Idream media
Idream media
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం మహోన్నతంగా సాగుతోంది. విశేషమేమిటంటే అధికార పార్టీయే ఇందులో లీడ్ తీసుకుంటోంది. కార్మిక సంఘాలకు మద్దతుగా, పరిశ్రమ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ తన లేఖ ద్వారా కేంద్రానికి తమ ఉక్కు సంకల్పాన్ని తెలిపారు. వైసీపీ ఎంపీలు మూకుమ్మడిగా కేంద్ర పెద్దలను కలిసి తమ నిర్ణయం, ప్రజల అభిమతం తెలిపారు. ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమయ్యారు.
కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించిన వెంటనే ఆవేశంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు ఇప్పటికైతే ఉద్యమంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రకటనలు, ప్రసంగాలకే మినహా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం లేదు. నాన్ పొలిటికల్ జేఏసీ రూపకల్పనలో బిజీగా ఉన్నారో.. ఏమో కానీ ప్రస్తుతానికి అయితే ఉద్యమానికి దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం, సమాధానం కోసం వేచి చూడడం మినహా అంతకు మించి వైసీపీ ఏమీ చేయలేదని అందరూ భావించారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు దీన్నో ఆయుధంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించాయి. ఇప్పుడు అందరి అంచనాలను తారుమారుచేస్తూ.. ప్రజల మనోభావాలకు పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో ఉంటోంది. ప్రస్తుతం రాజకీయాలతో పని లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వైకాపా ఎంపీలు అన్నారు.
“విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో పోరాడతాం. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్‌ను…ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతాం. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న సాకుతో.. వేల కోట్లు లాభాలు ఆర్జించిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం తగదు. ఎంతో ఘన చరిత్ర కలిగి…ఉద్యమాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో ఇతర ఎంపీలతో కలిసిపోరాడతాం. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటీకే ప్రధానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాశాం. ఒక వేళ అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధం” అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ కె. సత్యవతి అన్నారు.
మళ్లీ మార్మోగుతున్న ఆంధ్రుల హక్కు నినాదం
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరోసారి విన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అధికారపార్టీ నిరసిస్తూ..ధర్నా చేపట్టింది. పార్టీలకతీతంగా పోరాడేందుకు పిలుపునిచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీకు ఈ విషయమై లేఖ రాశారు. క్యాప్టివ్ మైన్స్ (Captive Mines) కేటాయిస్తే తిరిగి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ లాభాల్లో వస్తుందని వివరించారు. ప్రైవేటీకరణ వద్దని..విశాఖపట్నం ఉక్కు అనేది తెలుగు ప్రజల భావోద్వేగానికి కూడా సంబంధించిందని చెప్పారు.
విశాఖపట్నంలో ఇప్పటికే పార్టీలకతీతంగా పోరాడేందుకు వైసీపీ పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్ రాజు తదితరులు హాజరయ్యారు. అటు విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు ఉక్కు ఉద్యమంపై చర్చించారు. చేపట్టబోయే నిరసన కార్యక్రమాలపై సమీక్షించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని..రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన అవసరముందని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదట్నించి తాము చెబుతున్నామని..ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశ్యంతోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకు గనులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వేలాదిమంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని సమితి తెలిపింది. కార్మికులు, ఉద్యోగ సంఘాలు, వైసీపీ నేతలు ఇంతలా పోరాడుతున్నా.. రాజీనామా చేసిన గంటా ఇంకా కార్యచరణలోకి దిగకపోవడం గమనార్హం