iDreamPost
android-app
ios-app

కూరగాయల వ్యాపారి కుమార్తె.. ఇప్పుడు సివిల్ జ‌డ్జి

  • Published May 06, 2022 | 2:59 PM Updated Updated May 06, 2022 | 7:28 PM
కూరగాయల వ్యాపారి కుమార్తె.. ఇప్పుడు సివిల్ జ‌డ్జి

కొంతమంది చిన్నప్పుడు కలలు కని ఎన్ని కష్టాలు వచ్చినా, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కష్టపడి తాము అనుకున్నది జీవితంలో సాధిస్తారు. ఈ అమ్మాయి కూడా అంతే. మధ్యప్రదేశ్‌లోని ఒక కూరగాయల వ్యాపారి కుమార్తె లాయర్ కావాలనుకొని కష్టపడి తన కలను సాకారం చేసుకుంది. ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల అంకిత నగర్ తన నాల్గో ప్రయత్నంలో రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సివిల్ జడ్జి అయ్యింది.

ఈ సందర్భంగా అంకిత మీడియాతో మాట్లాడుతూ.. నేను చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. నా కుటుంబ పరిస్థితులని అర్ధం చేసుకొని నేను న్యాయమూర్తి అవ్వాలనుకున్నాను. నా గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధం అయ్యాను. చాలా వరకు నేను ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పైనే చదివాను. మొదటి మూడు సార్లు సివిల్ జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ చెందకుండా కష్టపడి చదివాను. నాల్గో ప్రయత్నంలో నేను సివిల్ జడ్జి క్లాస్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. నా సంతోషాన్ని చెప్పడానికి మాటలు రావట్లేదు అని తెలిపింది.

అంకిత తండ్రి అశోక్ ఇండోర్ లో ముసాఖెడి ప్రాంతంలో కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తాడు. తన కుమార్తె సాధించిన ఈ విజయంపై అశోక్ స్పందిస్తూ.. గత ఆరేళ్లుగా నేను, నా భార్య తన చదువు కోసం చాలా రాజీ పడ్డాం. అంకిత చాలా కష్టపడి చదివి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమెను చూసి మేము గర్వపడుతున్నాము. మీ కూతుళ్ళకి తొందరపడి పెళ్లిళ్లు చేయకండి, వాళ్ళని చదువుకోనివ్వండి అని తెలిపాడు. ఇక అంకిత సివిల్ జడ్జిగా తన పనిని మొదలు పెట్టాక తన దగ్గరికి వచ్చే ఎవరికైనా న్యాయం జరిగేలా చూస్తానని తెలిపింది.