iDreamPost
iDreamPost
సంక్రాంతికి పోటీ పడుతున్న ఇద్దరు సీనియర్ హీరోలలో ముందుగా వచ్చింది బాలకృష్ణ వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చాక కంటెంట్ పరంగా మాస్ ఆడియన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు, బాలయ్య గెటప్ ప్రోమోలో డైలాగులు ఆసక్తిని పెంచాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అఖండకు అదిరిపోయే స్కోర్ ఇచ్చిన తమన్ మరోసారి బాలయ్యతో చేతులు కలిపాడు. మరి ఇంతేసి హైప్ తో వచ్చిన ఈ వీరసింహారెడ్డి ఎలా ఉన్నాడు మెప్పించాడా లేదా రివ్యూలో చూసేద్దాం పదండి
కథ
పులిచర్లలో ఉండే వీరసింహారెడ్డి(బాలకృష్ణ)కు చెల్లెలు భానుమతి(వరలక్ష్మి శరత్ కుమార్) అంటే ప్రాణం. ప్రేమించిన వాడి(నవీన్ చంద్ర) విషయంలో అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరూ విడిపోతారు. దగ్గరైన మరదలు మీనాక్షి(హనీ రోస్)ని పెళ్లి చేసుకోలేక దూరం చేసుకుంటాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమె ఇస్తాన్బుల్ వెళ్ళిపోతుంది. అక్కడే కొడుకు జైసింహారెడ్డి(బాలకృష్ణ)ని తండ్రెవరో చెప్పకుండా పెంచుతుంది. ఇష్టపడిన అమ్మాయి(శృతి హాసన్)తో పెళ్లి జరిపించుకునే క్రమంలో వీరసింహారెడ్డి వీళ్ళ దగ్గరికి వస్తాడు. పగతో రగిలిపోతున్న భానుమతి ఆమె మొగుడు ప్రతాపరెడ్డి(దునియా విజయ్)అక్కడికీ వస్తారు. ఆ తర్వాత జరిగేది తెరమీద చూడాలి
నటీనటులు
వీరసింహారెడ్డిలో బాలకృష్ణది పూర్తిగా వన్ మ్యాన్ షో. పెద్దాయన గెటప్ లో పర్ఫెక్ట్ ఫ్యాక్షన్ లీడర్ అనిపించాడు. ఆహార్యం, సంభాషణలు చెప్పిన విధానం అన్నీ చాలా బాగా కుదిరాయి. ఇలాంటి పాత్రలు గతంలో ఎన్నో చేసినప్పటికీ గెటప్ కొంచెం స్పెషల్ గా డిజైన్ చేయడంతో సింక్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఫ్యాన్స్ ని మెప్పించారు. డాన్సులు మరీ గొప్పగా లేవు కానీ ఈ వయసులో ఇంతకన్నా ఆశించడం కష్టం. జైసింహారెడ్డిగా రెండో క్యారెక్టర్ లో మాత్రం బాలయ్య తేలిపోయాడు. చప్పగా సాగడంతో పాటు శృతి హాసన్ తో పెట్టిన అరగంట లవ్ స్టోరీ ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడం మైనస్ అయ్యింది. విగ్గు వగైరా అంతగా నప్పలేదు
శృతి హాసన్ మొక్కుబడిగా ఉంది. ఎప్పుడో బలుపులో చలాకీతనంతో నవ్వించిన ఈ గ్లామర్ డాల్ ఇందులో తేడా కొట్టింది. డ్యూయెట్ల కోసం తప్ప ఇచ్చిన రెమ్యునరేషన్ ఇంకెందుకు ఉపయోగపడలేదు. అవసరానికి మించి చిక్కిపోయిన వరలక్ష్మి శరత్ కుమార్ సెకండ్ హాఫ్ లో చెలరేగిపోయింది. ఎమోషన్ యాక్షన్ రెండూ పండించింది. దునియా విజయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ కి దక్కాల్సిన డెబ్యూ కాదిది. ఊరికే అరవడం తప్ప ఎలాంటి షేడ్స్ చూపించలేకపోయాడు. మలయాళ నటుడు లాల్ ని నిండైన విగ్రహం కోసం తీసుకున్నారు. సచిన్ కెడ్కర్, రాజీవ్ కనకాల, ఈశ్వరి, నవీన్ చంద్ర తదితరులు చిన్నా చితక పాత్రలకు సరిపోయారు
డైరెక్టర్ అండ్ టీమ్
మాస్ ఆడియన్స్ ని ఎప్పుడూ చులకనగా చూడకూడదనేది టాలీవుడ్ బాక్సాఫీస్ ఎన్నోసార్లు నేర్పించింది. ఎవరి దాకో ఎందుకు ఇదే బాలకృష్ణకు విజయేంద్రవర్మతో మొదలుపెట్టి మొన్నటి రూలర్ దాకా వచ్చిన డిజాస్టర్స్ అన్నింటి ఫెయిల్యూర్ కి కారణం ఇదే. దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఫ్యాన్ బాయ్ గా వీరసింహారెడ్డి తీశానని గర్వంగా చెప్పుకున్నాడు కానీ కథ విషయంలో తగినంత హోం వర్క్ చేయలేదని సినిమా మొదలైన అరగంటలోపే అర్థమైపోతుంది. చిన్న బాలయ్య ఇంట్రో, ఆపై శృతి హాసన్ తో పరిచయం ప్రేమ కథ ఓ పాట ఇవన్నీ చాలా ఫోర్స్డ్ గా ఉన్నాయి. కనీసం నవ్వించేలా ఉన్నా ఏదో టైం పాస్ అయ్యిందని క్షమించవచ్చు
అసలు వీరసింహారెడ్డి ఎంట్రీ తర్వాతే స్క్రీన్ ప్లేలో కదలిక వస్తుంది. ఇక్కడ కూడా విడిగా చూస్తేనే ఫ్యాన్స్ కోణంలో సన్నివేశాలు బాగానే ఉన్నాయనిపిస్తుంది. కానీ కథ ప్రకారం చెప్పుకుంటే ఏమీ ఉండదు. వట్టి అతుకుల బొంత. హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇవ్వడం అచ్చం లెజెండ్ ని రిపీట్ చేసినట్టు ఉంటుంది. మండపంలో గూండాల భరతం పట్టడం ఎన్ని సినిమాల్లో చూశామో గుర్తు చేసుకోవడం కష్టం. హీరోకిచ్చిన బిల్డప్ సీన్లు, ఎలివేషన్లు వగైరా మొత్తం రొటీన్ స్టఫ్. అభిమానులను సంతోషపెట్టే తాపత్రయం తప్ప నిజంగా కామన్ ఆడియన్స్ ని మెప్పించేలా కథాకథనాలు ఉన్నాయో లేదో మలినేని చెక్ చేసినట్టు అనిపించదు. ఎలాంటి ప్రత్యేకత లేకపోవడమే లోపం
గోపీచంద్ మలినేని తన అభిమాన హీరోని ఎలా తెరమీద చూపించాలనేది ఊహించుకున్నాడు కానీ ఎలా చూపిస్తే బాగుండదో అంచనా వేసుకోలేదు. మాములుగా టాలీవుడ్ లో సిస్టర్ సెంటిమెంట్ సరిగ్గా పండిస్తే కాసుల వర్షం కురిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ రక్త సంబంధం నుంచి కలర్ గోరింటాకు దాకా వందల సంఖ్యలో ఉదాహరణలు ఉన్నాయి. ఆ భావోద్వేగం తాలూకు బలం ఇది. అలాంటిది ఈ ట్రాక్ కి నెగటివ్ టచ్ ఇచ్చి ఏదో వెరైటీగా ట్రై చేద్దామనుకున్న డైరెక్టర్ తాను ఏకంగా పాతికేళ్ళు వెనక్కు వెళ్లి ఆలోచిస్తున్నానని గుర్తించలేకపోయాడు. అందుకే మచ్చుకు కూడా కొత్తదనం లేకుండా రెండో సగం మొత్తం డ్రైగా సాగుతుంది
అసలు భానుమతి తన అన్నయ్య మీద అంత ద్వేషం పగ పెంచుకోవడానికి కారణమే కన్విన్సింగ్ గా ఉండదు. ప్రాణమివ్వడానికి సిద్ధపడిన రక్త సంబంధాన్ని అంత దారుణంగా మార్చుకోవడానికి సరైన ఎస్టాబ్లిష్ మెంట్ జరగలేదు. పైగా అన్నా చెల్లెలు ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో చనిపోయినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పాటలు పెట్టి ఎమోషనల్ గా కనెక్ట్ అవుదామన్న ప్రయత్నం రివర్స్ కొట్టింది. ఫ్లాష్ బ్యాక్ విపరీతమైన ల్యాగ్ తో సహనానికి పరీక్ష పెడుతుంది. కొన్ని సన్నివేశాలను మరీ టీవీ సీరియల్స్ ని తలపించేశాయి. రవితేజ క్రాక్ ని అంత పకడ్బందీగా తీసిన గోపీచంద్ మలినేనా ఈ స్క్రిప్ట్ రాసుకుందని అనుమానం వస్తే తప్పు మీది కాదు
ఇంటర్వెల్ బ్లాక్ కే వీరసింహారెడ్డిని చంపేయడంతో సెకండ్ హాఫ్ గంటన్నర ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తప్ప వేరే మార్గం లేకపోయింది. హత్య చేసిందెవరో అంత స్పష్టంగా చూపించేసినప్పుడు ఇంక థ్రిల్ ఏముంటుంది. సగటు ఆడియన్స్ ఈజీగా గుర్తుపట్టేలా ఆ తర్వాత వచ్చే ట్విస్టులు వెక్కిరిస్తాయి. ఎంత బాలయ్య అయినా అవసరానికి మించిన సాగతీత ఉంటే బోర్ కొట్టేస్తుంది.ఎపిక్ అని మన సినిమా గురించి మనమే ముందే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోదు. జనం చూసి ఆ అర్హతను నిర్ణయించాలి. వీరసింహారెడ్డిలో ఆ లక్షణాలు ఎక్కడా ఉండవు. వయొలెన్స్ లో బోయపాటి శీనుని అనుకరించబోయే గోపిచంద్ మలినేని అధిక శాతం బొక్క బోర్లా పడ్డాడు
చెప్పుకోవాల్సిన మరో ప్రధానమైన అంశం హింస మోతాదు మితిమీరడం. నరుక్కోవడం, పరిగెత్తడం, తలలు గాల్లో యెగిరి పడటం ఇదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ప్రతాప రెడ్డి ముప్పై ఏళ్లుగా వీరసింహారెడ్డిని చంపడానికి పదే పదే ట్రై చేయడం అది చేతకాక ఆకాశం చిల్లులు పడేలా గావుకేకలు పెట్టడం ఇదే తంతు సరిపోయింది. క్యారెక్టరైజేషన్ బలంగా లేనప్పుడు రాతలోని బలహీనతలన్నీ తెరమీద కనిపిస్తాయి. దునియా విజయ్ లాంటి మంచి నటుడు ఇందుకే నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. చాలా చిన్న పాత్రలకు సైతం ఖరీదైన క్యాస్టింగ్ పెట్టుకోవడం వల్ల అవసరం లేని ఖర్చు పెరిగిందే తప్ప వాళ్లకు స్థాయికి తగినంత నిడివి పడలేదు.
మొత్తంగా చెప్పాలంటే వీరసింహారెడ్డి 2023లో వచ్చినా 2003 ట్రీట్ మెంట్ తోనే కేవలం ఫ్యాన్స్ కోసమే అనిపించేలా పలకరించాడు. వాళ్ళు మాత్రమే సంతృప్తి పడితే చాలదు. సగటు ప్రేక్షకులకు సైతం నచ్చినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి. అఖండ సక్సెస్ కు కారణం అదేగా. గోపీచంద్ మలినేని తనకు దక్కిన అతి పెద్ద అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోలేకపోయాడు. సంక్రాంతి సీజన్ కాబట్టి బిసి సెంటర్స్ లో ఓ మోస్తరుగా రాబట్టుకోవచ్చేమో కానీ ఫ్యామిలీస్ నచ్చే అంశాలు ఇందులో దాదాపు సున్నానే. వాల్తేరు వీరయ్యతో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో బాలయ్య ఇచ్చిన రొటీన్ కంటెంట్ ఏ మేరకు మెప్పిస్తుందో అనుమానమే
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ లో బాగుంది. మిగిలిన చోట్ల సాధారణంగా సాగింది. పాటలు కూడా ఛార్ట్ బస్టర్స్ కాలేదు. విజువల్ గా రిచ్ నెస్ వల్ల కొంత కంటికి ఆనాయి. రిషి పంజాబీ ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో సాగింది. బాలయ్య ఫ్రేమ్స్ ని బాగా సెట్ చేసుకున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ నిడివి మీద దృష్టి పెట్టి ఉంటే ల్యాగ్ తగ్గేది. రామ్ లక్ష్మణ్ ఫైట్లు పర్వాలేదు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు ఎం రత్నం స్టయిల్ లో సాగాయి. మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ బాగా ఖర్చు పెట్టారు. క్వాలిటీ స్క్రీన్ మీద కనిపించింది. సెట్లు అవుట్ డోర్లు విదేశాలు ఎక్కడ తగ్గకుండా తమ బ్యానర్ రేంజ్ కి తగ్గట్టు సబ్జెక్టు డిమాండ్ చేసినంత ఇచ్చారు.
ప్లస్ గా అనిపించేవి
వీరసింహారెడ్డి పాత్ర
రెండు ఫైట్లు
కెమెరా పనితనం
మైనస్ గా తోచేవి
రొటీన్ కథా కథనాలు
సెకండ్ హాఫ్ సెంటిమెంట్
సింక్ అవ్వని సిస్టర్ ఎపిసోడ్
మితిమీరిన హింస
కంక్లూజన్
సింపుల్ గా చెప్పాలంటే వీరసింహారెడ్డి పాత సీసాలో పాత సారా. కొత్తగా ఏదైనా చెప్పేందుకు ఏ ప్రయత్నమూ జరగలేదు. కేవలం ఫ్యాన్స్ ని టార్గెట్ చేసుకుని వాళ్ళను ఊపేస్తే చాలు కాసుల వర్షం కురుస్తుందనే అంచనాతో రాసుకున్న కథ. మాస్ ఎంటర్ టైనర్స్ లో ఎక్కువ క్రియేటివిటీ ఉండదు నిజమే. అరవింద సమేత వీర రాఘవలో త్రివిక్రమ్ తీసుకుంది కూడా ఆల్రెడీ వాడేసిన పాయింటే. కానీ అది ఎందుకు ఆడింది. ఆసక్తిరేపే టేకింగ్ తో పాటు అవసరమైన మలుపులను సరిగ్గా సెట్ చేసుకోవడం. గోపిచంద్ మలినేని ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయి వీర లెవెల్ లో ఊహించుకున్న వీరసింహారెడ్డిని ఓ మాములు స్థాయిలో అందించాడు.
ఒక్క మాటలో – అదే కథ అదే వ్యథ
రేటింగ్ – 2/5