iDreamPost
iDreamPost
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పార్టీ ఆవిర్భావసభలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు అనుకూల ఓటుపై దృష్టి సారించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలు అన్నీ కలసి పోటీ చేసినా వైఎస్సార్ సీపీని 2024 ఎన్నికల్లో నిలువరించగలవా? అంటే సందేహమే. 2019 ఎన్నికల్లో 50 శాతం పైగా ఓట్లతో 151 స్థానాలను అంటే 86 శాతం అసెంబ్లీ సీట్లను వైఎస్సార్ సీపీ సాధించింది. ఆ తర్వాత జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 52.63 శాతం ఓట్లు తెచ్చుకొంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 30.73 శాతం, జనసేన 4.67, బీజేపీ 2.47 శాతం ఓట్లు సాధించాయి. పరిషత్ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించింది. మొత్తం13 జెడ్పీ ఛైర్మన్ గిరిలను, 90 శాతం ఎంపీపీ పీఠాలను గెలుచుకుంది. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగరేసింది. ఒక అధికార పార్టీ ఈ విధంగా వరుస విజయాలు సాధించడం చాలా అరుదు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంతగాలేదు అనడానికి అది సాధించిన విజయాలే తార్కాణం అని పరిశీలకులు భావిస్తున్నారు.
ఆ ప్రయోగం ఆల్ రెడీ విఫలం..
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ నుంచి టీడీపీ హఠాత్తుగా తప్పుకుంది. జనసేన కూడా టీడీపీ బాటలోనే నడిచింది. బరిలో ఉన్న బీజేపీకి ఈ రెండు పార్టీలు సహాయ సహకారాలు అందించాయి. టీడీపీ అయితే ఏకంగా తమ పార్టీ వారిని బీజేపీ బూత్ ఏజెంట్లుగా నియమించింది కూడా. ఈ విధంగా ప్రతిపక్షాలు అన్నీ అనధికారంగానైనా కలసికట్టుగా బీజేపీ అభ్యర్థికోసం పనిచేసినా వైఎస్సార్ సీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.
ప్రతిపక్షాలు బలపడింది ఏదీ?
ప్రతి ఎన్నికల్లో అపజయాలు మూటగట్టుకుంటున్న ప్రతిపక్షాలు కేవలం వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓటుపై ఆధారపడి గెలుపు కలలు కనడమే విచిత్రంగా ఉంది. 2019 ఎన్నికల అనంతరం బలపడడానికి టీడీపీ, జనసేన, బీజేపీ చేసిన కృషి ఏమిటి? తమ పార్టీల ఓటింగ్ శాతం పెంచుకోవడానికి ప్రజా సమస్యలపై పోరాడాయా? వారి దృష్టిని ఆకర్షించాయా అంటే చెప్పుకోదగిన ఘటనలు లేవు. కేవలం రోజువారీ మీడీయా సమావేశాల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి టీడీపీ పరిమితం అవుతోంది. జనసేన అయితే ఆ పార్టీ అధినేత పవన్ కు వీలు చిక్కినప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. బీజేపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మీడియా ప్రకటనలతోనే సరిపుచ్చుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు అడపాదడపా ప్రజా సమస్యలపై పోరాడుతున్నా అవి చూపగలిగిన ప్రభావం అంతంత మాత్రమే. ప్రతి పక్షాలు ఈ మూడేళ్లలో తమ పార్టీలను బలపర్చుకోవడంపై, ఓటు శాతం పెంచుకోవడంపై దృష్టి సారించలేదు. మరోపక్క వైఎస్సార్ సీపీ ప్రతి ఎన్నికకు ఓటింగ్ శాతం పెంచుకుంటోంది. బలీయమైన శక్తిగా అవతరించింది. అటువంటి అధికార పార్టీని ఎదుర్కోవడానికి తమ సొంత బలంపై కాకుండా వ్యతిరేక ఓటుపై ఆధారపడి రాజకీయం చేయాలనుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న సందేహం చాలామందికి కలుగుతోంది. ఎందుకంటే బీజేపీ, కమ్యూనిస్టులు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు కలసినా వైఎస్సార్ సీపీని ఓడించే స్థాయిలో వాటి ఓటుబ్యాంకు లేదు. ఈ వాస్తవాన్ని గమనించకుండా వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అని స్టేట్మెంట్ ఇస్తే ప్రయోజనం ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.