Idream media
Idream media
‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ ఈ నినాదం ఈనాటిది కాదు. వైజాగ్ నగరంలో ఉక్కు కర్మాగారం పెట్టాలన్న డిమాండ్ తలెత్తిన నాటి నుంచి ఉత్తరాంధ్ర నుంచి మొదలై యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా హోరెత్తిన నినాదమిది. దాదాపు అయిదు దశాబ్ధాల తర్వాత మరోసారి ఈ నినాదం సాగర తీరంలో హోరెత్తుతోంది. పార్టీలకతీతంగా సంఘటితంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవాలన్న తాపత్రయం కనిపిస్తోంది. అధికార వైసీపీ కూడా ప్లాంట్ కోసం పోరాడుతోంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉద్యమానికి మద్దతుగా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రానికి లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపారు. మరోవైపు ప్లాంట్ ను కాపాడుకోవడానికి కార్మికులు చేపట్టిన దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. తాజాగా కేంద్రం మరో అడుగు ముందుకేసి ప్లాంట్ విక్రయానికి బిడ్ లను ఆహ్వానించడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.
నాడు ఇలా..
60వ దశకం తొలినాళ్ళలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం మొదలైంది. ప్రాంతీలకు అతీతంగా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమాలు నడిచాయి. ఊళ్ళన్నీ కదిలి ‘‘ విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ’’ అన్న నినాదంతో హొరెత్తాయి. క్రమంగా తీవ్ర రూపం దాల్చిన విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమం చివరికి పోలీసు కాల్పుల దాకా వెళ్ళింది. 1966 నవంబర్ 1వ తేదీన వైజాగ్ నగరంలో ఉద్యమ కారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులతోపాటు మరో ఆరుగురు మత్యువాత పడ్డారు. మొత్తమ్మీద స్టీల్ ప్లాంట్ కొరకు జరిగిన ఆందోళన కార్యక్రమాలలో 32 మంది మరణించినట్లు సమాచారం. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆదిలాబాద్, వరంగల్ పట్టణాల వారు కూడా వున్నారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో దిగి వచ్చిన అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం విశాఖలో స్టీల్ ప్లాట్ ఏర్పాటు చేయనున్నట్లు 1970 ఏప్రిల్ నెలలో పార్లమెంటులో ప్రకటించింది.
నేడు ఇలా..
ఇప్పుడు మోదీ ప్రభుత్వం దేశంలో పలు ప్రతిష్టాత్మక పబ్లిక్ రంగ సంస్థలను నష్టాల పేరుతో అమ్మేయడానికి సిద్ధమైంది. వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయబోతున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అగ్గి రాజేసింది. స్టీలు ప్లాంటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సహజంగానే విపక్షాలు ఈ ఆందోళనలో భాగస్వామ్యమయ్యాయి. అధికార వైసీపీ ఎంపీలు కూడా ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు.
30 కిలోమీటర్ల భారీ ర్యాలీ
ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే.. మరోవైపు ప్లాంట్ విక్రయానికి కేంద్రం వడవడిగా అడుగులు వేస్తోంది. దీనికి నిరసనగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్ కార్మికులు 30 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు నినాదం హోరెత్తింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరి కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా 30 కిలో మీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు.
ఉత్తరాంధ్ర ఎంపీల సహకారం
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు, జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సొంతంగా గనులు కేటాయించాలని , సీపీఎం నర్సింగరావు డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఆపలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన కోరారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు: గఫూర్
స్టీల్‌ప్లాంట్ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీఐటీయూ నేత గఫూర్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ మూర్ఖంగా పాలిస్తున్నారని, ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోంది: అయోధ్యరామ్
స్టీల్‌ప్లాంట్ రూ.వేలకోట్ల పన్నులు కడుతుంటే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటని స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ తెలిపారు. సీఎం జగన్ లేఖలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని, అసలు హోదా లేదు, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్ ఉపాధి కల్పిస్తోందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రధాని మోదీ నడుచుకోవాలని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ నేత మస్తానప్ప కోరారు