రేపటి నుంచి రెండు రోజులపాటు నగరంలో విశాఖ ఉత్సవ్ జరగనుంది. ఉత్సవాలను ప్రారంభిచేంచేదుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రానున్నారు. ఏపీ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన తర్వాత తొలిసారి నగరానికి వస్తుండటంతో ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సీఎంకు స్వాగతం పలకనున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 24 కిలోమీటర్ల పొడవున నిలుచుని వైఎస్ జగన్ కు అభివాదం తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.
ఉత్సవ్ విశేషాలు
ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, వీఎంఆర్డీయే చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రకటించారు. ఇందులో భాగంగా బీచ్ రోడ్డులోని ప్రధాన వేదికతో పాటు వైఎస్ఆర్ సెంట్రల్ పార్కులో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ లు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 28 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్ విగ్రహం నుంచి బీచ్ రోడ్డులోని ప్రధాన వేదిక వరకు 10 వేల మంది విద్యార్థులతో భారీ కార్నివాల్ నిర్వహించనున్నారు. ఇందులో నేవీ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాయంత్రం 6 గంటలకు బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఉత్సవాలను అధికారికంగా ప్రారంభిచనున్నారు.
రెండు దశాబ్దాలు గడిచినా…
విశాఖపట్నం సంస్కృతి, కళలు, నృత్యంతో పాటు నగర అందాలను ప్రపంచానికి చాటిచెప్పాలనే లక్ష్యంతో 1997 నుంచి విశాఖ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఏటా ఆర్భాటమే తప్ప విశాఖ నగర అభివృద్ధికి ఈ ఉత్సవాలు ఏమేరకు ఉపయోగ పడుతున్నాయి అంటే మాత్రం చెప్పడం కష్టం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు విశాఖ ఉత్సవాలు విఫలమవుతుండటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి . వాటిలో కొన్నిటికి గురించి చూద్దాం..
తేదీలు ఓ సమస్యే…
ఏటా డిసెంబర్ లో నిర్దిష్ట తేదీల్లో.. నిర్దిష్ట రోజుల్లో జరగాల్సిన ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. వరుసగా రెండేళ్లు డిసెంబర్లో జరిగితే మూడో సంవత్సరం జనవరికి వెళ్లిపోతున్నాయి. ఒక సంవత్సరం మూడు రోజులు జరిగితే మరోసారి రెండు రోజులకు పరిమితం అవుతున్నాయి. ఈ పద్దతి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్క రాష్ట్రమైన ఒడిశా పూరి, కోణార్క్ ఫెస్టివల్స్ ను ఏటా నిర్దిష్ట తేదీల్లో నిర్వహిస్తోంది. ఏపీ దాన్ని ఆదర్శం గా తీసుకోవాలి. అప్ప్పుడే సూరజ్ కుండ్ మేళా, గోవా కార్నివాల్ తరహాలో విశాఖ ఉత్సవాలు విజయవంతం అవుతాయి.
తిరునాళ్ళు కావివి…
ఇప్పటి వరకు జరిగిన విశాఖ ఉత్సవాలను పరిశీలిస్తే దిశా దశా లేకుండా సాగాయనిపిస్తుంది. నగర సమున్నత వారసత్వాన్ని, ఆహార అలవాట్లను దేశ విదేశాలకు చాటిచెప్పేలా జరగాల్సిన ఉత్సవాలు నిర్వాహకుల తీరుతో అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఉత్సవాల్లో అవసరానికి మించి అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే ఉత్సవాల థీమ్ కు సంబంధంలేని వాణిజ్య స్టాల్స్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అలాకాకుండా విశాఖ, ఆంధ్ర ప్రదేశ్ ల సంస్కృతులను తెలియచెప్పేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే తిరణాల్లలో మాదిరి జెయింట్ వీల్ ఏర్పాటు, బుడగలు, విజిల్స్ అమ్ముతుండటం విశాఖ ఉత్సవాల స్థాయిని లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అధికారులు వీటిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది . దీంతో పాటు నగరాన్ని సాంస్కృతిక, చారిత్రక, రాజకీయ, పారిశ్రామిక కోణాల్లో సందర్శకుల ముందు ఆవిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అరకుతో పాటు నగరంలోని ఆయా ప్రదేశాలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
అధికారులను దూరం పెడితే..
విశాఖ ఉత్సవాల నిర్వహణలో అధికారులను పక్కనపెడితే మంచి ఫలితాలు ఉంటాయనే భావన నగర వాసులతో పాటు అనేక మందికి ఉంది. ప్రారంభంలో ఉత్సవాలను మధురవాడలో శిల్పారామంలో నిర్వహించాలనుకున్నారు. కానీ అధికారులు అంతర్గత కలహాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలు నిర్వహణను అనుభవం ఉన్న సంస్థకు అప్పగించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించాలి. అలాగే విశాఖకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పెంచాలి. ఇలా చేయగలిగితే విదేశీ టూరిస్టులు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్ఛే అవకాశం ఉంటుంది.
విశాఖను విశ్వనగరం చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటిచారు. పైగా విశాఖ ఇప్పుడు పరిపాలనా రాజధానిగా అవతరించనుంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఉత్సవాలాను వేరే స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడైనా అధికారులు ఆయా అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఉత్సవాల నిర్వహణకు ఓ సార్దకతంటూ దక్కుతుంది. .