మనం ఓట్లేస్తే గెలిచారు…మన దగ్గరొకొచ్చి కోట్లు సంపాదించారు…అయినా మన నగరం రాజధానిగా పనికిరాదంటున్నారు. ఇంతకంటే ద్రోహం ఏమన్నా ఉంటుందా…? విశాఖలో ఇప్పుడేయిద్దరూ కలిసినా ఇదే చర్చ.. ఇంతకీ ఎవరా ఇద్దరనేగా మీ సందేహం. ఒకరు విశాఖ ఉత్తరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కాగా, మరొకరు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ.
వ్యాపార రీత్యా నగరానికి వచ్చి స్థిరపడిన గంటా శ్రీనివాసరావును రాజకీయంగా విశాఖ జిల్లా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. ఆయన 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం, 2009లో అనకాపల్లి, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అయితే ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారినా విశాఖ ప్రజలు మాత్రం గంటాను ఆదరిస్తూనే వచ్చారు. కానీ, ఆయన తాజా వైఖరిపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర గల్లీల్లో విశాఖ పరిపాలనా రాజధానిగా కావాలంటూ నినదించిన గంటా శ్రీనివాసరావు…తాజా అసెంబ్లీ సమావేశాల్లో మౌనముని అవతారం ఎత్తారు. దీంతో గంటా చిత్తశుద్ధిపై జిల్లా ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రెండో వ్యక్తి…వెలగపూడి రామకృష్ణ.. ఈయన మూడుసార్లు విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, తాజా అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ రాజధానిగా ఏర్పాటు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఏకంగా స్పీకర్ పోడియంపైకెక్కి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతినడం నియోజకవర్గ ప్రజల వంతైంది. వంగవీటి రంగా హత్య కేసులో ఏ5 నిందుతుడిగా ఉన్న వెలగపూడికి విశాఖ ఆశ్రయం ఇచ్చి…రాజకీయ భవిష్యత్ ఇచ్చింది. ఇంత చేస్తే ఆయన మనకిచ్చే బహుమానం ఇదేనా అంటూ నగర ప్రజలు ఆయనపై శివాలెత్తుతున్నారు.
విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఈ ఇద్దరు తెలుగు తమ్ముళ్లు తొలి నుంచీ విజయవాడపైనే మెగ్గుచూపుతున్నారనేది నిర్వివాదాంశం. విశాఖలో రెండవ పోర్టు ఏర్పడకుండా అడ్డుకున్నారనే అపవాదు…వీరితోపాటు తెలుగుదేశం పార్టీపై ఉంది. అలాగే గతంలో టీడీపీ ప్రభుత్వం విశాఖలో కాకుండా విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటుకు లోపాయికారీగా ప్రయాత్నాలు చేసినప్పుడు ఈ ఇద్దరూ అడ్డుకోకుండా… వంతపాడారు. అయితే తాజాగా వీరి చర్యలు, విశాఖ ప్రజల స్పందన చూస్తుంటే గంటా, వెలగపూడిల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.