Idream media
Idream media
ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలు, కరువు కాటకాల కంటే అంతుచిక్కని వ్యాధులే మనుషుల ప్రాణాలను తుడిచిపెట్టేసేవి. 19వ దశాబ్ధం వరకు కూడా మొత్తం మరణాల్లో సగానికి పైగా ఈ అంటువ్యాధుల వల్ల సంభవించినవే. ప్లేగు, కలరా, మశూచి లాంటివి ప్రపంచంలో కోట్లాది ప్రాణాలను హరించేశాయి. వాటిని ఎలాగోలా అధిగమించేశాం. ఆ తర్వాత యాంటి బయాటిక్స్ ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. ఇక ఎలాంటి మహమ్మరినైనా ఎదుర్కొంటాం అనే ఆత్మవిశ్వాసం శాస్త్రవేత్తల్లో వచ్చింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు.
ఏడాదికో కొత్త వ్యాధులు, కొత్తకొత్త వైరస్‌లు విజృంభించి మానవాళి మనుగడకు సవాళ్లు విసురుతున్నాయి. వీటి పీడను వదిలించుకోవడం అంత తేలికైన పనికాదని, పైగా ఇప్పుడు ప్రజల పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారైంది. బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, సార్స్, జికా, డెంగీ, ఎబోలా.. తాజాగా చైనాలో బయటపడి.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. లాంటి కొత్త వ్యాధులు మానవాళిని గడగడలాడిస్తున్నాయి.
ఆధునికంలోనే ఎక్కువ..
మనం అత్యాధునిక యుగంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ప్రమాదకర వైరస్‌లు పుట్టుకొచ్చేందుకు ఇప్పుడే ఆస్కారం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో కిక్కిరిసిన జీవనం, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువుల కోసం ప్రపంచమంతా మానవులు తిరగడంతో వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అలాగే పశువులు, పక్షలు మధ్య మానవాళికి మధ్య బంధం విడదీయలేనిది. దీంతో వాటి నుంచి వైరస్‌లు సోకడం పెరుగుతోంది. బ్యాక్టీరియాకు సమర్థమైన యాంటీబయాటిక్స్ ఉన్నప్పటికీ వైరస్‌ల విషయంలో ఇప్పటికీ చాలా వెనుకబడి ఉన్నాం. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, వేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టడం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. మనుషుల్లోనూ, వారి పరిసరాల్లోనూ ఉంటున్న ఎలుకలు, గబ్బిలాలు, బాతులు, దోమలు, ఇతర జంతుజాలంలో ఎలాంటి వైరస్‌లు ఉన్నాయనే దానిపై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే దాదాపు 900 వైరస్‌లు దొరికాయి. వీటిలో 800 వరకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు. ప్రస్తుతం దోమలు మోసుకొచ్చే డెంగీ, జికా, వెస్ట్‌నైల్ వంటివే కాకుండా చైనాలోని సార్స్‌లాంటి వైరస్, ఐరోపాలో పక్షుల నుంచి వచ్చే ఉసుటు వంటివీ చాలా చురుకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేసిన పలు వైరస్‌ల గురించి తెలుసుకుందాం..
ఎబోలా అలియాస్ జైరీ ఎబోలా.. ‘జీనస్ ఎబోలై వైరై’లోని ఐదు జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన జాతి ఇది. ఈ వైరస్ సోకినవారికి వచ్చే వ్యాధిని ఎబోలా వైరస్ డిసీజ్ గా వ్యవహరిస్తారు. గతంలో దీన్ని ఎబోలా హేమరేజిక్ ఫీవర్‌గా పిలిచేవారు.
ఆఫ్రికా ఖండంలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (జైరీ)లో తొలిసారి దీన్ని కనుగొన్నారు. అక్కడి ఒక నది పేరు ఎబోలా. ఆ పేరే ఈ వైరస్‌కు పెట్టారు. 1976లో పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల గ్రామాల్లో ఈ వైరస్ ప్రబలింది. అప్పుడే ప్రపంచానికి పరిచయమైంది. ఈ వైరస్ ప్రబలిన ప్రాంతాల్లో 30 వేలకు పైగా జీవజాతుల నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎట్టకేలకు 2005లో.. ‘ఫ్రూట్ బ్యాట్స్’గా వ్యవహరించే మూడు గబ్బిలం జాతుల ఆర్‌ఎన్‌ఏల్లో ఈ వైరస్ ఉన్నట్టు కనుగొన్నారు. ఈ గబ్బిలాల్లో ఆ వైరస్ దాగి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి హానీ జరగకపోవడంతో.. ఎబోలా వైరస్‌కు ఆ గబ్బిలాలే సహజ ఆశ్రయాలుగా ఉన్నట్టు గుర్తించారు. గబ్బిలాలు సగం తిని పడేసిన వాటిని అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, దుప్పులు … ఇతర జీవాలు తినడంతో వాటికి వైరస్ సోకింది. ఆయా జీవాలను చంపి తిన్న మనుషుల్లోకీ పాకింది. అలాగే గినియా, తోమా, కిస్సి, గుయెర్జ్ వంటి ప్రాంతాల్లో గబ్బిలాల సూప్ తాగే, గబ్బిలాలను మంట మీద కాల్చుకుని తినే అలవాటుంది. అది కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు.
నిఫా.. ఇది గబ్బిలం నుంచి వచ్చే వైరస్. 1999లో దీని విజృంభణ మొదలయ్యింది. గబ్బిలాల ఆవాసాలకు సమీపంలో పందులను పెంచడం, గబ్బిలాలు తిని పారేసిన పండ్లను పందులు తినడం ద్వారా వ్యాప్తి పెరిగిపోయింది. ఈ వైరస్ పందులు, గబ్బిలాల నుంచి మనుషులకు సోకుతుంది. దీనివల్ల ఇప్పటికే వందలాది మంది చనిపోయారు.
జికా వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుంది. మొదట ఆఫ్రికా, ఆసియా దేశాల్లోనే కనబడేది. 2013 నుంచి ప్రపంచమంతా విస్తరిచడం మొదలుపెట్టింది. దీని వల్ల ఎంతో మంది చనిపోగా.. మరెంతమందో పిల్లలు మెదడు చిన్నగా ఉండే వ్యాధితో జన్మించారు. దీని నివారణ కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి.
చికెన్‌గున్యా.. ఆఫ్రికాలోని కోతులు, చిన్నచిన్న జంతువుల మధ్య దోమల ద్వారా వ్యాపించింది ఈ జ్వరం. 2005లో భారత్ సహా ఆసియాలోని పలుదేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీనివల్ల మరణ భయం లేకున్నా మనిషి శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఇవేకాక లాసా జ్వరం, రిఫ్ట్‌వ్యాలీ జ్వరం, సార్స్, మెర్స్ వైరస్‌లు, క్రిమియన్ కాంగో జ్వరాలు, బర్డ్‌ఫ్లూ లాంటివి ఎంతో మందిని బలితీసుకున్నాయి.