Idream media
Idream media
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం తారస్థాయికి చేరింది. సరిహద్దులోని మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలంటూ ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తుండగా, దీన్ని కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ వివాదం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలే వరకూ కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాజాగా మహారాష్ట్ర డిమాండ్ చేయడంతో కర్ణాటక కూడా ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర రాజధాని ముంబైని తమ రాష్ట్రంలో కలిపేసుకుంటామంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం తేలే వరకూ ముంబైని కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ వివాదం..
బ్రిటిష్ పాలనలో బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండే బెళగావి, కర్వర్, నిప్పని తదితర ప్రాంతాలు 1956లో భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటులో భాగంగా మైసూర్ రాష్ట్రంలో కలిశాయి. 1973లో మైసూర్ రాష్ట్రం పేరును కర్ణాటకగా మార్చారు. కాగా, ఆ ప్రాంతాల్లో ఎక్కువమంది మరాఠీ మాట్లాడేవారే ఉన్నందున తమ రాష్ట్రంలోనే కలపాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. బెళగావి కేంద్రంగా ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి అప్పట్లోనే దీనిపై ఆందోళనలు చేపట్టగా 10 మంది మరణించారు. మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ మేరకు ఈ వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 1957 జూన్ 23న నలుగురు సభ్యులతో మహాజన్ కమిటీని నియమించింది. ఆ కమిటీలో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, మైసూర్ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు. అయితే, ఇరు రాష్ర్టాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని రూపొందించడంలో మహాజన్ కమిటీ విఫలమైంది.
ఈ వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం 1966 అక్టోబరు 25న సుప్రీంకోర్టు 3వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మెహర్ చంద్ మహాజన్ నేతృత్వంలో మహాజన్ కమిషన్‌ను నియమించింది. మొత్తం 2,240 వినతిపత్రాలను స్వీకరించిన మహాజన్ కమిషన్ 7,572 మందితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంది. ఏడాదిలోనే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వివాదాస్పద ప్రాంతంలోని 264 గ్రామాలు మహారాష్ట్రకు చెందాలని, 247 గ్రామాలు కర్ణాటకకు చెందాలని ఆ నివేదికలో మహాజన్ కమిషన్ పేర్కొంది. అయితే, బెళగావి మాత్రం కర్ణాటకలోనే కొనసాగాలని కమిషన్ స్పష్టం చేసింది. దీంతో మహాజన్ కమిషన్ నివేదికను మహారాష్ట్ర వ్యతిరేకించింది. బెళగావిని మహారాష్ట్రలో కలపాలని కోరుతూ 2006 సంవత్సరంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణాటకలో నివసించే మరాఠీ మాట్లాడే ప్రజలంతా అభద్రతా భావంలో ఉన్నారని ఆ పిటిషన్‌లో ఆరోపించింది. సుప్రీంకోర్టులో ఈ వివాదం ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
ఠాక్రే వ్యాఖ్యలతో..
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి వివాదం రాజుకుంది. బెళగావిని మహారాష్ట్రలో విలీనం చేస్తానని, మరాఠీ మాట్లాడే ప్రాంతాన్ని కలుపుకునే దాకా మౌనంగా ఉండేది లేదని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్రంగానే ఖండించారు.