iDreamPost
android-app
ios-app

Ranga Ranga Vaibhavanga రంగ రంగ వైభవంగా రివ్యూ

  • Published Sep 02, 2022 | 2:16 PM Updated Updated Dec 23, 2023 | 6:48 PM

థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతోంది. ఆషామాషీ కథలతో బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు హిట్ కాలేదు. అవి టికెట్ డబ్బులకు న్యాయం చేకూర్చాయి. గతంలో చూడని ఒక అనుభూతిని కలిగించాయన్న కారణంతోనే అంతగా బ్రహ్మరథం అందుకున్నాయి.

థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతోంది. ఆషామాషీ కథలతో బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు హిట్ కాలేదు. అవి టికెట్ డబ్బులకు న్యాయం చేకూర్చాయి. గతంలో చూడని ఒక అనుభూతిని కలిగించాయన్న కారణంతోనే అంతగా బ్రహ్మరథం అందుకున్నాయి.

Ranga Ranga Vaibhavanga రంగ రంగ వైభవంగా రివ్యూ

మెగా కాంపౌండ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ కు డెబ్యూనే ఉప్పెన రూపంలో బ్లాక్ బస్టర్ అందించింది. అయితే అన్ని వేళలా సక్సెస్ ఒకేలా పలకరించదని కొండపొలం డిజాస్టర్ కొట్టి హెచ్చరిక చేసింది. ఎంత మెగా అండదండలు ఉన్నా టాలెంట్ ఉంటే తప్ప ఎక్కువ కాలం నిలదొక్కుకోలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తన మూడో చిత్రంగా రంగ రంగ వైభవంగా ద్వారా మరోసారి పలకరించాడు వైష్ణవ్ తేజ్. గిరిశాయ దర్శకత్వంలో సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కేతిక శర్మ హీరోయిన్. మరి టైటిల్ ఉన్నంత వైభవంగా సినిమా ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

చిన్నప్పడు స్కూల్ లో జరిగిన గొడవ వల్ల మాట్లాడుకోవడం మానేస్తారు పక్కపక్క ఇళ్లలో ఉండే రిషి(వైష్ణవ్ తేజ్), రాధా(కేతిక శర్మ)లు. వీళ్ళ వయసుతో పాటే ఈ సరదా శత్రుత్వం పెరిగి పెద్దదై ఒకే మెడికల్ కాలేజీలో చేరేదాకా కొనసాగుతూనే ఉంటుంది. ఓ రాత్రి జరిగిన సంఘటన వల్ల ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. రాజకీయాల వైపు ఆసక్తి చూపించే రాధా అన్నయ్య అర్జున్(నవీన్ చంద్ర) వల్ల స్నేహమంటే ప్రాణమిచ్చే రెండు కుటుంబాలు విడిపోయే పరిస్థితి వస్తుంది. దీని తర్వాత వీళ్ళను కలిపే బాధ్యత రిషి రాధాలు తమ చేతుల్లోకి తీసుకుంటారు. మరి ఈ ప్రేమకథ ఏ మజిలీకి చేరుకుంది, ఎలా ఒకటయ్యారు అనేది తెరమీద చూసి తరించాలి

నటీనటులు

వైష్ణవ్ తేజ్ కు లుక్స్ పరంగా పెద్దగా కంప్లయింట్ లేదు. ఆకట్టుకునే రూపం ఉండటంతో అవకాశాలకు లోటు లేకుండా పోతోంది. ఎటొచ్చి నటన కోణంలోనే తనను తాను మెరుగు పరుచుకోవాల్సింది చాలా ఉంది. ఎంటర్ టైన్మెంట్ సీన్స్ లో బాగానే చేస్తున్నప్పటికీ బరువైన ఎమోషన్లు పలికించే టైంలో మాత్రం అతనిలో తడబాటు స్పష్టంగా గమనించవచ్చు. ఇంకొంత హోమ్ వర్క్, ఎవరైనా అనుభవజ్ఞుల గైడెన్స్ ఉంటే త్వరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలున్నాయి. సాయి తేజ్ తరహాలో టైమింగ్ తో పాటు డాన్స్ మీద ఫోకస్ పెట్టడం అవసరం. యాక్టింగ్ రిస్క్ దీంతో కాకపోయినా భవిష్యత్తులో మరోరూపంలో వస్తుంది. దానికి ప్రిపేరవ్వడం మంచిదే కదా

కేతిక శర్మ ఆకట్టుకుంటుంది. ఎక్స్ ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అప్పుడప్పుడూ బ్యాలన్స్ తప్పినా ఎక్కడిక్కడ కాపాడుకుంటూ వచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ టాలెంట్ తనకు హెల్ప్ అయ్యింది. నవీన్ చంద్ర ఇలాంటి పాత్రలు ఎన్నో చేశాడు. కొత్తేమీ లేదు. సుబ్బరాజు అంతే. నరేష్, ప్రభులు ఈ టైపు క్యారెక్టర్లు ఎన్ని పూర్తి చేశారో లెక్కబెట్టడం కష్టం. నిండు విగ్రహం కలిగిన సీనియర్లను సరైన రీతిలో వాడుకోలేదు. తులసి, ప్రగతి, క్యామియోలో నాగబాబు తదితరులవి అలవాటైన పాత్రలే. సత్య అక్కడక్కడా కొన్ని నవ్వులకు పనికొచ్చాడు. ఇంకొంత తారాగణం ఉంది కానీ మరీ ప్రత్యేకంగా రిజిస్టర్ అయ్యేలా ఎవరిని వాడుకోలేకపోయారు. సో చెప్పాల్సిన అవసరం తప్పింది

డైరెక్షన్ అండ్ టీమ్

హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచి గొడవలు పడుతూ అలాగే పెద్దయ్యి చివరికి ప్రేమలో పడటం అనేది ఎప్పుడో 2000 జమానాలో వాడేసి పిండేసి అరగదీసిన పాయింట్. నువ్వే కావాలి, ఆనందంతో మొదలుపెట్టి నిన్నా మొన్నటి రంగ్ దే దాకా చూసుకుంటే ఎన్ని వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. ఇది దర్శకుడు గిరిశాయకు తెలియంది కాదు. లైన్ సింపుల్ గా ఉన్నా ఎంటర్ టైన్ చేయిస్తే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కదానే నమ్మకం అతని టేకింగ్ లో కనపడింది. ఇలా అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ నిజంగానే ఇలాంటి థీమ్ తో మారిపోయిన ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మెప్పించేలా చెప్పగలమాని ఆలోచించుకున్నట్టు కనిపించదు.

రంగ రంగ వైభవంగా టేకాఫ్ తో మొదలుపెట్టి ప్రతి సీన్ గతంలో చూశాం కదానే ఫీలింగ్ కలిగిస్తుంది. సరే ఆల్రెడీ వచ్చింది మనం వాడుకోకూడదనే రూలేం లేదు కానీ కనీసం ఫ్రెష్ గా చెప్పే బాధ్యత అయితే ఖచ్చితంగా డైరెక్టర్ మీద ఉంటుంది. అంతే తప్ప ఒక రొటీన్ లవ్ స్టోరీకి హీరోయిన్ అన్నయ్య పొలిటికల్ థ్రెడ్ ని జోడించినంత మాత్రాన కొత్తగా మారిపోదు. ఎంతసేపూ ఒక్కొక్క సీన్ తో విడివిడిగా మెప్పిస్తున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్లిన గిరిశాయ ఓవరాల్ గా కంప్లీట్ స్క్రిప్ట్ లో ఉన్న యునీక్ నెస్ ఏంటనేది కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్ల పేరుతో సాగతీత డైలాగులు, ల్యాగ్ సీన్లను తనూ ఫాలో అయ్యాడు.

నేపధ్యం ఏదైనా లీడ్ పెయిర్ మధ్య బలమైన కాంఫ్లిక్ట్ ఉండాలి. అది ఇందులో మిస్ అయ్యింది. రిషి అంతగా రాధను ఇష్టపడే పాయింట్ సరిగా పండలేదు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ సగానికి పైగా రెండిళ్ల చుట్టే తిరగడం విసుగు తెప్పిస్తుంది. బడ్జెట్ తక్కువగా అవుతుంది కాబట్టి తీసినట్టు అనిపిస్తుంది తప్ప అసలు నిర్మాతను ఎగ్జైట్ అయ్యేలా గిరిశాయ ఎలా చెప్పాడో ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం. సింపుల్ జోకుల కోసమో లేదో సాధారణ లవ్ ట్రాక్ కోసమో థియేటర్ కు వచ్చే రోజులు కావివి. పోనీ వైష్ణవ్ తేజ్ తన ఇమేజ్ తో క్రౌడ్ పుల్లింగ్ చేసే స్థాయికి చేరుకుని ఉంటే కనీసం ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చేవి.

ఇతని కోసం టికెట్ కొనాలా వద్దాని ఆలోచిస్తున్న ఆడియెన్స్ తో ఈ తరహా అవుట్ డేటెడ్ మెటీరియల్ తో మార్కెట్ ని సృష్టించుకోవడం కష్టం. రిషి రాధాలు విడిపోయాక మెడికల్ క్యాంప్ లో వాళ్ళు కలుసుకునే ప్రహసనం, తర్వాత అమ్మా నాన్నలను ఒక్కటి చేసే ట్రయిల్స్ అన్నీ నిన్నే పెళ్లాడతా టైం నాటివి. అందుకే కాబోలు టైటిల్స్ కు ముందే చూచాయగా దాని తాలూకు క్లూని వైజాగ్ జగదాంబలో ఆ సినిమా ఆడిన విజువల్స్ ద్వారా చూపిస్తాడు. పదే పదే వైష్ణవ్ తేజ్ చిరంజీవి పాటలు హమ్మింగ్ చేయించడం, ఆయన పాత హిట్ సాంగ్ కి డాన్సు చేయించడం ఇవన్నీ మెగా ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయనే గిరిశాయ లెక్క పూర్తిగా తప్పింది. యూత్ ని టార్గెట్ చేసుకున్నప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ నైనా వాడుకోవాల్సింది.

ఇప్పటి యువతకు తేలిగ్గా తీసుకోవడానికి లేదు. తరుణ్ నువ్వు లేక నేను లేను ఒకప్పుడు బ్రహ్మాండంగా ఆడిన బొమ్మే కావొచ్చు. మళ్ళీ అలాంటి దాన్నే తీసుకున్నప్పుడు కనీసం హిలేరియస్ ఫన్ ఉండాలి. రెండు ఫ్యామిలీస్, ఇద్దరు ఆడ లేడీసు, వాళ్ళ మధ్య కాసిన్ని బాండింగ్ సీన్లు అల్లేస్తే ఒప్పుకునే స్థితిలో జనం లేరు. ఎమోషన్స్ ని పండించడమంటే క్లోజప్ షాట్స్ లో కన్నీళ్లు పెట్టించడమో, లేదా క్లైమాక్స్ లో హీరోయిన్ నాన్నతోనో హీరో అమ్మతోనో క్లాసులు పీకించడం కాదు. సింపుల్ నెరేషన్ ని స్వీట్ గా చెప్పడం. నువ్వే కావాలిలో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు పాటకు నిజంగానే ఏడ్చిన కాలేజీ కుర్రకారు ఉన్నారు. కానీ ఈ జనరేషన్ అంత స్వీట్ అండ్ సెన్సిటివ్ గా లేరని గుర్తుంచుకుంటే బెటర్.

గిరిశాయలో సున్నితత్వం ఉంది. తన గురువు సందీప్ రెడ్డి వంగా ప్రభావం కన్నా ఒక హెల్తీ సినిమా తీయాలన్న తపన ఉంది. కానీ అదొక్కటే ఉంటే సరిపోదుగా. థియేటర్ ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతోంది. ఆషామాషీ కథలతో బింబిసార, కార్తికేయ 2, సీతారామంలు హిట్ కాలేదు. అవి టికెట్ డబ్బులకు న్యాయం చేకూర్చాయి. గతంలో చూడని ఒక అనుభూతిని కలిగించాయన్న కారణంతోనే అంతగా బ్రహ్మరథం అందుకున్నాయి. అలాంటప్పుడు ఇరవై ఏళ్ళ వెనక్కు వెళ్లి అవే కథలను తిప్పి రాసుకుంటే ఆ మాత్రం దానికి ఓటిటి ఉంది కదా అనుకుంటున్నారు ఇప్పటి వ్యూయర్స్. వడలిపోయిన గతం కన్నా వర్తమానం ముఖ్యం

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం రంగరంగ వైభవంగాకు మరీ మైనస్ గా నిలవలేదు. ఉన్నంతలో రెండు పాటలు బాగున్నాయి. కొత్తగా ఉందేంటి క్యాచీ ట్యూన్ వెంటాడుతుంది. ఇదీ ఎప్పుడో విన్నట్టే అనిపించినా కనీసం ఆడియో వీడియో పరంగా మెప్పించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అధికశాతం దాంతోనే మేనేజ్ చేశాడు. శ్యాం దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది కానీ పరిమిత లొకేషన్లు, టేకింగ్ స్టైల్ వల్ల కొన్ని ఆంక్షల మధ్య కట్టుబడిపోయింది. అనుభవజ్ఞులు కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ లెన్త్ ని కొంత తగ్గించి ఉంటే బాగుండేది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు తెలివిగా ఉన్నాయి. ఖర్చు లిమిట్స్ లోనే సాగింది

ప్లస్ గా అనిపించేవి

హీరో హీరోయిన్ జంట
రెండు పాటలు
అశ్లీలత లేకపోవడం

మైనస్ గా తోచేవి

రొటీన్ కథా కథనాలు
సంభాషణలు
సెకండ్ హాఫ్
ఎమోషనల్ కనెక్షన్

కంక్లూజన్

సినిమా చూసే ప్రేక్షకులు వాళ్ళ దృక్పథం మారాయి. దర్శకులు మాత్రం పాత స్కూల్ లోనే ఉంటామంటే చెల్లదు. కొత్త కథలు చెప్పమని ఆడియన్స్ డిమాండ్ చేయడం లేదు. కనీసం పాత కథలైనా సరే కొత్తగా చెప్పమని అడుగుతున్నారు. ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఇంక క్రియేటివిటీకి అర్థమేముంది. తెరనిండుగా ఆర్టిస్టులను చూపిస్తాం, అరిగిపోయిన ఫార్ములాలనే ఆదరించమంటే వాళ్లకు మాత్రం జాలి ఎందుకుంటుంది. అందుకే రంగ రంగ వైభవంగాలు ఎన్ని వచ్చినా థియేటర్ కు వచ్చే జనం మాత్రం తమ సెలక్షన్ పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు. మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ప్రపంచంలో మంత్రసానుల మందులు పని చేయవు మాస్టారూ

ఒక్కమాటలో

రేటింగ్ : రొటీన్ రొటీన్ సాగదీయంగా

రేటింగ్ : 2 / 5