Idream media
Idream media
తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదాలు.. ఆయా రాష్ట్రాల్లోని విపక్ష, అధికార పక్షాల మధ్య కూడా వివాదానికి దారి తీస్తోంది. ప్రధానంగా తెలంగాణలో అధికారం కోసం పోటీపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య నీటి మంటలు చెలరేగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై బీజేపీ ఎటాక్ చేస్తోంది.
తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ‘హరీశ్ రావు ఒప్పుకోవడం వల్లే.. ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి ముఖం చెల్లడం లేదు’ విభజన చట్టం ప్రకారమే కృష్ణ, గోదావరి నదీ జలాల బోర్డుల నోటిఫికేషన్ జరిగిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పెరగకుండా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయడం ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని.. నీటి కేటాయింపుల విషయంగా చూడకూడదన్న ఆయన, ఇప్పటికే కేటాయించిన నీటిని బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలన్నారు.
విద్యుత్ ఉత్పత్తి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని పరస్పరం ఇరు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన వివరించారు. నదీ జలాల విషయాన్ని తెలంగాణ లోని అధికార పార్టీ రాజకీయం చేయాలనుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించారు.
తెలంగాణా నీటి ప్రయోజనాల విషయంలో ఏడేళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన రఘునందన్ రావు, 2015 లో కృష్ణ నదీజలాల వాటాను ఏపీకి 66% తెలంగాణాకి 34% కింద హరీశ్ రావు ఒప్పుకున్నారు కాబట్టే.. ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదని రఘునందన్ రావు అన్నారు. నీటి విషయంలో తెలంగాణ బీజేపీని బద్నాం చేయాలని టిఆర్ఎస్ చూస్తుందని ఆయన విమర్శించారు.
ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి తమ వాదాన్ని కేసీఆర్ సర్కారు వినిపించాలన్నారు. ఇప్పటి వరకు జల వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం జోక్యం తరువాత మాటమార్చి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని, ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని ఆయన తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినప్పటికీ తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ ఆత్మగౌరవం కోసం అధికార పక్షానికి సహకరించడ మాని, విమర్శలు చేయడం తగదని పేర్కొటున్నారు. ఇలా మొత్తంమ్మీద నీటి వివాదం చుట్టూ తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు చెలరేగున్నాయి.