iDreamPost
android-app
ios-app

హోదాపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విజయసాయిరెడ్డి ఘాటు స్పందన

  • Published Feb 08, 2022 | 2:09 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
హోదాపై  కేంద్ర ప్రభుత్వ వైఖరిపై విజయసాయిరెడ్డి ఘాటు స్పందన

ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్నవన్నీ కుంటిసాకులేనని వైసీపీ పార్లమెంటరీ నేత వి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఘాటు స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం కాలయాపన చేసేందుకు కుంటిసాకులు వల్లిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, నికర రుణ సేకరణ పరిమితిని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరుని ఆయన తప్పుబట్టారు.

ఏపీకి నికర రుణ సేకరణ పరిమితిని తగ్గించడం రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అంటూ విమర్శించారు. టీడీపీకి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేయడం తప్ప రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతీ సమావేశంలోనూ పీఎం మోదీతో పాటుగా హోం మంత్రి అమిత్ షాని కూడా కలిసి ప్రత్యేక హోదా ప్రస్తావించినట్టు తెలిపారు. ప్రత్యేక హోదాపై తాము పోరాడుతుంటే విపక్షాలు అసత్య ప్రచారానికి పూనుకుంటున్నాయన్నారు. కేంద్రం చెబుతున్న ఆరు కారణాలను ప్రస్తావిస్తూ అవన్నీ సమస్య నుంచి దాటవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

విభజన చట్టంలో లొసుగులు ఉంటే సరిదిద్దాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. విభజనలో రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. హోదా ఇస్తామని ప్రధాని చెప్పిన సంగతి మరచిపోకూడదన్నారు. ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన ఇతర రాష్ట్రాలు అడుగుతాయని చెప్పడం అర్థరహితమన్నారు. ప్రధాని హామీ ఇచ్చినప్పుడు ఆ విషయం గుర్తులేదా అంటూ నిలదీశారు. విభజన చట్టంలో లేకపోయినా ఉత్తరాఖండ్ కి ప్రత్యేక హోదా ఇచ్చిన అంశాన్ని సాయిరెడ్డి గుర్తు చేశారు. బీజీపే పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు మరో న్యాయం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.ప్రత్యేక హోదా అనేది బీజేపీకి రాజకీయ అంశం కావచ్చు…కానీ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు అది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా…ప్రత్యేక ప్యాకేజీకి ఏ విధంగాను ప్రత్యామ్నాయం కాబోదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఘోర తప్పిదానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని ఆయన నీరుగార్చేశారని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 280 (2) ప్రకారం సిఫార్సులను రాష్ట్రపతికి సమర్పించడం మాత్రమే ఆర్థిక సంఘం విధి అని ప్రత్యేక హోదా అంశం వారి పరిధిలోకి రాదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులు మానుకుని అనేక ఇబ్బందులలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు హయాంలో పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఇప్పుడు తెలుగు ప్రజలను శిక్షించడం తగదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో రుణ పరిమితి కంటే తక్కువగా రుణాలు పొందిన వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని ఏపీకి మినహాయింపులు ఇవ్వాలని ఆయన కోరారు. నికర రుణపరిమితి అంశంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంత మెరుగ్గా ఉందో గణాంకాలతో సహా వివరించారు. 2019-20లో కేంద్ర ప్రభుత్వంలో ద్రవ్యలోటు 4.6 శాతం ఉంటే, ఏపీలో అది 4.1 శాతం ఉందని వివరించారు. 2020-21లో కేంద్రంలో లోటు 9.2 శాతం ఉంటే ఏపీలో అది 5.4 శాతం ఉందని తెలిపారు. 2021-22లో కేంద్రంలో ద్రవ్యలోటు 6.9 శాతం ఉండగా ఏపీలో 3.5 శాతం ఉందన్నారు. వాస్తవ లెక్కల ఆధారంగా నికరరుణపరిమితి మీద విధించిన ఆంక్షలు తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.