Idream media
Idream media
కేరళ చరిత్రలో రెండో సారి అధికారంలోకి వచ్చిన సీఎం విజయన్ ఆది నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కొలువుదీరిన కొత్త కేబినెట్ లో అందరూ కొత్త వాళ్లే. 21 మంది గల టీంలో విజయన్ మినహా అందరూ కొత్తవాళ్లే. బాగా పని చేసిన సీనియర్లను ఎందుకు పక్కన బెట్టారన్న ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలన్న నిర్ణయాన్ని అత్యధిక మంది స్వాగతిస్తున్నారు. అయితే, కరోనా కాలంలో విశేష సేవలందించి గుర్తింపు పొందిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజకి ఈసారి కేబినెట్ లో చోటు దక్కకపోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆమె స్థానంలో ఈసారి ఆరోగ్య శాఖ మంత్రిగా మరో మహిళ వీణ జార్జిని నియమించారు. కేరళలో ఈమె మొదటి మహిళా జర్నలిస్టు. గతంలో ఆదర్శ ఎమ్మెల్యేగా కూడా అవార్డు అందుకున్నారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికార పీఠం నిలబెట్టుకుంది. సీఎం పినరయి విజయన్ ఈ నెల 20న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే ఈసారి కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజకి క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. మరోమారు కరోనా వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి పదవి శైలజనే వరిస్తుందని అంతా భావించారు. అయితే ఆమెకు ఈ దఫా అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో పతనంతిట్ట జిల్లా ఆరన్‌మూల నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందిన వీణ జా ర్జి చోటు దక్కించుకున్నారు. కేకే శైలజ టీచర్ నుంచి ఎదిగి మంత్రి కాగా.. వీణ గతంలో జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. గత 2016 ఎన్నికల్లోనూ ఆమె ఆరన్‌మూల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. శైలజకి విప్ పదవి అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, ఎల్‌డీఎఫ్ కేబినెట్ లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, ఎన్‌సీపీ తరఫున ఒక్కొక్కరికి పదవులు దక్కాయి. శాసనసభ స్పీకర్ గా ఎంబీ రాజేశ్ వ్యవహరించనున్నారు. సీపీఐ ఎమ్మెల్యే చిట్టయం గోపకుమార్ కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుంది.