Veedevadandi Babu : నవ్వులు పూసినా కాసులు కురిపించలేదు – Nostalgia

కొన్ని రీమేకుల ముచ్చట్లు విచిత్రంగా ఆసక్తికరంగా ఉంటాయి. పక్క భాషలో ఆడేసింది కదాని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే మన ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. అలాంటి ఒక ముచ్చట చూద్దాం. 1996లో కార్తీక్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ‘ఉల్లతయ్ అల్లితా’ వచ్చింది. శిర్పి సంగీతం అందించగా రంభ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది కూడా ఒరిజినల్ కథ కాదు. 1968లో రిలీజైన ‘బొమ్మలాట్టం’ నుంచి మెయిన్ లైన్ తీసుకుని అంతకు ముందు 1958లో విడుదలైన ‘శభాష్ మీనా’లోని కామెడీ తీసుకుని వండేశారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. కోలీవుడ్ లో వంద రోజులు ఆడేసింది. ముఖ్యంగా పాటలు ఆ ఏడాది చార్ట్ బస్టర్స్ అయ్యాయి

1995 ‘పెదరాయుడు’ బ్లాక్ బస్టర్ తర్వాత మోహన్ బాబు మీద అంచనాలు, ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అందుకే వాటిని అందుకోలేక చేసిన ప్రయోగాలు కొన్ని వికటించాయి. అదిరింది అల్లుడు, సోగ్గాడి పెళ్ళాం ఆశించిన స్థాయికి వెళ్లకపోగా అడవిలో అన్న, కలెక్టర్ గారు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. అన్నమయ్యలో చేసిన పాత్ర వల్ల నాగార్జునకు పేరు వచ్చింది కానీ ఈయనకు ఒరిగిందేమి లేదు. పైగా సాళ్వ నరసింహరాయులు క్యారెక్టర్ ని కామెడీ చేశారనే కామెంట్స్ కూడా వచ్చి పడ్డాయి. ఇది నిర్మాణంలో ఉండగానే ఉల్లతయ్ అల్లితా గురించి విన్న మోహన్ బాబు తనలో హాస్యపు కోణాన్ని వాడుకునే స్క్రిప్ట్ గా ఇదే కరెక్ట్ అనుకున్నారు.

దాంతో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వీడెవడండీ బాబు టైటిల్ తో అన్నా రావు ప్రొడ్యూసర్ గా ఇది నిర్మాణం జరుపుకుంది. బాలీవుడ్ ఫేమ్ శిల్పా శెట్టిని హీరోయిన్ గా తీసుకోగా హీరోతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకునే పాత్రకు బ్రహ్మానందం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడంటే కన్ఫ్యూజన్ కామెడీకి ‘రెడీ’నే బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం కానీ సుందర్ అప్పట్లోనే ఈ ఫార్ములాని చూపించారు. ఒరిజినల్ వెర్షన్ కు పనిచేసిన శిర్పినే ట్యూన్స్ మార్చకుండా దీనికీ తీసుకున్నారు. ట్యూన్స్ ఆడియో పరంగా మంచి సక్సెస్ అయ్యాయి. 1997 ఏప్రిల్ 18 వీడెవడండీ బాబు రిలీజయ్యింది కానీ తమిళమంత మేజిక్ చేయలేకపోయింది. యావరేజ్ దగ్గర ఆగిపోయింది. అదే రోజు విడుదలైన రాజేంద్ర ప్రసాద్ జై భజరంగిభళి మంచి విజయం సాధించడం గమనార్హం

Also Read : Narasimhudu : నిర్మాతను నిలువునా ముంచేసిన గుడ్డి నిర్ణయం – Nostalgia

Show comments