.

అందరిదీ అదే మాట

ప్రతిపక్షాలు, రైతు సంఘాలు కూడా ఇవే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు కనీస మద్దతు ధరల కొనసాగింపుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, వ్యవసాయ చట్టాలను నిబంధనల ప్రకారం రద్దు చేసే ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఉద్యమం ఆగదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ ఇంతకు ముందే ప్రకటించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, పలువురు వామపక్ష నేతలు కూడా ఉద్యమ సమయంలో రైతుల మరణాలకు, తప్పుడు కేసులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.