iDreamPost
android-app
ios-app

విలక్షణ వంశీ లెక్క తప్పిన వేళ – Nostalgia

  • Published Jan 10, 2020 | 10:47 AM Updated Updated Jan 10, 2020 | 10:47 AM
విలక్షణ వంశీ లెక్క తప్పిన వేళ – Nostalgia

గోదావరి తీరాన్ని తన సినిమాల్లో ఒక పాత్రగా మార్చి జీవం పోసి వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వంశీది విలక్షణ శైలి. ఇప్పుడంటే ఫామ్ లో లేరు కానీ కెరీర్ మొదలుపెట్టిన తొలి దశాబ్దంలో అద్భుతమైన హిట్స్ ఇచ్చిన వంశీతో ఇళయరాజా కాంబినేషన్ గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవు . కాని ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా ఒక్కోసారి అంచనాలు తప్పి కథలో పొరపాట్లు చేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని పూర్తిగా అందుకోలేరు. అలాంటిదే ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్.

అది 1985వ సంవత్సరం. మంచు పల్లకి – సితార – అన్వేషణ ఇలా ఒకదానితో మరొకటి పోలిక లేని కథలతో చక్కని విజయాలు సాధించి తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పర్చుకున్నారు వంశీ. ఆ సమయంలో ఉషాకిరణ్ రామోజీరావు గారి నుంచి పిలుపు. జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసిన నవలను తెరకెక్కించే ఆలోచన కార్యరూపం దాల్చింది. దాని పేరే ప్రేమించు పెళ్ళాడు. అప్పటిదాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెట్టుకొస్తున్న రాజేంద్ర ప్రసాద్ కు ఫుల్ లెంత్ హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. సంగీతం కోసం మరోమాట లేకుండా ఇళయరాజాకే ఓటు వేశారు వంశీ.

కులపిచ్చి, సంప్రదాయాలతో కన్నకూతురినే తన్ని తరిమేసిన చాదస్తపు తండ్రి కూర్మావతారం(సత్యనారాయణ) కథ ఇది. ఆయనకు కనువిప్పు కలిగించడం కోసం గెంటివేయబడ్డ కూతురి సంతానం రాధ(భానుప్రియ) బావ రాంపండు(రాజేంద్ర ప్రసాద్)ను ప్రేమించి తద్వారా తాతయ్యలో మార్పు తెప్పించడమే అసలు కథ. పాయింట్ బాగానే ఉన్నప్పటికీ వంశీ తన స్టైల్ కు వ్యతిరేకంగా సెంటిమెంట్ డ్రామాను కాస్త ఎక్కువ దట్టించడంతో మొదటి మూడు సినిమాల స్థాయిలో ప్రేమించు పెళ్ళాడు ఘన విజయం సాధించలేకపోయింది.

ఇళయరాజా సంగీతంలోని పాటలు అద్భుతంగా కుదిరాయి. ఇప్పటికీ గోపెమ్మ చేతిలో వెన్నముద్ద పాట మ్యూజిక్ లవర్స్ కు హాట్ ఫేవరేట్. ఇందులో మరో విశేషం భానుప్రియకు డబ్బింగ్ వేరేవాళ్ళతో చెప్పించారు. రచయిత గణేష్ పాత్రో మేజిక్ అంతగా పండలేదు. అలా అని ఫ్లాప్ కాదు కాని వంశీ ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో ప్రేమించు పెళ్ళాడు తక్కువ స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత మరో సీరియస్ డ్రామా ఆలాపన ట్రై చేసిన వంశీ అది దారుణంగా ఫెయిల్ కావడంతో మళ్ళి తన పాత స్కూల్ కు తిరిగి వచ్చి లేడీస్ టైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇక అక్కడి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా సాగలేదు.