iDreamPost
android-app
ios-app

సుజనా చౌదరి మీద చర్యలు తీసుకుంటారా?

  • Published Dec 26, 2019 | 8:10 AM Updated Updated Dec 26, 2019 | 8:10 AM
సుజనా చౌదరి మీద చర్యలు తీసుకుంటారా?

2014 ఎన్నికల రోజులు… ఎటు చూసినా అవినీతి ఆరోపణలు బొగ్గు కుంభకోణం,2G స్కాం,కామన్ వెల్త్ స్కాం లక్షల కోట్ల ఆరోపణలు నిత్యం మీడియాలో వార్తలు. ఒక వైపు అరవింద్ కేజ్రీవాల్ మరోవైపు మోడీ అవినీతి రహిత పాలన వాగ్ధానంతో ప్రజలు మద్దతు కోరుతూ ప్రచారం చేశారు.

బీజేపీ గెలిచింది మోడీ ప్రధాని అయ్యారు, ప్రభుత్వం మీదు రఫెల్ తప్ప మరొక అవినీతి ఆరోపణ రాలేదు కానీ బ్యాంకులను ముంచిన, ఇతర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డ వ్యాపారవేత్తలను రక్షిస్తున్నారన్న విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. గడచిన 5 ఏళ్ళలో ఈ దేశంలో వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి,బ్యాంకింగ్ రంగాలకి కుచ్చు టోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వారి సంఖ్య 36 అని సాక్షాత్తు ఈ.డి (ఎంఫొర్స్ మెంట్ డైరక్టరేట్ ) కోర్టు జడ్జికే చెప్పిందంటే, దేశంలో దోచుకొని విదేశాలకు పారిపోయే వారి సంఖ్య ఎంతలా పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.ఈ జాబితాలో 9వేల కోట్ల మేర బ్యాంకులకు టోపీ పెట్టిన జల్సా రాయుడు విజయ్ మాల్యా, ఐ.పి.యల్ పేరుతో అక్రమాలకి పాల్పడి,ఫెమా చట్టాలని ఉల్లంఘించిన లలిత్ మోడి, కార్పోరేట్ కన్సల్టెంట్ దీపక్ తల్వార్, ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 11,436 కోట్లమేర ఎగనామం పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడి ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక నేరగాళ్ల జాబితా చాలానే ఉంది.

ఒక పక్కన దేశం వెలిగిపోతోంది అంటూనే ఆర్ధిక నేర అభియోగాలు ఉన్న సుజనా చౌదరి లాంటివారికి భారతీయ జనతా పార్టీ గతంలో కేంద్ర పదవి ఇచ్చి సత్కరించి ఇప్పుడు ఏకంగా తమ పార్టీలో చేర్చుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ ఆపార్టీకి ఆర్ధికంగా అండదండలు అందించటంలో కీలకంగా వ్యవహరించిన సుజనా చౌదరిపై వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని ఆరోపణలున్న సుజనా చౌదరి 2019 తెలుగుదేశం ఓటమి తరువాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే బిజెపి గడప తొక్కటంవారు స్వాగతించి కండువా కప్పటం చకచకా జరిగిపోయాయి. ఇటువంటి వ్యక్తిని కూడా అవినీతిని సహించం అని చెప్పుకునే మోడీ తమ పార్టీలో చేర్చుకోవడంతో మోడీ అవినీతి రహిత పాలన మాటలనే శంకించే విధముగా ఉంది. పార్లమెంటులో అవినీతిపరులు లేకుండా చూస్తానని ఎన్నికల ముందు చెప్పిన మాటలు వట్టి ప్రగల్భాలే అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

సుజనా చౌదరి ఆర్ధిక నేరాలపై రాష్ట్రపతికి విజయసాయి రెడ్డి లేఖ:

మనీలాండరింగ్,షెల్ కంపెనీలు (మోసపూరిత కంపెనీలు) విదేశీ బ్యాంకులని మోసం చేయడం లాంటి తీవ్రమైన ఆర్ధిక నేరాలకు సుజనా చౌదరి పాల్పడ్డారని, దీనిపై ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ,సి.బి.ఐ కలిసి తన దగ్గర ఉన్న ఆధారాలతో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఇటీవలే రాష్ట్రపతికి లేఖ రాసారు. అయితే రాష్ట్రపతి ఆ లేఖకు స్పందించి,విజయ సాయి రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపి నిజనిజాలు తేల్చాలని, కేంద్ర శిక్షణ శాఖ కార్యదర్శి , రెవెన్యూ శాఖ కార్యదర్శి ఆదేశాలు పంపారు. ఈ మేరకు హోం శాఖ అండర్ సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ విజయసాయి రెడ్డికి లేఖ పంపారు.

సుజనా చౌదరి నిర్వహించే కంపెనీలలో 8 తప్ప మిగతావన్ని డొల్ల కంపెనీలేనని, ఈ 8 కంపెనీలలో 50శాతం వ్యాపారం దేశంలోని తన డొల్ల కంపెనీల ద్వారా జరుగుతున్నదని మరో 20శాతం విదేశీ డొల్ల కంపెనీల ద్వారా జరుగుతున్నదని, ఇప్పటికే సుజనా గ్రూప్స్ వివిధ బ్యాంకులకు, ఆర్ధిక సంస్థలకు 8వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉండగా మార్కెట్ లో ఆస్తుల విలువ మాత్రం 132కోట్లు కన్న తక్కువ ఉన్నాయని దాని ఫలితంగా ఈ కంపెనీ షేర్లు కొన్నవారు తీవ్రంగా నష్టపోతారని, సుజనా గ్రూప్స్ కి చెందిన రెండు ప్రధాన కంపెనీలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు 920 కోట్ల రుణాలు ఎగవేశారని, 2014 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సుజనా మెటల్ ప్రొడక్ట్స్ 38 కోట్ల నష్టం చూపగా, సుజనా యూనివర్సల్స్ 6.3 కోట్ల నష్టం చూపిందని, 2011-2014 ఆర్ధిక సంవత్సరం మద్య సుజనా టవర్స్ రుణ భారం 565 కోట్ల నుండి 1,750 కోట్లకు చేరినట్లుగా చూపారని కాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,534 కోట్ల నుండి 37 కోట్లకు తగ్గిపోయిందని విజయసాయి రెడ్డి లేఖలో వివరించారు.

అలాగే సుజనా చౌదరికి చెందిన ఒక గ్రూప్ సింగపూర్ దేశం కేంద్రంగా కేవలం రికార్డుల కోసమే ఇంట్రాసియా పేరుతో అనేక అంతర్జాతీయ కంపెనీల గ్రూప్ ని నిర్వహిస్తూ అంతర్జాతీయ బ్యాంకులనుండి రుణాలు పొంది ఆ రుణాలని సుజనా చౌదరికి చెందిన ఇతర కంపెనీలకు నిధుల రూపంలో మళ్ళించారని,సింగపూర్ లో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు సాగినట్టు రికార్డుల్లో చూపి బ్యాంకులనుండి భారీగా రుణాలు పొంది వాటిని సుజనా తన వ్యక్తిగత ఖాతాలో వేసుకుని అనేక అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను, బ్యాంకులని సుజనా చౌదరి మోసగించారని చెప్పుకొచ్చారు. సుజనా యూనివర్సల్ అనుబంధ సంస్థ హెస్టియా హోల్డింగ్స్,సువాన్స్ హోల్డింగ్స్ మారిషస్ బ్యాంకు నుండి 107 కోట్ల రుణం తీసుకుని బోర్డు తిప్పేశారని ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ బ్యాంకు పిటిషన్ వేసింది. ఈ కేసులో కోర్టుకు హాజరు కానందుకు గతంలో కోర్టు సుజనా చౌదరికి అరెస్టు వారెంటు కూడా జారీ చెసింది. ఇలాంటి లావాదేవీలు కేవలం అంతర్జాతీయ scamster మాత్రమే చెయ్యగలరని చెప్పుకొచ్చారు.

గతంలో కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన మోడీ 66 సభ్యులున్న కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని అందులో 15మంది కళంకితులని మంత్రులని చేసి విమర్శలపాలయ్యారు. ఏ.ఐ.సి.సి అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ నేరుగా ప్రధాన మంత్రినే నిలదీశారు. సుజనా టవర్స్ అధినేత అయిన సుజనా చౌదరి సెంట్రల్ బ్యాంకుకు 316 కోట్లు బకాయి పడ్డారని ఆ బ్యాంకు జాబితాలో ఇవి నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయాయని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన అప్పులు నిరర్ధక ఆస్తులుగా మారటానికి కారకుడైన సుజనాని ఎందుకు మంత్రిని చేశారో చెప్పాలని ఆ బ్యాంకుకు బకాయి పడ్డ మొదటి 20 మందిలో సుజనాది 8వ స్థానమని దీని నుండి రక్షంచటానికే సుజనాని మంత్రిని చేశారా అని నేరుగా మోడీని ప్రశ్నించి, నాడు సభ సాక్షిగా నిలదీసినా మాట్లాడని ప్రధాని మోడీ నేడు సుజనాపై రాష్ట్రపతి పంపిన విచారణ లేఖతో సహకరించి చర్యలు చేపడతారా అనేది ఒక ప్రశ్న ?

అయితే సుజనా చౌదరి మాత్రం రాష్ట్రపతి నుండి హోంశాఖకు లేఖ వెళ్ళటం సర్వ సాధారణంగా జరిగే పనే అని,తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పుకొచ్చారు. ఆ తెరిచిన పేజీలు మాత్రం బ్యాంకుల మోసాలు,డొల్ల కంపెనీలు,మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన ఆరోపణలతో నిండిపోయి ఉన్నవి.కేంద్ర ప్రభుత్వం మాత్రం మాటకు కట్టుబడకుండా కండువాలు కప్పేస్తూ ఉన్నారు. జిడిపి 10ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. రాష్ట్రపతి గారి జోక్యం ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.