Idream media
Idream media
కత్తి మహేష్ ప్రమాదంలో గాయపడ్డారు. బాధాకరం. అపాయం తప్పి కోలుకుంటున్నారు. ఇది సంతోషం. ఆయన ప్రమాదానికి కూడా కొందరు వక్రభాష్యాలు చెప్పి, సంతోషిస్తూ పోస్టులు పెట్టారు. అది వాళ్ల స్థాయి. సంస్కారం. సహించలేని తనం, ఇరుకు మనస్తత్వం సొసైటీలో పెరిగిపోతున్నాయి. పెరుగుతూనే వుంటాయి. పరిస్థితులు అలా వున్నాయి.
ఈ నేపథ్యంలో మహేష్ స్వరం, ఒక అవసరం. ఆయన అభిప్రాయాలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఆయనకి వుంది. దీన్ని అందరూ గౌరవించాల్సిందే. అది జరగలేదు. వేధించారు, అవమానించారు. టీవీ షోల్లో దూషించారు. కానీ మహేష్ బెదరలేదు, ఢీకొన్నాడు. తలవంచలేదు, ఎత్తుకునే వున్నాడు. బలంగా గొంతు వినిపించాడు. నిజానికి ఇప్పుడు తగిలిన గాయాలకంటే అప్పుడు తగిలిన గాయాలే ఎక్కువ. అవే తట్టుకున్నాడు. ఇవో లెక్కకాదు. ఆరోగ్యంగా తిరిగొస్తాడు.
ఏడెనిమిదేళ్ల క్రితం ఐడ్రీమ్ ఆఫీస్‌లో మహేష్ పరిచయం. తర్వాత ప్రతి శుక్రవారం ప్రసాద్‌లో కొత్త సినిమాతో విష్ చేసుకునేవాళ్లం. సినిమాపై అభిప్రాయం అడిగినా నవ్వేసేవాడు, సాయంత్రం టీవీలో బయటపడే వాడు. అంచనా మిస్‌ఫైర్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఎంత పెద్ద సినిమా అయినా బలాలు, బలహీనతలు మొహమాటం లేకుండా చెప్పేవాడు. సినిమా సమీక్షకులు చాలా నిందలు మోయాలి, మోసాడు కూడా!
2016లో నేనో సినిమాకి డైలాగ్‌లు రాసాను. మార్నింగ్ షోకే అర్థమైంది సినిమా చీదేసిందని. కానీ నిర్మాతకి, హీరోకి చెప్పలేని పరిస్థితి. పరవాలేదు యావరేజ్ అన్నాను. సినిమా హిట్టండి, రాయలసీమలో మాస్‌కి బాగా ఎక్కింది అని స్తోత్రకారులు చెప్పారు. సినిమా ఆఫీసుల్లో రచయితలు, కళాకారుల కంటే వీళ్లే ఎక్కువుంటారు. కాకపోతే ముసుగులో వుంటారు. రివ్యూలు కూడా యావరేజ్ అనే వస్తున్నాయి. కానీ ఆశ చావక కత్తి మహేష్ రిపోర్ట్ కోసం టెన్ టీవీ ముందు కూచున్నారు. నిర్మాత, హీరో మహేష్ వైపు చూసారు. దూదిని ఏకితే గాల్లోకి పింజలు పింజలు మబ్బుల్లా లేస్తాయి. అంతకంటే అన్యాయంగా ఏకి పారేసాడు. రేటింగ్ 1.5 ఇచ్చాడు.
దేవదాసు గాలివానలో, ఎడ్లబండిలో వెళ్లి కూడా పార్వతిని చూడలేక పోతాడు. అయితే సినిమా ఫ్లాపయితే అప్పులోళ్లు సునామీలో ఈదుకుంటూ, బురదలో జారుకుంటూ అయినా సరే నిర్మాతని చుట్టుముడతారు, అంత ప్రేమ.
సినిమా, రాజకీయం, మతం దేని మీదైనా సరే అర్థవంతంగా మహేష్ మాట్లాడతాడు.జ్ఞానం వెంట పడి వెక్కిరించడం అజ్ఞానపు లక్షణం. వ్యతిరేకుల సంగతి పక్కన పెడితే ఆయన కోలుకోవాలని కోరుకున్న వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. మాట్లాడగలిగి మాటలు రాని పరిస్థితిలో చాలా మంది వున్నారు. వాళ్లకి మాట్లాడే వాళ్ల పట్ల సహజంగానే అభిమానం.
థియేటర్లు తెరుస్తున్నారట! జట్కా వాడి కమ్చీ దెబ్బకి గుర్రం ఎదురు చూసినట్టు నీ కోసం సినిమా వాళ్లు చూస్తున్నారు. ఈ సారి కొరడా పట్టుకునిరా! సినిమాలు అంత సులభంగా బాగుపడవు కానీ, వస్తే ప్రసాద్ పక్కన ప్యారడైజ్‌లో మంచి టీ తాగుదాం.
Waiting for you కత్తి!
Also Read : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు