iDreamPost
android-app
ios-app

కొత్త రూపంలో డిజిటల్ పోరు

  • Published Mar 11, 2020 | 1:14 PM Updated Updated Mar 11, 2020 | 1:14 PM
కొత్త రూపంలో డిజిటల్ పోరు

చూస్తుంటే రాను రాను డిజిటల్ స్ట్రీమింగ్ వెబ్ సైట్ల పోరు కొత్త రూపం తీసుకునేలా ఉంది. దానికి అల్లు కాంపౌండ్ మొదలుపెట్టిన ‘ఆహా’ యాప్ శ్రీకారం చుడుతున్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఇప్పటిదాకా ఏ డిజిటల్ యాప్ తమ దగ్గర ఎంత మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నది వాళ్ళు ఎన్నిసార్లు ఎంతసేపు తమ వీడియోలు చూసారన్న డేటాని పబ్లిక్ గా ఇవ్వలేదు. ఆ మాటకొస్తే హక్కులను అమ్మిన నిర్మాతలకు కూడా తెలియకుండా చాలా గోప్యత మైంటైన్ చేస్తారని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అలాంటిది ఆహా టీమ్ కొత్తగా ఆ లెక్కలను బయటపెడుతూ కొత్త స్ట్రాటజీకి తెర తీసింది.

తమ దగ్గర 5 లక్షలకు పైగా చందాదారులు చేరారని సగటున ఒక్కొక్కరు అరగంటకు పైగా స్ట్రీమింగ్ ద్వారా తమ యాప్ లో కాలం గడుపుతున్నారని ఘనంగా ప్రకటించుకుంది. ప్లే స్టోర్ తో పాటు ఇతర మార్గాల్లో డౌన్ లోడ్ చేసుకున్న నెంబర్ 6 లక్షలకు పైగా ఉందని చెప్పుకోవడం గమనార్హం. అయితే ఆహా సంవత్సర చందా కేవలం 350 రూపాయలు మాత్రమే పెట్టడం ఈ రెస్పాన్స్ కు ఒక కారణంగా చెప్పొచ్చు. మిగిలినవి కనిష్టం వెయ్యి దాకా వసూలు చేస్తున్నాయి. ఇప్పుడీ పోకడ మిగిలిన వాళ్ళు కూడా అనుసరిస్తే సినిమాల తరహాలో కలెక్షన్లను ప్రకటించుకున్నట్టు ఈ యాప్స్ కూడా నెలకోసారి తమ డేటాను చెప్పుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఇలాంటివి అనుసరించకపోవచ్చు. వాళ్ళు కనక రివీల్ చేస్తే ఆ ఫిగర్స్ కే మనవాళ్లకు నిద్ర దూరమవ్వడం ఖాయం. అంత భారీ సంఖ్యలో వాళ్లకు వ్యూయర్ షిప్ ఉంది. డేటాను ప్రకటించే ఛాన్స్ లేనట్టే. అయితే జీ5, ఏఎల్టి లాంటి లోకల్ ప్లేయర్స్ చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఆహా ప్రస్తుతం కొత్త సినిమా హక్కులను కొనడంతో పాటు తెలుగులో మారుతీ లాంటి పేరున్న దర్శకులతో వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తోంది. ప్యూర్ తెలుగు కంటెంట్ అనే ట్యాగ్ తో ప్రచారం చేసుకున్నారు కాబట్టి వేరే బాషల నుంచి ఎలాంటి దిగుమతులు చేయలేరు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆహా సంస్థ ప్రాధమికంగా పెట్టిన వంద కోట్ల పెట్టుబడిలో ఇప్పటిదాకా ఇరవై శాతం రికవరీ అయ్యిందట. ఏడాదిలోగా దీన్ని ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొచ్చేలా గట్టి ప్లానింగే జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి కొత్త ట్రెండ్ ఎక్కడికి దరి తీస్తుందో వేచి చూడాలి.