iDreamPost
android-app
ios-app

ఇక్కడ సరే.. మరి కర్ణాటకలో ఏంటి సోము సార్‌..?

ఇక్కడ సరే.. మరి కర్ణాటకలో ఏంటి సోము సార్‌..?

వినాయక ఉత్సవాల పేరుతో ఏపీలో బీజేపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితిని అందరూ ఇళ్లల్లోనే జరుపుకోవాలని ఏపీ సర్కారు సూచించింది. ప్రభుత్వం చేసిన ప్రకటన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో జగన్‌ సర్కారుపై ధ్వజమెత్తారు. హిందువుల పండగలకే ఆంక్షలు విధిస్తారా? అని ప్రశ్నించారు. వినాయక చవితి వేడుకలకు బయటకొస్తే అరెస్టు చేస్తారా? ఒక వర్గాన్నే మీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? అన్నారు.

ఈ విషయం పక్కన పెడితే.. వాస్తవానికి ఏపీ సర్కారు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోవిడ్‌ నిబంధనలు విధిస్తోంది. సడలిస్తోంది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా థర్డ్‌ వేవ్‌ కచ్చితంగా సెప్టెంబర్‌ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని సూచించింది. థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపైనా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అయితే ఈ సమయంలో వినాయక చవితి వేడుకలు బహిరంగంగా నిర్వహించడం ప్రమాదకరమే. ఇప్పటికే సెకండ్‌ వేవ్‌లో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వినాయక చవితి వేడుకలు ఇళ్లల్లోనే జరుపుకోవడం మంచిది. ఎంతో కోలాహలంగా నిర్వహించే గణేశ్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాల్లో కోవిడ్‌ నిబంధనలు సడలిస్తే అంతే సంగతులు. ఇప్పటికే చాలా మంది మాస్క్‌ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు కూడా.

Also Read : ఏపీ బీజేపీకి, పురంధేశ్వ‌రికి సంబంధం లేదా?

మరి అక్కడ మాటేంటి సోము..

ఏపీలో జగన్‌ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏదో ఒక విషయంపై రచ్చ చేయడం ఆయనకు అలవాటుగా మారిందనే చెప్పాలి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందానే ఆయన వ్యవహారం సాగుతోంది. పార్టీని ఎలా పటిష్టం చేయాలనే ఆలోచనను ఆయన పూర్తిగా పక్కన పెట్టి.. ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలే ఆయన ఎక్కువ చేస్తున్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉందని చెప్పొచ్చు. దానికి ఆయన హిందుత్వం అనే రంగు పులుముతూ పబ్బం గడుపుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఏపీ సర్కారు సొంతంగా తీసుకున్న నిర్ణయమైతే కాదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ బహిరంగ గణేశ్‌ వేడుకలకు అక్కడి ప్రభుత్వం నో చెప్పింది. ఇళ్లల్లోనే జరుపుకోవాలని సూచించించింది. మరి ఆ రాష్ట్రంలో అక్కడ అలా ఉంటే.. ఈ రాష్ట్రంలో మాత్రం వినాయక ఉత్సవాలపై ఈ రాద్ధాంతం ఏంటో సోము వీర్రాజుకే తెలియాలి.

– Written By

ప్రసాద్