Idream media
Idream media
కులం అన్నది తరతరాలుగా నిక్షిప్తం అయిపోయిన భారత దేశంలో కులానికి చెందిన చిహ్నాలు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. నివాస ప్రాంతాలకు కులానికి చెందిన పేర్లు ఎన్నో చోట్ల ఎదురవుతూ ఉంటాయి. బ్రాహ్మణ అగ్రహారం, క్షత్రియపురం లాంటి పేర్లతో పెద్ద ఇబ్బంది లేకపోయినా, దళిత కులాలకు చెందిన పేర్లు ఇప్పటికీ ఉండడం సహించరాని విషయం.
దీన్ని రూపుమాపడానికి ఈ పేర్లు తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు అయితే ఇచ్చారు కానీ ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. అయితే అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు మాత్రం ఈ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కులం పేర్లు అన్నీ తొలగించి, ఆయా కాలనీల్లో నివసించే వారి అభీష్టం మేరకు కొత్త పేర్లు పెట్టారు.
అంబేద్కర్, ఫూలే, గాంధీ, జగజ్జీవన్ రామ్, ఇందిర, నెహ్రూల పేర్లే కాకుండా చాలా మంది స్పెయిన్ దేశం నుంచి అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన డేవిడ్ ఫెర్రర్ పేరు కూడా తమ కాలనీలకు పెట్టుకున్నారు. అనంతపురం కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించి కులకాలనీలకు కొత్త పేర్లు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.