iDreamPost
android-app
ios-app

సాగర్‌ బరిలో విజయశాంతి..?

సాగర్‌ బరిలో విజయశాంతి..?

తెలంగాణలో మరో ఉప ఎన్నిక పోరాటానికి రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. నాగార్జునసాగర్‌లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే కసరత్తును ముమ్మరం చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత జానారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ నుంచి ఓ యువ నాయకుడి పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. తెలంగాణపై కన్నేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగేస్తోంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాల తర్వాత నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక రూపంలో ఎదురయ్యే అగ్నిపరీక్షలో నెగ్గి తీరాలని ఆ పార్టీ యోచిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటున్న కమలం నేతలు.. అదే దూకుడుతో సాగర్‌ను గెలుచుకుంటారా? టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను నిలువరించడంలో సక్సెస్‌ అవుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలనే అంశంపై బీజేపీలో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అదే సమయంలో అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కానప్పటికీ.. ఐదుగురు ఆశావహులతో పార్టీ నాయకత్వం విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత, టీడీపీ నుంచి ఏడాది కిందట పార్టీలో చేరిన అంజయ్యయాదవ్‌తో పాటు ప్రముఖ డాక్టర్‌ రవినాయక్‌, బాలూనాయక్‌, ఇంద్రసేనారెడ్డి.. ముఖ్య నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నిక షెడ్యూల్‌ విడుదలకు మరి కొన్ని రోజులు పట్టవచ్చని భావిస్తున్న కమలనాథులు.. సర్వేల నివేదికలు, టీఆర్‌ఎస్‌ వైఖరిని బట్టి తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.

విజయశాంతిని నిలబడితే..

ఇదే క్రమంలో సాగర్‌ బరిలో విజయశాంతిని నిలబెడితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇటీవల సొంత గూటికి చేరిన విజయశాంతి వరుసగా ప్రభుత్వంపై, కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. నిత్యం వార్తలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎప్పటికప్పుడు నియోజకవర్గ ముఖ్యులతో సమీక్షిస్తున్నారు. కొందరు ఆయన దృష్టికి విజయశాంతి పేరును పరిశీలించాలని తీసుకెళ్లినట్లు తెలిసింది.

1998 లో బీజేపీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయశాంతి ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే 2005లో బీజేపీ నుంచి బయట‌కు వచ్చి ‘తల్లి తెలంగాణ పార్టీ’ స్థాపించారు. ఆ త‌ర్వాత పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి కేసీఆర్‌తో కలిసి ప‌ని చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌నటిగా ఖ్యాతి గ‌డించిన ఆమె టీఆర్‌ఎస్‌ నుంచి 2009లో మెదక్‌ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ వాదాన్ని ఢిల్లీ గల్లీ వరకు వినిపించి.. ఉద్యమ నేతగా ఎదిగే ప్ర‌య‌త్నం చేశారు. అనంతర కాలంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. స్టార్‌ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారు. 2014లో మెదక్‌ ఎంపీగా పోటీచేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఘోర పరాజయం మూటగట్టకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై బహిరంగంగానే వ్యతిరేక స్వరం వినిపించారు.‌ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు విజయశాంతి దూరంగా ఉంటున్నారు. గాంధీ భవన్‌వైపు కనీసం కన్నెత్తి కూడా చూడ లేదు. అనంత‌రం మ‌ళ్లీ సొంత గూటికి చేరారు. ఆమె బీజేపీలో చేరిన త‌ర్వాత త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో కీల‌కం కానున్నారు. పోటీలో ఆమె పేరు కూడా వినిపిస్తుండ‌డంతో ఉత్కంఠ ఏర్ప‌డింది.