Idream media
Idream media
ఆయన మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి రెండు సార్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికారంలో ఉన్నప్పుడు వసూళ్ల రాజాగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పోర్టుకు వచ్చే లారీలు, మద్యం సిండికేట్ నుంచి వనమాడి ఆనుచరులు వసూళ్లకు పాల్పడేవారని గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికితోడు ఎమ్మెల్యే అన్నయ్య వనమాడి సత్యనారాయణ కనుసన్నల్లోనే నియోజకవర్గంలో పనులు జరిగేవన్న విమర్శలు ఉండేవి. అధికారంలో ఉండగా అలా చేస్తే.. విపక్షంలో ఉండగా తన ప్రాబల్యం కోసం శవ రాజకీయాలు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. ఇదే కాదు.. ఓడిపోయినప్పటి నుంచీ ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాల అందకుండా కుట్ర పన్నుతున్నారనే అపవాదు ఉంది.
కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి 2004లో వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు. దీంతో ఓటర్లు 2009లో ఆయనను గెలుపునకు దూరం చేశారు. 2014లో మరోసారి తెలుగుదేశం ఆయనకే టికెట్ ఇచ్చింది. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోయానని, మరోసారి అవకాశం కల్పించాలని విన్నవిస్తూ ఓట్లు అడిగారు.
దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచుకోని డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు మరోసారి ఆయనకు అవకాశం కల్పించారు. ఇదే అదునుగా ఆయన సొంతంగా సంపాదించుకోవడానికే ప్రయత్నించారు తప్ప, ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని సొంత సామాజిక వర్గానికి చెందిన మత్య్సకారులే ఆయనపై ఆరోపణలు చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ నిధులను కూడా కొండబాబు దోచుకున్నారని ఆరోపించారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి ప్రజలు మరోసారి విజయం కట్టబెట్టారు.
ఈసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కాకినాడ సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీ పట్ల ఆదరణ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుండగా, ఆ కార్యక్రమం జరిగితే నియోజకవర్గంలో తనను ప్రజలు మరచిపోతారని భావించిన వనమాడి ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టుకు వెళ్లారు. వనమాడి తీరుకు నిరసనగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిరాహార దీక్ష కూడా చేపట్టారు. కొండబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానికులకు ఇళ్ల పట్టాలు అందించారు వైఎస్. జగన్. ఫలితంగా నియోజకవర్గంలో ద్వారంపూడి హవా పెరుగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తన ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఓ హత్యా ఘటనకు కుల, రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నం చేశారు. అయితే, బాధిత కుటుంబమే నిజం వెల్లడించడంతో ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది. కాకినాడ కుంతీదేవిపేటకు చెందిన కలవల అంజిబాబు కొద్దిరోజుల కిందట స్థానికంగా జరిగిన వివాదంలో హత్యకు గురయ్యారు. ఘటన జరిగిన వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి సదరు ఘటనను తనకు అనువుగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది నేతలను రప్పించి మరీ ఇక్కడ రౌడీరాజ్యం నడుస్తుందంటూ ఆ ఘటనను వైఎస్సార్ సీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు వాస్తవం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు కంగుతిన్నారు. హత్యకు గురైన కలవల అంజిబాబు వైఎస్సార్ సీపీ కార్యకర్తగా నిర్ధారణ కాగా, హత్య చేసిన వ్యక్తి టీడీపీ మద్దతుదారుడేనని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే నిర్ధారించడంతో టీడీపీ అసలు రంగు బయటపడింది. తన భర్త వైఎస్సార్ సీపీ కార్యకర్త అని కలవల అంజిబాబు భార్య అనిత చెప్పారు. తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీకి చెందిన వ్యక్తి తన భర్తను హత్య చేశారన్నారు. తన కుటుంబానికి ఎమ్మెల్యే ద్వారంపూడి అండగా ఉండడంతో పాటు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారన్నారు.
అంజిబాబు హత్య కేసులో నిందితుడి తల్లి కలవల ఆదిలక్ష్మి మాట్లాడుతూ తమ కుటుంబం ఆది నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోసమే పని చేసిందన్నారు. ఇప్పుడు తాము ఎవరో తెలియదన్నట్టు వనమాడి మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో తమకు ఎలాంటి పరిచయాలు లేవన్నారు. అంజిబాబు కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే సోదరుడు, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వీరభద్రారెడ్డి అంజిబాబు భార్య అనితకు అందజేశారు. ఇదిలాఉంటే, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టుకెళ్లడం, తాజాగా హత్యా రాజకీయాల పథకం బెడిసికొట్టడం వంటి కారణాలతో స్థానికంగా వనమాడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.