iDreamPost
android-app
ios-app

విశాఖ ఎయిర్ పోర్ట్ మూత అనివార్యమేగా..

  • Published Nov 19, 2020 | 4:15 AM Updated Updated Nov 19, 2020 | 4:15 AM
విశాఖ ఎయిర్ పోర్ట్ మూత అనివార్యమేగా..

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కొత్త రూపు సంతరించుకుంటుంది. ఇప్పటికే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కి ఈ నగరం దిక్సూచిగా ఉంటుంది. తూర్పు తీరంలో మరో ముంబై నగరంగా అభివృద్ధి చెందడానికి ఈ సాగర నగరానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా స్మార్ట్ సిటీల విషయంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. స్మార్ట్ సిటీ కాంగ్రెస్ లో దేశం నుంచి ఎంపికైన ఏకైక నగరంగా విశాఖ ఉంది.

ఈ నేపథ్యంలో విశాఖ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వైపు ఏపీ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. గతంలో ప్రతిపాదించిన భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు ముందుకు సాగకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరిగింది. తాజాగా జగన్ ప్రభుత్వం చొరవ తీసుకోవడం మూలంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందుకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ ని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కలిశారు. శంకుస్థాపనకు ఆహ్వానించారు. పలు ప్రతిపాదనలను ఆయన ముందుంచారు.

అందులో భాగంగా విశాఖ నగరంలో ప్రస్తుతం నేవీ అధికారుల పర్యవేక్షణలో ఉన్న ఎయిర్ పోర్ట్ ని కొన్నేళ్ల పాటు మూతవేయాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆద్వర్యంలో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులకు పలు ఆటంకాలుంటాయి. ముఖ్యంగా నేవీ అధికారుల అనుమతులు అవసరం అవుతుంటాయి. దాంతో విశాఖ ఎయిర్ పోర్ట్ అవసరం మేరకు అభివృద్ధి జరగడం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రతిపాదనలు వచ్చాయి. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణానికి రంగం సిద్ధమయ్యింది.

హైదరాబాద్ అనుభవం చూసినా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరిగే వరకూ బేగంపేట నుంచే కార్యకలాపాలు సాగేవి. ప్రస్తుతం సర్వం శంషాబాద్ అన్నట్టుగా మారింది. అత్యవసర సందర్భాలు, ఇతర అవసరాల మేరకు మాత్రమే బేగంపేట ఎయిర్ పోర్ట్ వినియోగిస్తున్నారు. త్వరలో విశాఖ కూడా అదే తరహాలో సాధారణ ప్రయాణాలకు పూర్తిగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ వినియోగంలోకి రాబోతోంది. రాబోయే మూడేళ్లలో నిర్మాణం ప్రారంభించాలని సంకల్పంతో ఉన్న సమయంలో అది పూర్తయిన తర్వాత వైజాగ్ విమానాశ్రయం నుంచి సివిల్ ఆపరేషన్స్ నిలిపివేయాల్సిన పరిస్థితి అనివార్యం. దానికి అనుగుణంగా ఏవియేషన్స్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ అంశాన్ని తాజాగా విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూల స్పందన కూడా వచ్చిందని సమాచారం. విశాఖ వాసులకు మరింత అనుగుణంగా ఉండే రీతిలో ఎయిర్ పోర్ట్ సిద్ధం అయితే ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్ట్ ని నేవీ సహా ఇతర రక్షణ అవసరాలకు మళ్లించే అవకాశం ఉంటుంది. అది నగర వాసులకు కూడా ఉపశమనం అవుతుంది.