Idream media
Idream media
ఇళ్లు, వ్యాపార భవనాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ వాస్తుకు పలువురు నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్.. ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సమయంలో తమ ఛాంబర్లలో వాస్తు మార్పులు చేయించిన వారే. అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ కార్యాలయాలకు వాస్తు మార్పులు చేయించడం ఇప్పటి వరకూ చూసినదే. తాజాగా.. పార్టీ పదవులు చేపట్టిన సమయంలోనూ పార్టీ కార్యాలయాల్లో వాస్తు మార్పులు చేయించే సంస్కృతి తెలంగాణలో మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడుగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువచ్చే లక్ష్యంతో ఉన్నారు. 2023లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన రేవంత్.. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ అంతటా పాదయాత్ర చేసేందుకు కూడా రేవంత్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. పీసీసీ బాధ్యతలను చేపట్టే కార్యక్రమం భారీ ఎత్తున చేయాలని రేవంత్ వర్గం భావిస్తోంది. అంతకు ముందుగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు. గాంధీ భవన్ తూర్పులో మరో ద్వారం ఏర్పాటు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఛాంబర్ తూర్పు వైపునకు ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టబోతున్నారు. అంతేకాదు.. పార్టీ జెండాలు, ఇతర ప్రచార సామాగ్రి విక్రయించే గది, సెక్యూరిటీ రూమ్‌ను తొలగించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టేందుకు ముందే ఈ వాస్తు మార్పులు చేయబోతున్నారు.
Also Read : తొలి పరీక్షలో నెగ్గితే రేవంత్ రెడ్డికి తిరుగులేనట్లే..!
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది. ఏపీలో ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోగా.. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఆ స్థానానికి బీజేపీ ఎసరు పెట్టింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్నా.. 2014లో ఓటమే ఎదురైంది. గెలిచిన ఎమ్మెల్యేలలో మెజారిటీ శాతం టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. 2018లో ఎన్నికల్లోనూ మునుపటి కన్నా పరిస్థితి మరింత దిగజారింది. ఈ సారి కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండడం కీలక పరిణామం. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు అధికారానికి దూరమైతే.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 2023లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. ప్రారంభంలో ఒకరిద్దరు సీనియర్ నేతలు రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించినా.. ఆ తర్వాత దారిలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి దూకుడు, వాస్తు మార్పులు.. కాంగ్రెస్ పార్టీ తలరాతను మార్చుతాయా..? లేదా..? తెలియాలంటే 2023 వరకూ ఆగాలి.
Also Read : రేవంత్ లెక్క కరెక్టేనా..?