iDreamPost
iDreamPost
అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ కవితకు కాదేదీ అనర్హం అన్నాడు వెనకటికొక మహాకవి. ఇప్పుడు మోసగాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతున్నట్టున్నారు. తాము మోసం చేసేందుకు మోసపోయేవాళ్ళు ఉంటే చాలన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. సమాచార సాధనాలు విస్తృతమైన నేపథ్యంలో మోసాల విస్తృతి కూడా అంతే ఎక్కువగా ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పుల్ని సామాన్యుల కంటే ముందే మోసగాళ్ళు ఆకళింపు చేసుకుని, తద్వారా మోసాలకు తెరలేపుతున్నారు.
ఇప్పుడు సదరు మోసగాళ్ళకు కోవిడ్ టీకా ఒక ఆయుధంగా మారేందుకు అవకాశం ఉందన్న ఇంటర్నేషనల్ దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ టీకాలు జనం ముందుకు వస్తాయన్న అభిప్రాయాన్ని సదరు సంస్థల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 140 వరకు సంస్థలు టీకా పరిశోధనల్లో ఉన్నాయి. వీటిలో 53 టీకా మోడళ్ళు ఆశావహ ఫలితాలను ఇచ్చాయి. వాటిలో ఫైజర్– బయో ఎన్‌టెక్ టీకాకు మాత్రమే తొలి అనుమతి లభించింది. ఇప్పటి వరకు టీకాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలకు సంబంధించిన టీకాలకు కూడా అనుమతులు వచ్చేందుకు అవకాశాలు లేకపోలేదు.
అయితే సరిగ్గా మోసగాళ్ళుఇక్కడే జనాన్ని టార్గెట్ చేసేందుకు అవకాశాలు చిక్కుతాయన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం వృద్ధులు, వారి సహాయకులు, ఆరోగ్య సిబ్బంది.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే టీకాను అందజేసేందుకు దాదాపు అన్నిదేశాలు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. సామాన్య జనానికి టీకా వేసేందుకు ఇంకాస్త సమయం తప్పకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో లేనిపోని ఆదుర్దాతో టీకా కోసం ప్రయత్నిస్తే డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు, మోసపోయే అవకాశం కూడా ఉంటుందని దర్యాప్తు సంస్థలు హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా తమతమ ఆర్ధిక పరిస్థితులను బట్టి ప్రజలకు ఉచితంగానే టీకాను అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆయా దేశాల పరిస్థితులను బట్టి ఇది మారేందుకు అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మందుల విషయంలో నకిలీలకు పెట్టింది పేరైన మన దేశంలో ఈ పరిస్థితి ఇంకాస్త ముదిరేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. ప్రజల్లో ఉండే భయాందోళనలను క్యాష్ చేసుకునేందుకు నకిలీరాయుళ్ళు వలలు, గేలాలతో ఇప్పటికే సిద్ధ పడి ఉంటారని చెబుతున్నారు. ఇక్కడ ప్రజల అప్రమత్తతోనే వారికి చిక్కకుండా తప్పించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. టీకా విషయంలో ప్రభుత్వాన్ని నూరుశాతం నమ్మి, సదరు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే మోసపోకుండా ఉంటారనడంలో ఎటువంటి సందేహం ఉండదు.