iDreamPost
android-app
ios-app

బీజేపీలో ‘పిలుపు’ గుబులు..

బీజేపీలో ‘పిలుపు’ గుబులు..

వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని అనుకునే పరిస్థితి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఎదురుకాబోతోందా..? సాగు చట్టాలను రద్దు చేసినా.. రైతుల నుంచి మద్ధతు కరువైనట్లేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా సంయుక్త కిసాన్‌మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన పిలుపు బీజేపీ నేతలకు గుబులు పుట్టిస్తోంది. రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించిన సంయుక్త కిసాన్‌ మోర్చా.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీని శిక్షించాలని ఓటర్లకు పిలుపునిచ్చింది. గత ఏడాది నవంబర్‌ 19వ తేదీన రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని కిసాన్‌ మోర్చా నాయకుడు శివకుమార్‌ శర్మ (కక్కాజీ) బీజేపీపై నిప్పులు చెరిగారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రెండు నెలల ముందు గత నవంబర్‌ 19వ తేదీన సాగు చట్టాలను బీజేపీ సర్కార్‌ రద్దు చేసింది. దాదాపు ఏడాది నుంచి సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనలను విరమించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. సాగు చట్టాల రద్దు మాత్రమే గాక పలు డిమాండ్లపై రైతులు తమ ఆందోళనల్లో ప్రస్తావించారు. కనీస మద్ధతు ధరపై తక్షణం కమిటీ ఏర్పాటు, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత, ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, కరెంట్‌ బిల్లుల భారం నుంచి విముక్తి.. వంటి హామీలను బీజేపీ సర్కార్‌ ఇచ్చింది. అయితే ఆ హమీలు ఇచ్చి మూడు నెలలు అవుతున్నా.. వాటి అమలు దిశగా ఒక్క అడుగు పడలేదు. దీంతో కక్కాజీ తాజాగా బీజేపీ ప్రభుత్వతీరును ఎండగట్టారు. మోదీ తమను మోసం చేశారని విమర్శించిన ఆయన.. బీజేపీని ఈ ఎన్నికల్లో శిక్షించాలని పిలుపునిచ్చారు.

ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడం తమ పని కాదన్న కక్కాజీ.. ఫలానా వారికి ఓటు వేయాలని కూడా తాము చెప్పడం లేదన్నారు. రైతులను మోసం చేసిన బీజేపీని శిక్షించాలని మాత్రమే తాము చెబుతున్నామని స్పష్టం చేశారు. సాగు చట్టాల రద్దు చేసిన సమయంలోనే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఆ పని చేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌.. రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తామని ఓ కార్యక్రమంలో మాట్లాడడంతో బీజేపీ కుటిల బుద్ధి బయటపడిందనే విమర్శలు వచ్చాయి. ఆందోళనలను విరమించిన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కార్యరూపం దాల్చకపోవడం రైతుల అనుమానాలను మరింత పెంచింది. వాటి ఫలితమే తాజాగా కక్కాజీ ఇచ్చిన పిలుపు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 10, 14 తేదీల్లో రెండు దశల ఎన్నికలు ముగిశాయి. మరో ఐదు దశలు జరగాల్సి ఉంది. 14వ తేదీన ఒకే విడతలో గోవా, ఉత్తరాఖండ్‌లలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఇక ప్రధానమైన పంజాబ్‌లో ఒకే విడత పోలింగ్‌ ఈ నెల 20వ తేదీన జరగబోతోంది. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపునకు ఓటర్లు ఎలా స్పందిస్తారో మార్చి 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు రోజున తేలుతుంది.

Also Read : యూపీలో ఉండాలంటే యోగికి ఓటెయ్యాలంట..ఎమ్మెల్యే హెచ్చరిక