iDreamPost
android-app
ios-app

ప‌శ్చిమ బెంగాల్ కేబినెట్ : ఎమ్మెల్యేలు కాదు కానీ మంత్రి, ముఖ్య‌మంత్రి

ప‌శ్చిమ బెంగాల్ కేబినెట్ : ఎమ్మెల్యేలు కాదు కానీ మంత్రి, ముఖ్య‌మంత్రి

హోరాహోరీగా జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో టీఎంసీ గెలిచినా, అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి స‌వాల్ చేసి మ‌రీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. సువేందు అధికారిపై ఓట‌మి పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ఈ నెల 5న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. తాజాగా పశ్చిమబెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ మంత్రివర్గం కొలువుదీరింది. ఆమె కొత్త క్యాబినెట్లో 43 మంది మంత్రులుగా చేరారు. కోల్ క‌తాలోని రాజ్ భ‌వ‌న్ లో జ‌రిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. పలువురు అనుభవజ్ఞులు మరికొందరు కొత్త వారికి మమత తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే వీరిలో ఒక‌రికి ప్ర‌త్యేకంగా కేబినెట్ బెర్త్ కేటాయించారు.

కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సుబ్రతా ముఖర్జీ పార్థ ఛటర్జీ ఫిర్హద్ హకీం జ్యోతి ప్రియ మల్లిక్ ఎం.ఘటక్ అరూప్ బిస్వాస్ డాక్టర్ షశి పంజ జావెద్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి హుమయూన్ కబీర్ బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ మనోజ్ తివారి సియులి సాహా కొత్తగా క్యాబినెట్లోకి వచ్చారు. వీరు సహాయ మంత్రులుగా కేబినెట్లో చేరారు. మొత్తం 43 మందిలో 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. కేబినెట్ పోస్ట్ దక్కిన వారిలో మమతా బెనర్జీ ముఖ్య‌మంత్రిగా ఉన్న గత రెండు ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా ఉన్న సీనియర్ నేత అమిత్ మిత్రా కూడా ఉన్నారు. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఈ సారి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. కానీ, మంత్రి ప‌ద‌వి మాత్రం అప్ప‌గించారు. ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీకి మిత్రాను తీసుకువచ్చే ఆలోచనలో మమతాబెనర్జీ ఉన్నారు.

ఒక ర‌కంగా తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. త‌న ఓట‌మిని ఇప్ప‌టికీ ఆమె అంగీక‌రించ‌లేదు. న్యాయ స్థానంలో పోరాటం చేస్తామ‌న్నారు. అద‌లాఉంటే, రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారిలో ఒక స్థానం నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌రో స్థానం నుంచి మిత్రా త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యే సువేందుకు అధికారి పేరును బీజేపీ ఖరారు చేసింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందింది. సీఎం మమతా బెనర్జీని ఓడించిన సువేందుకే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసింది.