iDreamPost
iDreamPost
అదృష్టం మనవైపు ఉంటే.. అవకాశాలు నడిచొస్తాయంటారు. కాసింత ప్రయత్నం.. మరి కాసింత సహనం అవసరం అంతే. ఆ ఓర్పు, కృషి ఆమెను అనూహ్యంగా అందలం ఎక్కించాయి. రాష్ట్రంలోని రెండో పెద్ద నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై కూర్చోబెట్టాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడలోని మెట్టినింటికి వచ్చి ఇపుడు రాజకీయ మెట్లు ఎక్కుతున్న ఆ అదృష్టవంతురాలు రాయన భాగ్యలక్ష్మి.
ఇదీ నేపథ్యం..
అనూహ్యంగా మేయర్ పదవినందుకున్న భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని పోడలి. తండ్రి బెవర నారాయణరావు నీటిపారుదల శాఖలో పనిచేశారు. తల్లి యశోద కృష్ణవేణి గృహిణి. తండ్రి ఉద్యోగరీత్యా వీరి కుటుంబం చీపురుపల్లి, పాలకొండ ప్రాంతాల్లో ఎక్కువ కాలం నివసించింది. వీరు చీపురుపల్లిలో ఉన్నప్పుడే..రెండో సంతానంగా భాగ్యలక్ష్మి 1981 జూన్ 25 న జన్మించారు. చీపురుపల్లి, పాలకొండ ప్రాంతాల్లోనే ఆమె ఇంటర్ వరకు చదువుకున్నారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా వ్యవహరించిన తండ్రి నారాయణ రావుకు రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు, నాయకుడిగా ఆయన పనితీరును చూస్తూ ఎదిగిన భాగ్యలక్ష్మి పై ఆ ప్రభావం బాగా ఉండేది. 2002లో విజయవాడకు చెందిన రాయన నరేంద్రకుమార్ తో వివాహం కావడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది.
మామ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..
పెళ్లి చేసుకొని మెట్టినింటికి వెళ్లిన భాగ్యలక్ష్మి ఆ కుటుంబ రాజకీయ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నారు. ఆమె సోదరి మామ సోమినాయుడు కనకదుర్గమ్మ గుడి చైర్మన్ గా చేశారు. సొంత మామ బీజేపీ నాయకుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కేబుల్ వ్యాపారంలో ఉన్న ఈ కుటుంబం తరపున గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయిన భాగ్యలక్ష్మి ఏమాత్రం నిరాశ చెందలేదు. వైస్సార్సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా పనిచేయడం ద్వారా తాజా ఎన్నికల్లో 46వ డివిజన్ లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే మేయర్ పదవికి పార్టీ తనను ఎంపిక చేస్తుందని ఆమె అసలు ఊహించలేదు.
జనరల్ అయినా బీసీ మహిళకు ఛాన్స్
విజయవాడ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. దాంతో 34వ డివిజన్ నుంచి పోటీ చేసిన పుణ్యశీలకు మేయర్ పదవి ఇస్తారని పార్టీ వర్గాలతో పాటు అందరూ భావించారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం ఆలోచన మారింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చేసిన సూచనల మేరకు విజయవాడ మేయర్ పదవిని బీసీ మహిళకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా నగరాలు సామాజికవర్గానికి చెందిన భాగలక్షికి మహత్తర అవకాశం లభించింది.
Also Read : విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల తీర్పు సారాంశం అదేనా