Idream media
Idream media
ఇటీవల నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా ఓ ప్రకటన చేశారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడుతానని చెప్పారు. ఆ వెంటనే నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు అధికారంపై మమకారం లేదని అన్నారు. గంటల వ్యవధిలోనే బాబు మాటల్లో తేడా కనిపించింది. ఇప్పుడు చర్చ జరుగుతోందంటే.. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుదామని బాబు అనుకున్నా, అయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపించడం లేదు. అలాగే.. అధికారంపై మమకారం లేనప్పుడు ఇన్ని రాజకీయాలు అవసరమా.. అనేది ఆ చర్చల సారాంశం. ఈ పర్యవసనాల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నందమూరి తారక రామారావు అదే జూనియర్ ఎన్టీఆర్ పేరు విపరీతంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిఫుల్ ఆర్ ద్వారా ప్రజల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే.. అద్భుతమైన హోస్ట్ గా తనను తాను మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా రుజువు చేసుకుంటున్నారు. ఆ ప్రోగ్రాం ద్వారా తన భావాలను, ఆలోచనలను కూడా పంచుకుంటున్నారు. ఎన్టీఆర్ కి సినిమా ఒక పాషన్. ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం ఎంత కలసివచ్చినా ఈ రోజున ఈ స్థాయికి రావడానికి మాత్రం తాను పడిన కష్టమే నూటికి నూరు శాతం ఉందని అంతా చెబుతారు. అలాంటి ఎన్టీఆర్ ఇపుడు పూర్తిగా సినిమాలకే అంకితం అయ్యారు. వివాదాలకు దూరంగా వినోద ప్రపంచానికి దగ్గరగా ఉంటున్న జూనియర్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో మళ్లీ గట్టిగా నానుతున్నారు.
నిజానికి జూనియర్ కి ప్రస్తుతానికైతే రాజకీయాల మీద ఆసక్తి లేదు ఆయన మొత్తం దృష్టి అంతా సినిమాల మీదనే ఉంది. ఇంకా వయసు చాలా ఉంది. చేయాల్సిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో మెట్టూ ఎక్కి ఇంతదాకా వచ్చిన జూనియర్ తాతలా చిరస్థాయి కీర్తిని ఆర్జించాలని ఉబలాటపడుతున్నారు. ఇక రాజకీయాలు అనేవి ఇపుడు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అలాగని జూనియర్ రాడు అని చెప్పేయడం కాదు కానీ ఇప్పటికైతే ఆయన ఆ వైపు అసలు చూడరనే భావన ఉంది. ఇక జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అయితే గట్టిగా కోరుకుంటోంది. దానివల్ల జూనియర్ కి ఏం లాభం ఆయన తన ఇమేజ్ ని ఫణంగా పెట్టి ఒక పార్టీకి మద్దతుగా నిలిచి కొందరి వాడిగా మిగిలితే కలిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే జూనియర్ ఆ వైపు తొంగి చూడడంలేదు.
ఈ మధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని ఘటనలు చంద్రబాబు కుటుంబం మీద వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వంటి వారు అయితే ఈ విషయంలో జూనియర్ ని లాగేశారు. జూనియర్ సొంత మేనత్తను వైసీపీ నేతలు దారుణంగా అంటే తాపీగా సుభాషితాలు వల్లించడమేంటి అని మండిపడ్డారు. బాబు మేనల్లుడిగా జూనియర్ స్పందన బాగులేదని కూడా ఘాటు కామెంట్స్ చేశారు. జూనియర్ కి సన్నిహితులుగా వైసీపీ మంత్రి కొడాలి నాని , ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పేర్కొంటూ వారిని మందలించి ఉండాల్సింది అని కూడా వర్ల రామయ్య అన్నారు. అంటే బాబుని వైసీపీ నేతలు అనడం తప్పు అయితే అంతకంటే పెద్ద తప్పు జూనియర్ చేశాడన్నట్లుగా వర్ల కామెంట్స్ ఉన్నాయి. దీని మీద కొడాలి నాని గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తామూ జూనియర్ సన్నిహితులు అని ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించారు. ఒకపుడు జూనియర్ తో సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే కానీ ఇపుడు మాత్రం విడిపోయామని చెప్పి సంచలనం రేకెత్తించారు.
Also Read : Jr Ntr – టీడీపీలో ముదురుతున్న అంతర్గత వైరం, బాబు తర్వాత ఎవరనే చర్చ ఉధృతం
అసలు జూనియర్ తమను కంట్రోల్ చేయడమేంటి తాము వినడమేంటి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ని అటు టీడీపీ ఇటు వైసీపీ లాగేస్తున్నాయి. మరి చంద్రబాబు ఏడుపు మీద స్పందించి ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మాటల ద్వారా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. మరి వీటన్నిటి మీద జూనియర్ స్పందిస్తారా, లేదా చూడాలి.