iDreamPost
android-app
ios-app

అధికారం కోసం జగన్‌ ఎవరినైనా ‎మోసం చేస్తారట!

  • Published Feb 17, 2022 | 2:13 PM Updated Updated Feb 17, 2022 | 2:13 PM
అధికారం కోసం జగన్‌ ఎవరినైనా ‎మోసం చేస్తారట!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మునిశాపం ఉందని, నిజం చెబితే  ఆయన తల వేయి వక్కలవుతుందని, అందుకే రెప్ప వేయకుండా అబద్ధాలాడతారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరచుగా అంటుండేవారు. అందుకు తగ్గట్టే చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ముని శాపం ఆయనకేనా ఆ పార్టీ నేతలందరికీ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. అవాస్తవాలను వల్లిస్తూ రోజూ మీడియా సాక్షిగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించే టీడీపీ నేతలు.. మచ్చుకైనా నిజం మాట్లాడారా అన్న సందేహం వచ్చేలా ప్రవర్తిసున్నారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గురువారం మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలు పరిశీలిస్తే ఆ సందేహం మరింత బలపడేలా ఉంది. అధికారం కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎవరినైనా ‎మోసం చేస్తారని, జగన్‌ పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆమె విమర్శించారు.

ఒక్క ఉదాహరణనైనా చూపగలరా?

అధికారం కోసం జగన్‌ ఎవరినైనా మోసగిస్తారంటున్న అనిత ఒక్క ఉదాహరణనైనా చూపాలని వైఎస్సార్‌ సీపీ నేతలు సవాల్‌ చేస్తున్నారు. విలువల కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన చరిత్ర జగన్‌మోహన్‌రెడ్డిది అన్న సంగతి ఆమె గ్రహించాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తనకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని తెలిసి కూడా ఇచ్చినమాట నిలబెట్టుకోవడం కోసం పార్టీని వీడారు. అన్న మాట ప్రకారం తన తండ్రి వైఎస్సార్‌ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడానికి జగన్‌ కట్టుబడ్డారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చాక, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్‌, ఎమ్మెల్యే స్థానానికి ఆమె తల్లి రాజీనామా చేసి విలువలు అంటే ఏమిటో నిరూపించారు. స్వతంత్రంగా పార్టీ పెట్టి, మరే పార్టీతోను పొత్తులు పెట్టుకోకుండా జనామోదంతో తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి అయిన జగన్‌కు పదవులకోసం ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం లేదన్న సంగతి అనిత గమనించాలని సూచిస్తున్నారు.

మోసాలు, కుట్రల్లో పేటెంట్‌ బాబుది కదా..

బలమైన కాంగ్రెస్‌ పార్టీతో పోరాడి తన స్వశక్తితో టీడీపీని అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్‌ను మోసగించి అధికారం లాక్కొన్నది మీ అధినేత చంద్రబాబు కాదా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు అనితను ప్రశ్నిస్తున్నారు. తన అధికారం నిలుపుకోవడం కోసం మొత్తం ఎన్టీఆర్‌ కుటుంబీకులను గత 27 ఏళ్లుగా మోసం చేస్తున్న వ్యక్తిత్వం బాబుది అన్న సంగతి తెలియదా? సోదరుడు రామ్మూర్తినాయుడుకు చంద్రబాబు చేసిన అన్యాయం మరచిపోయారా? అధికారం కోసం మోసాలే కాకుండా ఏమాత్రం విలువలు పాటించకుండా ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీతో పొత్తులు పెట్టుకుని తర్వాత వారిని మోసగించడం చంద్రబాబుకు అలవాటు. ఆయన రాజకీయం జీవితం అంతా అంతే. మోసాలు, కుట్రల్లో పేటెంట్‌ బాబుది కదా అని విమర్శిస్తున్నారు.

అది టీడీపీ సంస్కృతి..

షర్మిలకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆమె పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే పరిస్థితి కల్పించారని అంటున్న అనితకు తాను మాట్లాడే మాటలకు అర్థం తెలుసా? షర్మిల ఎక్కడా తలదాచుకోవడం లేదు. తల ఎత్తుకొని తెలంగాణలో పార్టీని స్థాపించి జనం మధ్య ఉన్నారు. షర్మిలకు మంత్రి పదవి ఇవ్వడానికి అసలు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇష్టపడితే కదా? దొడ్డిదారిన లోకేశ్‌ను మంత్రిని చేసినట్టు జగన్‌ షర్మిలను మంత్రిని చేయరని, ఆమె కూడా అంగీకరించరన్న సంగతి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దొడ్డిదారిన అధికారం చేపట్టడం టీడీపీ సంస్కృతి అన్న సంగతి అనిత గ్రహించాలని ఎద్దేవా చేస్తున్నారు.

Also Read : పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయట!