iDreamPost
iDreamPost
వంగవీటి మోహనరంగా..1980వ దశకంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేసిన కాపు ఉద్యమ నేత. విజయవాడ నగర రాజకీయాల్లో కీలక స్థాయికి ఎదిగి, అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరే స్థాయికి ఎదిగిన నేత. చివరకు ఆయన్ని అంతమొందించే లక్ష్యంతో నాటి ప్రభుత్వం చేసిన పన్నాగాలకు ఆయన బలయిన సంగతి బహిరంగ రహస్యమే. నాటి సీఎం ఎన్టీఆర్, హోం మంత్రి కోడెలతో పాటుగా చంద్రబాబు పాత్ర మీద పలు విమర్శలు వచ్చిన సంగతి విదితమే. ఇటీవల సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చంద్రబాబు పాత్ర మీద కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి రంగా హత్య కేసులో నిందితుడయిన వెలగపూడి రామకృష్ణబాబు ఆ ఘటన తర్వాత విజయవాడ వీడి వెళ్లిపోయారు. ఐదేళ్ల పాటు దాదాపు అజ్ఞాతవాసంలో కనిపించిన ఆయన 1994లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో తెరమీదకు వచ్చారు.
ఈసారి వెలగపూడి వ్యవహారాలకు విశాఖ కేంద్ర స్థానమయ్యింది. అప్పుడే మద్య నిషేధం విధించడం ఆయనకు వరంగా మారింది. ఒడిశా నుంచి అక్రమంగా మద్యం దిగుమతులు చేసి భారీ దందాను ఆయన నిర్వహించినట్టు ప్రచారం ఉంది. దానికి ఆనాటి ప్రభుత్వ పెద్దలు తోడ్పాటునివ్వడంతో వెలగపూడి కి అడ్డూ అదుపులేకుండా పోయింది. అప్పటి వరకూ విశాఖలో ద్రోణంరాజు వంటి నేతలు కాంగ్రెస్ లోనూ, ఎంవీఎస్ మూర్తి వంటి వారు టీడీపీలోనూ చక్రం తిప్పుతుండగా వెలగపూడి వంటి అప్పటికే హత్య కేసు, రౌడీ షీట్ ఉన్న వ్యక్తులు చొరబడడంతో కథ మలుపు తిరిగింది. ప్రశాంత నగరం విశాఖలో సముద్ర తీరాన్ని ఆవాసంగా మార్చుకుని సాగించిన దందాలతో ఆయన హవా పెరగడం మొదలయ్యింది. ఆ తర్వాత విశాఖ టీడీపీకి ఆర్థికంగా చేయూతనందించే స్థాయికి ఎదగడంతో ప్రాధాన్యత పెరిగింది. అప్పటికే తనకున్న సామాజిక, ఇతర బంధాల కారణంతో చంద్రబాబుకి చేరువయిన వెలగపూడి లిక్కర్ సిండికేట్ స్థాయి నుంచి ఇతర దందాల్లో కాలు పెట్టే స్థాయికి ఎదిగారు.
అప్పటికే విశాఖలో వెలగపూడికి పట్టున్న ప్రాంతాలతో నియోజకవర్గ పునర్విభజన కారణంగా ఏర్పడిన తూర్పు నియోజకవర్గం అతడికి వరంగా మారింది. అంతే 2009 ఎన్నికలలో బరిలో దిగిన వెలగపూడికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కలిసి వచ్చిన కారణంగా గట్టెక్కేశారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ లో కొందరు నేతలను మచ్చిక చేసుకుని అటు కార్పోరేషన్ లో, ఇటు నియోజకవర్గంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. భూదందాలకు కూడా శ్రీకారం చుట్టడం ప్రారంభమయ్యింది. ప్రధానంగా కైలాసగిరి ని ఆనుకుని పలు చోట్ల అక్రమాలకు తెరలేపినట్టు ప్రచారం ఉంది. రియల్ ఎస్టేట్ దందాల్లో పెద్ద పాత్ర పోషించే స్థాయికి ఎదిగినట్టు చెబుతుంటారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుభవం లేకపోవడం, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన నాయకురాలు భీమిలి నుంచి అప్పుడే తూర్పు నియోజకవర్గానికి రావడంతో వెలగపూడికి కలిసి వచ్చింది. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ధీమాతో 2014 తర్వాత 5 ఏళ్ళ పాటు అధికారాన్ని ఆసరగా చేసుకుని భూఆక్రమణలకు అటు రిషికొండ, ఇటు తగరపువలస వరకూ ఎన్ హెచ్ ని ఆనుకుని విస్తరించినట్టు విమర్శలున్నాయి.
ఇన్నాళ్లలో హత్యా రాజకీయాల నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యే క్రమంలో వెలగపూడి అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. అందులో పలు నేరాలున్నాయి. తాజాగా భూఆక్రమణల పర్వం నుంచి ప్రభుత్వ భూములను విముక్తి చేసే క్రమానికి జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. దాంతో వెలగపూడి అసలు రంగు బయటపడుతోంది. తన గుట్టురట్టవుతోందనే కలవరంతో ఆయన ప్రభుత్వ పెద్దల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో విశాఖ తూర్పు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న విజయనిర్మల ఆయన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.