iDreamPost
android-app
ios-app

విశాఖ సినీ హబ్ ..  జగన్ ఆలోచన అద్భుతం

  • Published Feb 11, 2022 | 10:45 AM Updated Updated Feb 11, 2022 | 10:45 AM
విశాఖ సినీ హబ్ ..  జగన్ ఆలోచన అద్భుతం

అందాల నగరి, పర్యాటక స్వర్గం విశాఖనగరం సినీ డెస్టినేషన్ గా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష టాలీవుడ్ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాటల్లో స్పష్టంగా వ్యక్తమైంది. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా, విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంపై ఆయనకు ఉన్న అనురక్తి, ఆసక్తి మరోమారు వెల్లడయ్యాయి. మీరందరూ రండి.. విశాఖను హైదరాబాద్ తర్వాత అంతటి సినీ గమ్యస్థానంగా రూపొందిద్దామని ఆయన సినీ ప్రముఖులను కోరడం తో విశాఖలో సినీ పరిశ్రమ వేళ్ళూనుకోవడంపై సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలోనూ దీనిపై చర్చ జరిగింది.. చాలా కాలం నుంచే విశాఖలో సినీ షూటింగులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కానీ పరిశ్రమకు చెందిన మిగతా విభాగాలు ఇక్కడికి రాకపోవడంవల్ల పరిశ్రమ ఇక్కడ స్థిరపడలేక పోతోంది. 

జగన్ బంపర్ ఆఫర్

సినిమా టికెట్లు ఇతర సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో ప్రతినిధి బృందం తనను కలిసినప్పుడు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏపీ విడిపోయిన తర్వాత హైదరాబాద్ తో పాటు విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. పరిశ్రమకు ఏపీ కంట్రిబ్యూషనే ఎక్కువంటూ.. దాని ప్రతిఫలం రాష్ట్రానికి అందాలన్నారు. సినీ పరిశ్రమకు విశాఖ అన్నివిధాలా అనుకూలమైన నగరమని, అక్కడికి వచ్చేందుకు అందరూ ప్రయత్నించాలని కోరారు. స్టూడియోల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి స్థలాలు ఇచ్చి.. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తామని, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ తరహాలో విశాఖనగరంలో ఓ ప్రత్యేక ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలు, హంగులతో అభివృద్ధి చేసి సినీ హబ్ గా మారుద్దామని సూచించారు. ఇది ఒక రకంగా సినీ పరిశ్రమతో పాటు విశాఖ నగరానికి కూడా వరంగానే భావించాలి.

Also Read : సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం: పేర్ని నాని

నాడు ఆసక్తి చూపని చంద్రబాబు

విశాఖకు సినీ పరిశ్రమ తరలిరావాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత రామానాయుడు విశాఖ బీచ్ రోడ్డులోని కాపులుప్పాడ తిమ్మాపురం కొండపై స్టూడియో నిర్మించారు. అక్కడ ప్రస్తుతం చిన్న సినిమాలు, బెంగాలీ, ఒడియా చిత్రాలు, వెబ్ సిరీస్ లాంటి షూటింగులు జరుగుతున్నాయి. ఆ తర్వాత పలువురు ప్రముఖులు స్టూడియోల నిర్మాణానికి ముందుకు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. గత సీఎం చంద్రబాబు హయాంలోనూ తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించాలన్న చర్చ జరిగింది. కానీ చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. విశాఖను తన ఆర్భాటాలకు, సమావేశాలకు వాడుకున్నారు తప్ప సినీ పరిశ్రమను తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు.

సహజ సిద్ధమైన లోకేషన్లు

విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాలు ప్రకృతి అందాలకు నిలయాలు. సువిశాలమైన సాగరతీరం, కైలాసగిరి, పదులసంఖ్యలో బీచులు, వుడా పార్క్, సబ్ మెరైన్, విమాన మ్యూజియంలు, సింహాచలం, అరుకు, పాడేరు పర్యాటక ప్రాంతాలు, అందమైన జలపాతాలు.. ఇవన్నీ 1970ల్లోనే బాలచందర్ లాంటి దర్శకులను ఆకట్టుకునే.. ఇక్కడే షూటింగులు జరిపేలా చేశాయి. సహజసిద్ధమైన లోకేషన్లకు స్టూడియోలు, ఇతర సౌకర్యాలు తోడైతే విశాఖ సినీ హబ్ గా మారడం పెద్ద కష్టం కాదు. సహకరించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు. ఇక సినీ ప్రముఖులదే ఆలస్యం.

Also Read : టికెట్ రేట్ల సమస్యకు శుభం కార్డు.. మూడో వారంలో జీవో : చిరంజీవి