iDreamPost
android-app
ios-app

Water Leakage, Mopadu Reservoir – మోపాడు రిజర్వాయర్‌కు గండి.. 1996 పరిస్థితిని తలుచుకుని ప్రజల ఆందోళన..

Water Leakage, Mopadu Reservoir – మోపాడు రిజర్వాయర్‌కు గండి.. 1996 పరిస్థితిని తలుచుకుని ప్రజల ఆందోళన..

ఇటీవల రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలు, నెల్లూరు జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా.. పలు ప్రాజెక్టులు, చెరువులు తెగిపోయిన పరిస్థితి నుంచి తేరుకోక ముందే.. నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల సరిహద్దు జిల్లా అయిన ప్రకాశం జిల్లాపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. ఫలితంగా చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలకు ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోనూ, పైన నల్లమల అడవిలోనూ రెండు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా నియోజకవర్గంలో ప్రధాన రిజర్వాయర్‌ అయిన మోపాడులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. రిజర్వాయర్‌ మట్టికట్టకు సోమవారం చిన్నపాటి గండి పడగా.. ఈ రోజు ఆ గండి పరిమాణం పెరిగింది. అధికారులు గండి పూడ్చేందుకు, కట్ట తెగకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

పామూరు మండలం మోపాడు వద్ద మన్నేరు నదిపై ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని నిల్వ సామర్థ్యం 2.15 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.09 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లో ఉంది. అలుగు నుంచి నీరు పారుతోంది. మన్నేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో 14 ఏళ్ల తర్వాత ఈ రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఎగువన సీఎస్‌ పురం మండలంలోని చెరువులు, పామూరు పాత చెరువు కూడా నిండి అలుగులు పారుతున్నాయి. ఆ నీరు అంతా వచ్చి మోపాడు రిజర్వాయర్‌లోకి చేరుతోంది. మన్నేరు ఉప నది అయిన పిల్లాపేరుపై నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి మండలం గండిపాలెం వద్ద 1.88 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన గండిపాలెం రిజర్వాయర్‌ కూడా నిండి అలుగు పారుతుండడంతో.. మోపాడుకు వరద పోటెత్తుతోంది.

Also Read : Rayalacheruvu – రాయలచెరువు తెగే పరిస్థితి ఉందా..?

మోపాడు నుంచి వరద నీరు.. దిగువన కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు వద్ద 1.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రాళ్లపాడు ప్రాజెక్టుకు చేరుతోంది. రాళ్లపాడు నుంచి మన్నేరు ద్వారా వస్తున్న వరదతోపాటు.. సోమశిల ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీరు వస్తుండడంతో.. ప్రస్తుతం రాళ్లపాడు ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మన్నేరు పోటెత్తడంతో కందుకూరు మండలం మాచవరం గ్రామం వద్ద మన్నేరు బ్రిడ్జి పై నుంచి నీరు పారుతోంది. ఫలితంగా కందుకూరు – గుడ్లూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మోపాడు రిజర్వాయర్‌ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మోపాడు, కట్టకింద పల్లి, బొట్లగూడూరు, కంబాలదిన్నె, రేణుమడుగు, సిద్ధవరం గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రిజర్వాయర్‌ తెగినా వరద ప్రమాదం ఉండని మోపాడు గడ్డమీద ప్రభుత్వ పాఠశాలలోనూ, కంబాలదిన్నే, బొట్లగూడూరు ప్రభుత్వ పాఠశాలల్లో ముంపు ప్రమాదం ఉన్న ప్రజలకు పునరావాసం కల్పించారు.

గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 1996లో మోపాడు రిజర్వాయర్‌ అలుగు తెగింది. ఫలితంగా వరద మోపాడు, కట్టకింద పల్లి, బొట్లగూడూరు, కంబాలదిన్నె, రేణుమడుగు, సిద్ధవరం గ్రామాలను ముంచెత్తింది. ముందస్తు హెచ్చరికలు కూడా లేకపోవడంతో.. నాడు 102 మంది వరదలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. మోపాడు నీరు అంతా వచ్చి రాళ్లపాడు ప్రాజెక్టుపై పడడంతో.. ఆ ప్రాజెక్టు కూడా తెగిపోయింది. ఫలితంగా ప్రాజెక్టు దిగువ గ్రామాలలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. మోపాడు, రాళ్లపాడు ప్రాజెక్టులు తెగడంతో.. ఆ వరద మన్నేరు గుండా వెళ్లి ఉలవపాడు వద్ద రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేసింది. ట్రాక్‌ కట్ట మొత్తం కొట్టుకుపోవడంతో.. పట్టాలు వేలాడాయి. నాటి పరిస్థితిని తలుచుకుంటున్న ప్రజలు.. ఆందోళన చెందుతున్నారు.

Also Read : MLA Chevireddy, Rayala Cheruvu – ఆపదలో ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి