iDreamPost
android-app
ios-app

విశాఖకు క్యూ కడుతున్నారు.. ఎందుకో తెలుసా..?

విశాఖకు క్యూ కడుతున్నారు.. ఎందుకో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలనుకుంటున్న విశాఖపట్నం పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోంది. రాష్ట్రంలోనే ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖలో పర్యటించేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది (2021)లో విశాఖలో జిల్లాకు 1.80 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో పర్యాటకులు రావడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. విశాఖ నగరంలో రామకృష్ణ బీచ్, యారాడ బీచ్, రిషికొండ బీచ్, కైలాసగిరితోపాటు ఏజెన్సీలోని అరకు లోయ, లంబసింగి ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖ నగరం కన్నా.. ఏజెన్సీ ప్రాంతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అరకు లోయకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. శీతాకాలంలో ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఆ సమయంలో మన్యం అందాలను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారు. వేసవిలో భానుడి ప్రతాపం నుంచి సేద తీరేందుకు కూడా పర్యాటకులు అరకులోయకు వస్తున్నారు. ఏడాది పొడవునా అరకు లోయకు పర్యాటకులు వస్తున్నారు.

విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన, బ్యూటిఫికేషన్‌పై వైసీపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి పెడుతోంది. తద్వారా అభివృద్ధిలో దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడేలా విశాఖను సిద్ధం చేయడంతోపాటు పర్యాటకులను ఆకర్షించవచ్చని భావిస్తోంది. గత డిసెంబర్‌లో పలు అభివృద్ధి పనులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. రోటరీ మోడల్‌లో నిర్మించిన ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌ ప్రారంభించారు. వుడా పార్క్, చారిత్రక టౌన్‌ హాల్, పాత మున్సిపల్‌ హాల్‌ను జగన్‌ సర్కార్‌ ఆధునీకరించింది. 16వ నంబర్‌ జాతీయ రహదారి నుంచి బీచ్‌ రోడ్డు వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి అందుబాటులోకి తెచ్చింది. రిషికొండలో విలాసవంతమైన రిసార్టులను నిర్మిస్తోంది.

విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారిన తర్వాత.. పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో మూడు రాజధానులపై నూతన బిల్లును జగన్‌ సర్కార్‌ ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. బడ్జెట్‌ సమావేశాలు లేదా ఆ తర్వాత అయినా.. మూడు రాజధానుల బిల్లు సభ ముందుకు రావడం, ఆమోదం లాంఛనమే కానుంది. మూడుప్రాంతాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని, సాంకేతికపరమైన లోపాలు లేకుండా మూడు రాజధానుల బిల్లును తీసుకురావాలని జగన్‌ సర్కార్‌ భావిస్తోంది. ఏప్రిల్‌ నుంచి నూతన జిల్లాల్లో పాలన ప్రారంభం కాబోతోంది. అరకు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఖాయమైంది. మూడు రాజధానుల ప్రతిపాదన, కొత్త జిల్లాల ఏర్పాటు అమలులోకి వస్తే.. విశాఖ, అరకు ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు అంతిమంగా పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడనున్నాయి.

Also Read : గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌.. హరే కృష్ణ గోకుల క్షేత్రానికి భూమిపూజ