iDreamPost
android-app
ios-app

మినీ వార్‌.. పార్టీల తయార్‌..!

మినీ వార్‌.. పార్టీల తయార్‌..!

తెలంగాణలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక రేపటితో ముగియనుంది. నిన్ననే ప్రచారం సమాప్తమై ప్రధాన పార్టీల ప్రధాన నేతలందరూ నాగార్జునసాగర్‌ను వీడి సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. ఇంతలోనే మినీ సంగ్రామం నగారా మోగింది. దీంతో వారంతా మినీ సంగ్రామంలో పాలుపుంచుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే, నోటిఫికేషన్‌ విడుదలకు ముందే, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కొనసాగుతుండగానే.. టీఆర్‌ఎస్‌ మినీ సంగ్రామంపై దృష్టి పెట్టింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ రెండు సార్లు వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో పర్యటించారు. అలాగే షెడ్యూల్‌ విడుదలకు కొన్ని గంటల ముందు స్వయంగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వరంగల్‌, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేటల్లో పర్యటించడం ద్వారా ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సన్నద్దమైందన్న సంకేతాలు ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.

ఎన్నిక ఏదైనా తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఆయా ప్రాంతాలపై గట్టి ఫోకస్‌ పెడుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ ముందు వరుసలో ఉండగా, కాంగ్రెస్‌ కూడా పోటీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ప్రయత్నం చేస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో చేదు అనుభవంతో టీఆర్‌ఎస్‌.. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా కష్టపడి రెండింటికి రెండు స్థానాలు గెలుచుకుంది. అదే ఊపుతో సాగర్‌ ఉప ఎన్నికల్లో కొట్లాడుతోంది. తాజాగా మునిసిపాలిటీల్లోనూ పాగా వేసేందుకు ఎప్పుడో వ్యూహ రచన చేసింది. ఇప్పుడు దానిని అమల్లో పెడుతోంది. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లపై అధికార పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే పలుమార్లు స్థానిక లీడర్లు, ఆశావాహులతో సమావేశమైంది. ఆయా ప్రాంతాల్లో కేటీఆర్‌ పలుమార్లు పర్యటించారు. మిగిలిన మునిసిపాలిటీల పర్యటనలను పెట్టుకున్నారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు గెలుపు లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఇక, మునిసిపల్‌ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడల్లో నిమగ్నమైంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన ఉత్సాహంతో వీటిపై అప్పుడే కన్నేసింది. తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంది.

బీజేపీ కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలోనే వరంగల్‌, ఖమ్మం కార్పారేషన్లతో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాల్టీల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ లక్ష్యంతోనే బీజేపీ ముఖ్య నేతలు ఆయా ప్రాంతాల్లో పలు సభలు, సమావేశాలు, ర్యాలీలు ఇప్పటికే నిర్వహించారు. ప్రత్యేకించి వరంగల్‌, ఖమ్మం నగరాల్లో వార్డులవారీగా కూడా సమావేశాలు నిర్వహించారు. వరుస ఓటములతో దెబ్బతిన్న కాంగ్రెస్‌ మాత్రం ఈ ఎన్నికలను స్వాగతించటం లేదు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణ శ్రేయస్కరం కాదని భావిస్తోంది. వీటిని వాయిదా వేయాలని కూడా ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఎస్‌ఈసీకి వినతిపత్రం అందజేశారు. అయినా, షెడ్యూల్‌ విడుదల కావటంతో ఎన్నికలకు కాంగ్రెస్‌ సై అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారించాయి.