iDreamPost
android-app
ios-app

బొమ్మల బుజ్జాయికి వీడ్కోలు!

బొమ్మల బుజ్జాయికి వీడ్కోలు!

బుజ్జాయి వెళ్లిపోయారు. వయసు మీద పడింది. బొమ్మలన్నీ పసిపాపలే. అవి చిరంజీవులే. దేవులపల్లి కృష్ణశాస్త్రికి రెండే వ్యసనాలు. ఒకటి కవిత్వం, రెండు కన్నకొడుకు.

కొడుకుని వదిలి వుండలేని ఆ తండ్రి, పసివాడిని స్కూల్​కి కూడా పంపకుండా వెంటపెట్టుకుని తిరిగాడు. సంచారమే విద్యాభ్యాసమని అపుడు ఆ ఇద్దరికీ తెలియదు. బుజ్జాయిని అక్షరాల కంటే రంగులు ఆకర్షించాయి. భారతదేశ కామిక్స్​కి మూల పురుషుడయ్యాడు.

కృష్ణశాస్త్రి కొడుకుగా కీర్తి కోరుకోలేదు. ‘నేను–నాన్న’ పుస్తకాన్ని అద్భుతంగా రాశాడు. చదువుతుంటే కళ్లు తడుస్తుంటాయి. గొప్ప రచయితని ఎప్పుడూ చెప్పుకోలేదు. కార్టూన్​ ప్రపంచంలో నెంబర్​వన్​, భారతదేశంలోని ప్రతి పిల్లవాడు ఆయన బొమ్మలు చూసే వుంటాడు. ఎప్పుడూ సన్మానాలు, సత్కారాల కోసం ఆశించలేదు. ఒక యోగిలా జీవించి, మరణించాడు బుజ్జాయి.

నిజానికి ఆయన తండ్రి కృష్ణశాస్త్రి మరణించినపుడు మాయమైంది దేహం మాత్రమే. ఇపుడు ఆత్మకూడా వెళ్లిపోయింది.

టార్జాన్​ బొమ్మలతో ప్రేరణపొందిన బుజ్జాయి, తొలిసారిగా బానిసపిల్ల అనే కామిక్​ పుస్తకానికి బొమ్మలేశాడు. 1945లో వచ్చిన ‘సలోమి వేర్​ షి డాన్స్​డ్​’ హాలీవుడ్​ సినిమా ఈ కథకి ఆధారం. ఆ పుస్తకంతో పత్రికల ఆఫీస్​కి వెళితే, భారతదేశ కథాంశంతో బొమ్మలు గీయమని సలహా ఇచ్చారు. ఇదంతా 1947 నాటిమాట.

బుజ్జాయి చిన్నపిల్లాడు కదా, కోపమొచ్చింది. సొంతంగా ప్రింట్​ చేసుకున్నాడు. అలా మొదటి తెలుగు కామిక్​ కాదు, ఇండియా తొలి కామిక్​ బుక్​ పుట్టింది.

మంత్రగాడు, గుర్రాలు, రాకుమారులు, సౌందర్యరాశులు, ఒంటెల బిడారు, పులులు, సింహాలు, రంగురంగుల రూపాల్లో మనముందు నిలబడ్డాయి.

బుజ్జాయి, ఆయన సృష్టించిన డుంబు మనకి ఇంటింటి పరిచయస్తులు, స్నేహితులయ్యారు. 1964లో ఇండియా బుక్​ హౌస్​ అమర్​ చిత్రకథకి ఆయన బొమ్మలే ప్రాణం.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) జీవించే వుంటారు. ప్రాణం పోసుకున్న ఆయన బొమ్మలు, పసిపిల్లలతో మాట్లాడుతూ వున్నంతకాలం చిరంజీవే!