iDreamPost
iDreamPost
ఒక జానర్ కో లేదా ఒక ఫార్ములాకో కట్టుబడి సినిమాలు తీయడంలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. అది అందరూ చేసేదే. అలా కాకుండా నమ్మిన సిద్ధాంతాలు, సమాజానికి ఏదో సందేశం ఇవ్వాలన్న తాపత్రయం ఉన్న దర్శకులు అరుదుగా ఉంటారు. అందులో ఒకరు క్రిష్. మొదటి సినిమా గమ్యంతో విమర్శకులను ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించిన క్రిష్ కు రెండో చిత్రమే అల్లు అర్జున్ లాంటి స్టార్ తో చేయాల్సి వస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారు. కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్తే ఈజీగా కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. కానీ క్రిష్ అలా ఆలోచించలేదు. ఒక స్టార్ తనను నమ్మినప్పుడు అతని ద్వారా ఇంకా బలంగా భావజాలాన్ని తీసుకెళ్లాలి. అదే వేదం.
అల్లు అర్జున్ – మంచు మనోజ్ – అనుష్క శెట్టి. ఈ కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడు అభిమానులు ఏమేం ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పదేముంది. కానీ క్రిష్ వాళ్ళ కోణాన్ని పరిగణించలేదు. అందుకే స్వీటీని వేశ్యగా చూపించబోతున్నానని చెప్పినప్పుడు అందరూ షాక్. కేబుల్ కనెక్షన్లు ఇచ్చుకునే రాజు పాత్రలో బన్నీ ఎలా ఉంటాడో ఊహకు అందలేదు. హిందీలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ ని ఒక ముస్లిం క్యారెక్టర్ ని తీసుకున్నప్పుడు ఎన్నో అనుమానాలు. వీటన్నింటికి మించి ఇద్దరు హీరోలకు క్లైమాక్స్ లో ట్రాజెడీ ఫినిషింగ్ ఇవ్వడం ఎవరూ ఊహించనిది. ఇంకా చెప్పాలంటే ఎవరూ కనీసం కలలో కూడా అనుకోలేనిది
కానీ క్రిష్ అద్భుతం చేసి చూపించారు. మన చుట్టూ ఉన్న సమాజంలోని వివిధ పార్శాలను హత్తుకునే రీతిలో చూపించారు. నాగయ్య, శరణ్య లాంటి పాత్రల ద్వారా అట్టడుగు వర్గాల్లో జరుగుతున్న అణిచివేతను కళ్ళు చెమర్చేలా తెరకెక్కించారు. మతోన్మాదం చేసే అరాచకాలకు దృశ్య రూపం ఇచ్చారు. హృద్యమైన ఎంఎం కీరవాణి సంగీతం, ఆలోచింపజేసే సంభాషణలు ఇలా అన్ని అంశాలు ప్రశంసలే కాదు అవార్డులు కూడా తీసుకొచ్చాయి. 2010 జూన్ 4 న విడుదలైన వేదం కమర్షియల్ అద్భుతాలు చేయకపోయినా ప్రతిఒక్కరి కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. తమిళంలో శింబు-భరత్-అనుష్క లతో వానం పేరుతో క్రిష్ రీమేక్ చేశారు
Also Read : Alluda Majaka : తిట్టించుకున్నా కలెక్షన్లు దక్కించుకున్న మెగా మూవీ – Nostalgia