iDreamPost
iDreamPost
ఎన్నో సినిమాల్లో చక్కని పాత్రలు వేసి హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా అద్భుతమైన చిత్రాలు తన కీర్తి శిఖరంలో చేర్చుకున్న నిన్నటి తరం నటి జయంతి గారు ఇవాళ ఉదయం బెంగళూరులో ఆవిడ తన స్వగృహంలో కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే ఈ విషాదం జరిగిపోయింది. తెలుగు తమిళ కన్నడ మలయాళంలో మర్చిపోలేని ఆణిముత్యాలు చేసిన జయంతి మరణం పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చిరంజీవి తరం హీరోల దాకా జయంతి గారికి టాలీవుడ్ లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చాలా ఉన్నాయి. ఈవిడ స్వరాష్ట్రం కర్ణాటక
జయంతి గారు 1945 జనవరి 6న జన్మించారు. బళ్లారి పుట్టిన ఊరు. సినీ రంగ ప్రవేశం 1973లో జెనుగూడు అనే కన్నడ సినిమా ద్వారా జరిగింది. అక్కడ మొదలైన ప్రస్థానం 500 చిత్రాలకు పైగానే కొనసాగింది. శాండల్ వుడ్ ఆవిడకు అభినయ శారదే అనే బిరుదుతో గతంలోనే గౌరవించింది. జయంతి ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయనను చూసేందుకే స్టూడియోలకు వెళ్లేవారట. ఓ సందర్భంలో చాలా సార్లు రావడం గమనించిన ఎన్టీఆర్ దగ్గరకు తీసుకుని మాట్లాడారు. కాలక్రమేణా ఆయనతో కల్సి జగదేకేవీరుని కథ, కొండవీటి సింహం, కుల గౌరవం, జస్టిస్ చౌదరి లాంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం దక్కింది.
ఎన్టీఆర్ అబ్బాయి బాలకృష్ణతోనూ ముద్దుల మేనల్లుడు, వంశానికొక్కడు, అల్లరి కృష్ణయ్య లాంటి చిత్రాల్లో జయంతి కీలక పాత్రలు పోషించారు. పెదరాయుడులో రజనీకాంత్ చెల్లిగా చేసిన క్యారెక్టర్ ఇక్కడ చాలా పేరు తీసుకొచ్చింది. సెంటిమెంట్ పాత్రలకు, కన్నీళ్లు తెప్పించే డైలగ్ డిక్షన్ లో జయంతికి సాటి వచ్చేవారు తక్కువ. మిమిక్రి ఆర్టిస్టులు సైతం ఈవిడ గొంతుని ప్రత్యేకంగా అనుకరించేవారు. కెరీర్ మధ్యలో పేకేటి శివరాంని వివాహం చేసుకున్న జయంతి గారి ఆ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. 76 ఏళ్ళ వయసులో ఎన్నో కీర్తి శిఖరాలను అందుకున్న జయంతి గారు మనమధ్య లేకపోవడం ఎన్నటికీ తీరని లోటే
Also Read: వర్షం వెనుక ఉన్న రెండు సినిమాలు – Nostalgia