iDreamPost
iDreamPost
ఇప్పుడున్న సమాజంలో పక్కమనిషికి సహాయం చేయడమే గగనమైపోయింది. కానీ ఓ బాలుడికి క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఊరి వాళ్లంతా కలిసి అయిదు గంటల్లో 91 లక్షలు వసూలు చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. ఈ అరుదైన ఘటన కేరళలో జరిగింది. కొట్టాయంకు చెందిన అతిరంపూజ గ్రామంలో జెరోమ్ కె జస్టిన్ అనే ఆరేళ్ల బాలుడికి క్యాన్సర్ సోకిందని, అతనికి బోన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీనికోసం దాదాపు 30 లక్షల వరకు అవుతుందని డాక్టర్లు తెలిపారు.
అయితే ఆ బాలుడి తల్లిదండ్రులు కేవలం దుకాణం నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంత డబ్బు తమ వద్ద లేక, ఏం చేయాలో తెలియక ప్రస్తుతం తాత్కాలిక చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. దీంతో గ్రామస్థులు చలించిపోయి ఆ బాలుడి కోసం డబ్బులు జమచేయాలని భావించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు తమవంతుగా సహాయం చేయాలని, కనీసం 500 రూపాయలు ఇవ్వాలని గ్రామంలో దండోరా వేయించారు. దీంతో ఆ బాలుడు చికిత్సకి కావాల్సిన డబ్బులు చేకూరుతాయని భావించారు.
దీనికి గ్రామ ప్రజలంతా స్పందించి డబ్బులు ఇచ్చారు. గ్రామ యువకులు కొంతమంది కమిటీగా ఏర్పడి డబ్బును కలెక్ట్ చేశారు. దండోరా వేయించిన ఐదుగంటల్లోనే 91 లక్షలు జమయ్యాయి. ఆ బాలుడికి వైద్యం కోసం కావాల్సిన సొమ్మును ఇచ్చి మిగతా డబ్బులను అదే విధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికోసం ఖర్చు చేయాలని పంచాయతీ పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ కుటుంబం గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. కోజికోడ్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడికి బోన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించనున్నారు. ఆపద సమయంలో గ్రామమంతా తరలి వచ్చి మేమున్నామంటూ చేసిన సహాయాన్ని చూసి అంతా అభినందిస్తున్నారు.