iDreamPost
iDreamPost
ఏపీలో ఓవర్గం మీడియా బండారం మరోసారి బయటపడింది. ఆంధ్రజ్యోతి కథనాలు పట్టుకుని ఊకదంపుడు విమర్శలు చేసిన టీడీపీ అభాసుపాలు కావాల్సి వచ్చింది. పాలనా వికేంద్రీకరణ వ్యవహారంలో ఇప్పటికే పలు అర్థ సత్యాలు, అసత్యాలు వల్లించినా ప్రజలను నమ్మించలేకపోయిన టీడీపీ అనుకూల మీడియా ఈసారి నేవీ ని అడ్డుపెట్టుకుని అబద్దపు ప్రచారానికి పూనుకుంది. విశాఖలో రాజధాని విషయంపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ కథనాలు అల్లేశారు. నేవీ వివరణ లేకుండా, ప్రభుత్వ పెద్దలను సంప్రదించకుండా ఏకపక్షంగా రాసిన కథనాలన్నీ కహానీలేనని తేలిపోయింది. తాజాగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వివరణతో వ్యవహారం బట్టబయలయ్యింది.
విశాఖలో రాజదాని ఏర్పాటుకి నేవీ అభ్యంతరం చెప్పిందంటూ పచ్చ మీడియా కథనాలు కలకలం రేపాయి. మిలీనియం టవర్స్ లో సెక్రటేరియేట్ ఏర్పాటు రక్షణపరంగా ఇబ్బందులు తెస్తుందంటూ రాసేశారు. విశాఖను పాలనా రాజధానిగా ఎంపిక చేస్తే తద్వారా విశాఖలో జనసమ్మర్థం పెరగడం నేవీ, ఇతర రక్షణ బృందాలకు సమస్య అవుతుందంటూ అచ్చేశారు. కానీ అందులో కనీసం నేవీ అధికారుల వివరణ తీసుకోవాలన్న ఆలోచనకు కూడా పోలేదు. పోనీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వార్తలు రాద్దామనే స్పృహ కూడా లేదు. అనుకున్నదే తడువుగా ప్రజల్లో అపోహలు పెంచడమే లక్ష్యంగా రంగంలో దిగేసి ఏకపక్షంగా రాతలు వండి వార్చేశారు.
చివరకు ఈస్ట్రన్ నేవల్ అధికారయుతంగా విడుదల చేసిన ప్రకటనతో ఎల్లో మీడియా విశృంఖలత్వం మరోసారి బయటపడింది. ప్రభుత్వం తమను రాజధాని విషయంపై సంప్రదించలేదని, తాము అభ్యంతరం పెట్టామనే వాదనలో అర్థం లేదని తేల్చేశారు. నేవీ పేరుని ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి రాసిన రాతలన్నీ కట్టుకథలని చెప్పేశారు. మిలీనియం టవర్స్ పై తమకు అభ్యంతరం లేదని ప్రకటించేశారు. ప్రతిపాదనలే లేకుండా మేము అభ్యంతరం పెట్టామని చెప్పడాన్ని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ తరుపున ఖండించారు. ఇలాంటి కథనాలను కేంద్ర రక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో వ్యవహారం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. ఏకపక్ష కథనాల విషయంలో గతంలోనే జగన్ ప్రభుత్వం చర్యలకు పూనుకుంటామని జీవో విడుదల చేసిన నేపథ్యంలో తాజా ఘటన పట్ల సర్కారు పెద్దలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. అదే సమయంలో పదే పదే నిరాధార వార్తలతో ప్రజల్లో అప్రతిష్టత పాలవుతున్నా ఆంధ్రజ్యోతి అడ్డగోలుగా సాగుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.