iDreamPost
android-app
ios-app

ఆక‌లి పాట రాసిన యు.విశ్వేశ్వ‌ర‌రావు

ఆక‌లి పాట రాసిన యు.విశ్వేశ్వ‌ర‌రావు

“ఆక‌లై అన్నమ‌డిగితే పిచ్చోడ‌న్నారు నాయాళ్లు” -ఈ పాట 1973లో వ‌చ్చిన దేశోద్ధార‌కులు సినిమాలో ఉంది. అప్ప‌ట్లో పెద్ద హిట్‌. సినిమాలో ప‌ద్మ‌నాభం పాడ‌తాడు. దీన్ని శ్రీ‌శ్రీ రాశాడ‌నుకున్నారు చాలా మంది. సొసైటీని నిల‌దీసే పాట‌లు ఆ రోజుల్లో శ్రీ‌శ్రీ‌నే ఎక్కువ‌గా రాసేవాడు. అయితే ఇది రాసింది ఆ సినిమా నిర్మాత యు.విశ్వేశ్వ‌ర‌రావు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాని అభ్యుద‌యం మిళితం చేసి తీయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. కంచుకోట‌లో కూడా రాజ‌రికాన్ని నిల‌దీసే డైలాగ్‌లు చాలా వుంటాయి. పెత్తందార్లు కూడా అదే టైప్ సినిమా.

దేశోద్ధార‌కులులో రాజ‌కీయాల‌పై చాలా సెటైర్లు ఉంటాయి. త‌ర్వాత ఆయ‌న తీర్పు , మార్పులాంటి కొత్త త‌ర‌హా సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌కి వియ్యంకుడు కూడా. శ్రీ‌శ్రీ‌తో గాఢ‌మైన అనుబంధం. ఒక‌సారి తెల్లారేస‌రిక‌ల్లా పాట రాయాల‌ని శ్రీ‌శ్రీ‌ని కోరాడు. ఒక గంట‌లో రాసి శ్రీ‌శ్రీ నేరుగా విశ్వేశ్వ‌ర‌రావుని నిద్ర‌లేపి పాట వినిపించాడు. పాట రాసిన కాగితాన్ని జేబులో పెట్టుకుని తెల్ల‌వారి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి విశ్వేశ్వ‌ర‌రావు వెళ్లాడు. కాసేప‌టికి ఆయ‌న పేరుతో అనౌన్స్‌మెంట్ వినిపించింది. అడ్జెంట్‌గా రావాల‌ని విశ్వేశ్వ‌ర‌రావు హ‌డావుడిగా వ‌స్తే ఎదురుగా శ్రీ‌శ్రీ‌. పాట‌లో కొన్ని క‌రెక్ష‌న్స్ ఉన్నాయ‌న్నాడు. ఈ లోగా విమానం వెళ్లిపోయింది. విశ్వేశ్వ‌ర‌రావు త‌ల ప‌ట్టుకుని “నీతో పాట రాయించుకోవ‌డం ఇదే ఆఖ‌రు” అన్నాడు. త‌ర్వాత చాలా రాయించుకున్నాడు.

ప‌నిలో ప‌ర్ఫెక్ష‌నిస్ట్ శ్రీ‌శ్రీ‌. అవ‌త‌లి వాళ్ల ప‌నితో సంబంధం వుండ‌దు. యాధాటి కాశీప‌తి రాసిన పుస్త‌కంలో ఈ సంఘ‌ట‌న ఉంది.

92 ఏళ్ల వ‌య‌సులో విశ్వేశ్వ‌ర‌రావు క‌రోనాతో పోయాడు. చాలా గౌర‌వంగా సాగాల్సిన అంతిమ యాత్ర అన్యాయంగా జ‌రిగింది. క‌రోనాకి అంద‌రూ స‌మాన‌మే. మ‌ర‌ణాన్ని అగౌర‌వ‌ప‌ర‌చ‌డానికే వ‌స్తుంది.