Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్లుగా విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో కూడా భారీ కేటాయింపులు చేశారు. వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు కేటాయించింది. అంతేకాకుండా, ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు, కొవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించి ప్రజల ఆరోగ్య భద్రతకు ఎంతలా ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి చాటింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వైద్యరంగంలో రెండేళ్ల ప్రగతికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను పరిశీలిస్తే, ఇప్పటి వరకు రాష్ట్రంలో 95 శాతం ప్రజలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావడం సంచలనంగా మారింది.
జగన్ అధికారంలోకి వచ్చాక పేదల ఆరోగ్య శ్రీ ని మరింత పటిష్టం చేశారు. 2000 రకాల వ్యాధులను అదనంగా చేర్చారు. బడ్జెట్ కేటాయింపులు భారీ పెంచారు. నిబంధనలు సడలించి మరింత ఎక్కువ మందికి ఆ పథకం వర్తించేలా చేశారు. ఫలితంగా ఇప్పటి వరకూ 95 శాతం మంది ప్రజలు ఆరోగ్య శ్రీలోకి వచ్చారు. అలాగే, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్(మ్యుకార్ మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్) చికిత్సలన కొత్తగా చేర్చినట్లు నివేదికలో పేర్కొంది. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి సమయంలో రోగులకు రోజుకు రూ. 225ల చొప్పున గరిష్టంగా నెలకు రూ.5,000 అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆరోగ్యశ్రీలో కోవిడ్‌కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రులకు కోవిడ్ అనుమతులతోపాటు అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దుచేస్తామని ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు చేసిన తనిఖీల్లో కొన్ని ఆస్పత్రులు తక్కవు పడకలు ఇస్తున్నట్లు తెలుసుకుని వెంటనే చర్యలకు ఉపక్రమించింది.
జగన్ ఆదేశాలతో ఆరోగ్య శ్రీ పథకానికి అధికారులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా సరే 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని, కోవిడ్ సమయంలో అన్ని ఆస్పత్రులు ఇది పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొన్ని ఆస్పత్రులు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లికార్జున యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ చర్యలన్నీ ఆరోగ్య శ్రీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలియజేస్తున్నాయి.