iDreamPost
iDreamPost
రెండు రోజుల క్రితం నారప్ప, దృశ్యం 2లు ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజవుతాయన్న వార్త విన్నప్పటి నుంచి అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. అయిదారు కోట్లలో రూపొందిన చిన్న సినిమాలే ఆగస్ట్ లో షెడ్యూల్ చేసుకుని థియేటర్ల కోసం ఎదురు చూస్తుంటే నిర్మాత సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. నిజానికి ఈ న్యూస్ ఇంకా అఫీషియల్ కాలేదు. అలా అని సదరు సంస్థ నుంచి ఖండిస్తూ ప్రకటన కూడా రాలేదు. సో నిజమే అనుకోవచ్చు. వెంకటేష్ లాంటి అగ్ర హీరో సినిమాలు థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో ఇలా చేయడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు సైతం గుర్రుగా ఉన్నారు.
కొందరు వెంకటేష్ అభిమానులు ఏకంగా నిరాహారదీక్షలకు సిద్ధపడి వాటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నారప్ప ఇన్ థియేటర్స్ అనే ట్యాగ్ ని ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ టా లో వైరల్ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దృశ్యం 2 ఓటిటిలో వస్తున్నా పెద్దగా ఫీల్ కావడం లేదు కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత మాస్ కి రీచ్ అయ్యే సబ్జెక్టు చేస్తున్న తమ హీరోని చిన్నితెరపై చూడాలంటె వాళ్ళ మనసు ఒప్పుకోవడం లేదు. అలా అనుకోవడంలో న్యాయం ఉంది. అసురన్ చూసినవాళ్లకు నారప్పలో ఎంత మాస్ కంటెంట్ ఉందో ఐడియా ఉండే ఉంటుంది. అందుకే ఫ్యాన్స్ ఇంతగా ఇదైపోతున్నారు.
సురేష్ బాబు ఆలోచన మాత్రం పక్కా బిజినెస్ కోణంలో ఉంది. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా నారప్ప, దృశ్యం 2లు భారీ రెవిన్యూ తెచ్చి పెట్టే అవకాశాలు తక్కువే. జనంలో కరోనా భయం పూర్తిగా పోలేదు. ఇప్పుడు ఓటిటి డీల్ లో చెప్పిన డెబ్భై కోట్ల దాకా సొమ్ము షేర్ రూపంలో వస్తుందా అంటే పంపిణీదారులు సైతం ఖచ్చితంగా చెప్పలేరు. దానికి తోడు ఈ రెండు సినిమాల ఒరిజినల్ వెర్షన్లు చాలా మంది ప్రైమ్ లో చూసేశారు. నితిన్ మాస్ట్రో కూడా ఆలోచించింది ఈ కోణంలోనే. ఇంకా ఇవన్నీ ప్రకటనలు రాలేదు కానీ జూలై మొదటి లేదా రెండో వారం నుంచి అనౌన్స్ మెంట్ల హడావిడి మొదలవుతుంది