Idream media
Idream media
అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన భూ కుంభకోణాలు బట్టబయలు అవుతున్నాయి. ఫిర్యాదులపై స్పందించిన అధికారులు విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. శాసనరాజధాని విశాఖలో భూ అక్రమాలపై ఉక్కకుపాదం మోపాలని ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం అధికంగా టీడీపీ నేతల కబ్జాలు బయటపడుతుండడంతో విస్తుపోతున్నారు. చర్యలకు ఉప క్రమిస్తున్నారు.
చెర వీడుతోంది…
విశాఖ మహానగరం టీడీపీ నేతల కబ్జా కోరల్లో చిక్కుకున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలుతోంది. టీడీపీ నేతల చెర నుంచి విశాఖను ప్రభుత్వం విడిపిస్తోంది. ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని భూకబ్జాదారుల్లో టీడీపీ నేతలే అత్యధికంగా ఉన్నారు. కబ్జా భూములు చేజారిపోవడంతో టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. అక్రమాలు బయటపడటంతో గత కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ప్రెస్‌మీట్లు పెడుతూ బుకాయింపులకు దిగుతున్నారు. టీడీపీ నేత పల్లా శ్రీను ఆక్రమణలో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆక్రమణల తొలగింపుపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
49 ఎకరాలు స్వాధీనం
విశాఖలో భూ ఆక్రమణల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు అధికారులు. గాజువాక మండలంలో అన్యాక్రాంతమైన యూ.ఎల్.సి.భూములు గుర్తించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అధీనంలో యూ.ఎల్.సి.భూములు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు రెవెన్యు అధికారులు. ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు గా ఉన్నాడు పల్లా. తుంగ్లాం, కాపు జగ్గరాజుపేట పరిధిలో ఆక్రమణలు గుర్తించి కూల్చి వేస్తున్నారు రెవెన్యు యంత్రాంగం. సర్వే నంబర్ 29/1 లో ఉన్న భూమి ఐదెకరాల 42 సెంట్లు భూమిలో ప్రహరీగోడలు తొలగించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 49.4 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విలువ 791కోట్లుగా నిర్ధారణ అయ్యింది.
భూ కబ్జాల్లో పల్లా కుటుంబం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడింది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారు. పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు పెద్ద భూకుంభకోణానికి నాంది పలికాడని ఆరోపించారు. వారి బాటలోనే పల్లా శ్రీనివాస్ ఆక్రమణలకు పాల్పడ్డారు. మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మా హయాంలో మా నాయకులు ఎవ్వరు భూకబ్జా లకు పాల్పడలేదు. టీడీపీ నేతలు తప్పు చేసి, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. విశాఖ లో పల్లా శ్రీనివాసరావు , కుటుంబ సభ్యులు దిగజారి భూములు అక్రమించుకున్నారు అని పేర్కొన్నారు.