iDreamPost
android-app
ios-app

కుమారస్వామి ప్రభుత్వం కూలటానికి ‘‘పెగాస‌స్’’ కారణమా?

కుమారస్వామి ప్రభుత్వం కూలటానికి  ‘‘పెగాస‌స్’’ కారణమా?

రెండేళ్ల క్రితం.. క‌ర్ణాట‌క లో కాంగ్రెస్ – జేడీయూ ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌డానికి ‘‘పెగాస‌స్’’ నిఘాయే కార‌ణ‌మా? సంకీర్ణ ప్ర‌భుత్వంలోని లొసుగుల‌ను ఈ నిఘా వ్య‌వ‌స్థ ద్వారానే తెలుసుకుని ఆ ఎమ్మెల్యేల‌కు వ‌ల వేశారా? .. అంటే కాద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి. 2019లో ఆ ప్ర‌భుత్వం కూలిపోయి.. బీజేపీ అధికారంలోకి రావ‌డం వెనుక పెగాస‌స్ పాత్ర కూడా ఉంద‌నే అనుమానాలను తాజాగా విడుద‌లైన పెగాస‌స్ బాధితుల లిస్ట్ లోని పేర్లు క‌లిగిస్తున్నాయి. దేశంలో ఈ హ్యాకింగ్ వ్య‌వ‌హారం కొత్త కొత్త మ‌లుపులు తిరుగుతోంది. రాజ‌కీయ సంక్షోభానికి తెర లేపుతోంది. ప్ర‌తిప‌క్షాల‌కు ఇది ఓ ఆయుధంగా మారుతుంటే, అధికార ప‌క్షం ఎదురుదాడికి స‌న్నాహాలు చేస్తోంది.

2019 జూలైలో 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో దేవెగౌడ కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో చిక్కుకుంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న బీజేపీ బ‌లం పుంజుకుంది. స్పీకర్‌ రమేశ్‌ కుమార్ బ‌ల‌ప‌రీక్ష పెట్ట‌డంతో కాంగ్రెస్, బీజేపీ తమ వ్యూహాలకు పదనుపెట్టాయి. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల‌తో నాటి సీఎం కుమార‌స్వామి వ‌ర్గం మంత‌నాలు జ‌రిపినా ఫ‌లితం లేక‌పోయింది. స్వ‌తంత్రుల‌ను త‌న వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గానే, బీజేపీ వారిని లాగేసుకుంది. ఇలా మూడు వారాల పాటు అనేక మలుపులు తిరుగుతూ చివ‌ర‌కు విశ్వాస పరీక్షలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ సర్కారు కుప్పకూలింది. దీంతో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. రెండేళ్ల క్రితం జ‌రిగిన ఈ తంతు పెగాస‌స్ ప్ర‌కంప‌న‌ల్లో మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చింది.

కుమారస్వామి కార్యదర్శి సతీశ్‌ ఫోన్‌, అప్పటి ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర ఫోన్‌, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య సెక్రటరీ వెంకటేశ్‌ ఫోన్‌ నంబర్లు స్పైవేర్ లక్ష్యిత జాబితాలో ఉన్నట్టు ‘ద వైర్‌’ వార్తా సంస్థ మంగళవారం నాటి కథనంలో వెల్ల‌డించ‌డం ఈ అనుమానాల‌కు కార‌ణం అవుతోంది. అంతేకాదు.. సరిగ్గా అదే సమయంలో, రాహుల్‌గాంధీ ఉపయోగించడం ప్రారంభించిన కొత్త ఫోన్‌ నంబర్‌ కూడా లక్ష్యిత జాబితాలో ఉన్నట్టు వెల్లడించింది. వారి నంబర్లను అప్పుడు నిజంగా నిఘాలో పెట్టారా అని నిగ్గు తేల్చే డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ఆధారాలు లేనందున ఆ విషయాన్ని నిర్ధారణగా చెప్పలేం గానీ.. లక్ష్యిత జాబితాలో చేర్చిన సమయాన్ని ప‌రిశీలిస్తే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అలాగే.. మాజీ ప్రధాని దేవెగౌడ భద్రతాధికారి మంజునాథ్‌ ముద్దెగౌడ నంబర్‌ కూడా పెగాసస్‌ ప్రాజెక్ట్‌ లీక్డ్‌ రికార్డుల్లో ఉండడం గమనార్హం. వీరంతా ఆ సమయంలో.. ఈ జాబితాలో ఉన్న నంబర్లను వినియోగిస్తున్నట్టు ధ్రువీకరించారు. కొందరు అవే నంబర్లను కొనసాగిస్తుండగా.. మరికొందరు వాటి వినియోగాన్ని ఆపేశారు. అలాగే.. జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్య, బన్‌జ్యోత్స్న లాహిరి, అంబేడ్కరైట్‌ యాక్టివిస్ట్‌ అశోక్‌ భార్తి, బేలా భాటియా, రైల్వే యూనియన్‌ లీడర్‌ శివ్‌గోపాల్‌ మిశ్రా, కార్మిక హక్కుల కార్యకర్త అంజనీ కుమార్‌, బొగ్గు గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే అలోక్‌ శుక్లా, ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ సరోజ్‌ గిరి, శుభ్రాంశు చైదరి, ఉప్సా శతాక్షి తదితర హక్కుల కార్యకర్తల నంబర్లూ నిఘా జాబితాలో ఉన్నాయి.

రెండేళ్ల అనంత‌రం మ‌రోసారి హ‌ఠాత్తుగా వెలుగులోకి వ‌చ్చిన పెగాసస్ హ్యాకింగ్ సెగలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్నాయి. ఆ జాబితా, అందులో ఉన్న బాధితుల జాబితాతో విప‌క్షాల గొంతు పెరుగుతోంది. అధికార ప‌క్షంపై విరుచుకుప‌డుతోంది. అటు రాజ్యసభలోనూ మంగళవారం ఉదయం 15 పార్టీల నేతలు పెగాసస్‌ నిఘాతోపాటు కీలక అంశాలపై చర్చ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ గందరగోళం సృష్టించారు. కొంతమంది వెల్‌లోకి దూసుకెళ్లారు. మరోవైపు.. పెగాసస్‌ నిఘాపై ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిఘాపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు తోడు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘సిగ్నల్‌’ చేసిన ట్వీట్ కూడా కేంద్రాన్ని ఇర‌కాటంలో పెట్టింది. ‘‘చూడబోతే.. భారత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపైన, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలపై రహస్యంగా నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. యాదృచ్ఛికంగా.. వారు (భారతప్రభుత్వం) మెసెంజర్‌ యాప్స్‌లో ఎన్‌క్రిప్షన్‌ను కూడా బలహీన పరిచే చట్టాలను తేవడం ఆసక్తికరం’’ అంటూ ..ఒకవైపు పెగాసస్‌ రగడ, మరోవైపు సోషల్‌ మీడియా కట్టడికి తెచ్చిన కొత్త నియమావళి నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘సిగ్నల్‌’ ఈ ట్వీట్ చేసింది. తన వాదనకు రుజువుగా.. రాహుల్‌ గాంధీ ఫోన్‌ మోదీ సర్కారు నిఘా జాబితాలో ఉందంటూ గార్డియన్‌ పత్రికలో వచ్చిన కథనం తాలూకూ లింక్‌ను జోడించింది. ఈ పెగాస‌స్.. మున్ముందు ఇంకెన్ని ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందోన‌న్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.